Pune Murder case

Pune Murder case : మహారాష్ట్రలోని పుణేలో తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను ప్రియుడితో కలిసి లోయలోకి తోసి చంపిన కేసులో నిందితురాలు సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేతన్‌కు ముందే చెప్పానని, కానీ అతను పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదని పోలీసులకు తెలిపింది. తన కుటుంబం చాలా పలికుబడి ఉన్న ధనవంతుల కుటుంబమని, ఒకవేళ ఇక్కడి నుంచి పారిపోయినా సరే.. ఈ పెళ్లి నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవంటూ కేతన్ తనను బెదిరించాడని సియా ఆరోపించింది. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నిజమా కాదా అనేది కోర్టు విచారణలో తేలాల్సి ఉంది.

Also Read : అయోధ్య రామాలయం విరాళాల గోల్‌మాల్: నిందితులకు జీవిత ఖైదు!

Pune Murder Case

నిజానికి సియా, కేతన్‌లకు గత ఫిబ్రవరిలోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో జైపూర్‌లోని ఒక పెద్ద ప్యాలెస్‌ను రూ. 17 కోట్లకు బుక్ చేసి, అతిథుల కోసం రెండు ప్రైవేట్ జెట్ విమానాలను కూడా అరేంజ్ చేసి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. అయితే, ఆలోపే సియాకు చేతన్ చౌదరి అనే యువకుడితో అఫైర్ మొదలైంది. వీరిద్దరూ గత ఏడు నెలల్లోనే ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకుంటూ, దాదాపు 238 గంటల సమయం గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగానే.. వీరు కేతన్‌ను వదిలించుకోవడానికి స్కెచ్ వేశారు.

మొదట జూన్ 14న లోహగఢ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లిన సియా, అతడిని లోయలోకి నెట్టేయడానికి ప్రయత్నించింది. కానీ కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడ పాము ఉందంటూ సియా గట్టిగా అరిచి, భయపడినట్టు నటిస్తూ కేతన్‌ను గట్టిగా కౌగిలించుకుని డ్రామా ఆడింది. ఆ ప్లాన్ ఫెయిల్ కావడంతో.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే కోటకు కేతన్‌ను రప్పించింది. ఈసారి తన ప్రియుడు చేతన్‌ను కూడా అక్కడికి పిలిపించి, ఇద్దరూ కలిసి కేతన్‌ను వెనుక నుంచి లోయలోకి తోసేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఒకవేళ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే అమలు చేయడానికి ప్లాన్-సిని కూడా వీరు ముందే సిద్ధం చేసుకున్నట్లు కేస్ ఫైల్స్ ద్వారా తెలిసింది.

మొదట్లో బలమైన గాలుల వల్ల ఫోటోలు తీసుకుంటూ కేతన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడని సియా పోలీసులను నమ్మించింది. కానీ, కాబోయే భర్త చనిపోయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి బాధ లేకపోవడంతో లోనావాలా రూరల్ పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో టెక్నికల్ విచారణ జరిపి అసలు గుట్టు రట్టు చేశారు. ప్రస్తుతం సియా, ఆమె ప్రియుడు చేతన్ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్న వీరిద్దరూ.. మర్డర్ ప్లాన్ నీదంటే నీది అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. తాను కేవలం లేచిపోదామనే అనుకున్నానని, హత్య చేయాలనే ఐడియా సియాదేనని చేతన్ అంటుండగా.. ప్రియుడే బలవంతం చేసి ఈ పని చేయించాడని సియా వాదిస్తోంది.

Also Read : దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన భయంకరమైన స్టోరీ

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.