Gold Prices
Gold Prices
Crime News : ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగిన ఒక లగ్జరీ నగల దుకాణం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. సినిమా స్క్రీన్‌ప్లేను తలపించేలా జరిగిన ఈ రూ. 4 కోట్ల భారీ చోరీ వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల ప్లాన్ చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోయారు. తన ప్రేయసితో ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం కోసం ఒక యువకుడు పక్కా స్కెచ్‌తో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నితిన్ వర్మ అనే యువకుడు తన ప్రేయసి కాజల్ వర్మను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి ఖర్చుల కోసం భారీగా డబ్బు అవసరం అవ్వడంతో, గాజియాబాద్‌లోని ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేశాడు. అందుకోసం పథకం ప్రకారం నెలన్నర క్రితమే ఆ నగల దుకాణంలో ఉద్యోగిగా చేరాడు. లోపల భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? విలువైన బంగారం, వజ్రాలు, రత్నాల ఆభరణాలను ఎక్కడ భద్రపరుస్తారు? సిబ్బంది కదలికలు ఎలా ఉంటాయి? అనే అంశాలపై పూర్తి నిఘా పెట్టాడు. తన ప్లాన్ అమలు చేయడానికి నితిన్ జూన్ 12ను ముహూర్తంగా ఎంచుకున్నాడు. తన ప్రియురాలు కాజల్‌తో వివాహం నిశ్చయమైందంటూ నమ్మించి షోరూమ్ సిబ్బంది అంతటికీ ఒక గ్రాండ్ లిక్కర్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి నితిన్ తండ్రితో పాటు ప్రేయసి కాజల్ వర్మ కూడా హాజరై నాటకమాడారు.
ఈ పార్టీలో షోరూమ్ తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజ్‌ను నితిన్ టార్గెట్ చేశాడు. అతడితో పరిమితికి మించి మద్యం తాగించాడు. పార్టీ ముగిశాక మత్తులో ఉన్న క్యాషియర్‌ను ఇంటి దగ్గర దింపుతాననే నెపంతో బైక్‌పై తీసుకెళ్లి, అత్యంత తెలివిగా అతడి వద్ద ఉన్న షోరూమ్ ఒరిజినల్ తాళాలను కాజేశాడు. మరుసటి రోజు ఉదయం నితిన్ తన ప్లాన్‌ను తుది దశకు చేర్చాడు. రాత్రిపూట కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు ఉదయం 7 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన వెంటనే నితిన్ తన స్నేహితుడితో కలిసి షోరూమ్ వద్దకు వచ్చాడు.
దొంగిలించిన తాళాలతో సులభంగా షట్టర్ తెరిచి లోపలికి ప్రవేశించాడు.కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే మొదటి అంతస్తులో ఉన్న రూ. 4 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, నవరత్నాల ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.షోరూమ్‌లో కనీసం అత్యవసర అలారం (Anti-theft Alarm) వ్యవస్థ కూడా లేకపోవడం నిందితుడికి మరింత కలిసి వచ్చింది. ఉదయం షోరూమ్ తెరిచే సమయానికి దొంగతనం జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సిసిటివి ఫుటేజ్, సిబ్బంది ప్రవర్తన ఆధారంగా విచారణ జరపగా నితిన్ వర్మ గుట్టు రట్టయింది.
పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనం చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఈ క్రైమ్ నెట్‌వర్క్‌లో భాగస్వాములుగా ఉన్న ప్రధాన నిందితుడు నితిన్ వర్మతో పాటు, అతడికి సహకరించిన తండ్రిని, ప్రేయసి కాజల్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన రికవరీ ప్రక్రియ, ఈ కేసులో ఇతర స్నేహితుల ప్రమేయంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.