Tamil Nadu : తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ఒక్కసారిగా రసాయన వాయువు లీకవడంతో భారీ ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ‘సెయింట్ పీటర్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ (Ammonia Gas) లీకై ఏడుగురు మహిళా కార్మికులు ఊపిరాడక ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ లోపల దాదాపు 70 మందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్నారు. గ్యాస్ లీకేజీని గమనించే లోపే రసాయన వాయువు ప్లాంట్ అంతటా వేగంగా వ్యాపించింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది తీవ్ర శ్వాసకోస ఇబ్బందులకు గురై స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఫ్యాక్టరీ అద్దాలు, తలుపులు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకువచ్చారు.
ఈ దుర్ఘటనలో మొత్తం 60 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న బాధితులలో 21 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐసీయూలో వారికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బాధితుల్లో అత్యధికులు మహిళలే కావడం గమనార్హం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పందించిన సీఎం విజయ్.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత మంత్రులను, ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం అందేలా చూడాలని ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్ నేరుగా ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఫ్యాక్టరీలో రక్షణ ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్లాంట్‌లో గ్యాస్ పైప్‌లైన్ నిర్వహణ సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమగ్రమైన సాంకేతిక లోపాలపై పూర్తి స్థాయి దర్యాప్తునకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, కార్మికుల ప్రాణాలను గాల్లో కలిపేలా వ్యవహరించినందుకు గాను ‘సెయింట్ పీటర్ అండ్ పాల్ సీఫుడ్స్’ ఫ్యాక్టరీ యజమానితో పాటు మరో ఇద్దరు కీలక నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. ప్లాంట్‌లో క్లోరిన్, అమ్మోనియా నిల్వల నిర్వహణపై కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నుంచి కూడా పోలీసులు నివేదిక కోరారు.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.