BSNL Recharge Plans
BSNL Recharge Plans

ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, జియో, వీఐ ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్‌లను సవరిస్తూ తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. మంత్లీ ప్లాన్‌ల ధరలను పెంచుతూ ఇప్పటికే ప్రజలపై భారం మోపాయి. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL నడుస్తోంది. ఇప్పటి వరకు BSNL సంస్థ యూజర్లను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్లతో రీఛార్జ్ ధరలను తక్కువకే అందిస్తూ వచ్చింది. అయితే తాజాగా తన మంత్లీ ప్లాన్‌లో భారీ మార్పులు చేసింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.225ల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను సవరించింది. అయితే సవరింపులో రీఛార్జ్ ధరను పెంచనప్పటికీ.. ప్లాన్ వ్యాలిడిటీ రోజులను మాత్రం తగ్గించింది. దీని ద్వారా వినియోగదారులపై అదనపు భారాన్ని మోపింది.

ఎన్ని రోజులు తగ్గించిందంటే..?

గతంలో BSNL రూ.225లతో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీ లభించేది. అలాగే ప్రతిరోజూ 2.5జీబీ హై స్పీడ్ డేటా వచ్చేది. దేశంలో ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉండేది. అలాగే ప్రతిరోజూ 100SMS లు ఫ్రీగా లభించేవి. అయితే ఇప్పుడు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీకి బదులుగా.. కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే 2 రోజులు తగ్గించింది.

సాధారణంగా రెండు రోజులు తగ్గడం పెద్ద సమస్యేమి కాదని అనుకోవచ్చు. కానీ గణాంకాల ప్రకారం.. ఇది యూజర్ల జేబులపై ప్రభావం చూపనుంది. ఈ ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ ఉన్నపుడు రోజువారీ సగటు ఖర్చు రూ.7.50గా పడేది. కానీ అది 28 రోజుల వ్యాలిడిటీకి మారిన తర్వాత రోజువారీ సగటు ఖర్చు రూ.8.03కి పెరిగింది. దీనివల్ల సంవత్సరం పొడవునా ఈ ప్లాన్‌ను వాడే వినియోగదారులు.. ఇది వరకు 12 సార్లు రీఛార్జ్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏడాదిలో 13సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

ఏది ఏమైనప్పటికీ ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే మాత్రం BSNL నెట్‌వర్క్ రీఛార్జ్ ప్లాన్‌ ధరలు చాలా తక్కువనే చెప్పాలి. మిగతా నెట్‌వర్క్‌ కంపెనీకు ఇదే డేటా, వ్యాలిడిటీతో నెలకు రీఛార్జ్ చేయాలంటే కనీసం రూ.400 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానిబట్టి చూస్తే BSNL ఇప్పటికీ ఉత్తమ ఎంపికగానే నిలుస్తుంది.