-RAVI PRAKASH

Facebook Live To Funeral pyre : ఒక యువకుడు తన ఇంటి మేడ మీద నిలబడి ఉన్నాడు.చేతిలో నాటు తుపాకి ఉంది.పోలీసు వాహనాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.అక్కడి స్థానికుల్లో ఉత్కంఠ. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఈ దృశ్యాన్ని బీహార్ మొత్తం చూస్తోంది.మీరు చూస్తున్నది సినిమా కాదు.ఇది రీమేక్ కాదు.ఇది నిజం.ఆ మేడ మీద నిలబడిన ఆ యువకుడే భరత్ భూషణ్ తివారీ. జాగ్రత్తగా వినండి. కొన్నిగంటలు నడిచిన ఈ సిచ్యువేషన్‌, ఇప్పుడు బీహార్‌లో పెద్ద దుమారం రేపుతోంది.వీడియోల్లో భరత్ తుపాకి పట్టుకుని కనిపిస్తున్నాడు.కోపంగా ఉన్నాడు.ఉద్వేగంగా ఉన్నాడు.ఎవరికీ లొంగననే ధోరణిలో ఉన్నాడు.కొన్నిసార్లు అధికారులను వార్న్ చేస్తున్నాడు.మరికొన్నిసార్లు వ్యవస్థ మోసం చేసిందని ఆరోపిస్తున్నాడు. ఆ తర్వాత పరిస్థితి చేయి దాటిపోతుంది. తుపాకి పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. లొంగిపోవాలని పోలీసులు పదే పదే కోరుతున్నారు. వెపన్ కింద పెట్టాలని పదే పదే అడుగుతున్నారు. ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.ప్రతిదీ రికార్డవుతోంది.అంతా లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి హెచ్చరిక. ప్రతి సవాలు. ఉత్కంఠభరితమైన ప్రతి క్షణం రికార్డ్‌ అయింది.

ఆ తర్వాత మరో ఆశ్చర్యకరమైన సంఘటన. పోలీసులు దగ్గరికి వస్తారు. ఒక దశలో భరత్ మేడ మీద లేడు. తన ఇంటి గుమ్మం దగ్గర ఉన్నాడు. తల్లి అక్కడే ఉంది. పోలీసులు ఉన్నారు.ప్రజల కళ్లెదురుగా చర్చలు జరుగుతున్నాయి.ఈ దశలో కూడా భరత్ చేతిలో తుపాకి కనిపిస్తూనే ఉంది. పోలీసులు భరత్‌తో మాట్లాడుతున్నారు. తల్లి కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. శాంతియుతంగా లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.ఇక్కడే ఈ కథ అనూహ్య మలుపు తిరిగింది.సాధారణ ఎన్‌కౌంటర్లలా కాకుండా, కాల్పులు జరగడానికి ముందున్న కీలక ఘట్టం అందరి కళ్లముందు ఉంది.ఈ గొడవలో ఎక్కువ భాగం రికార్డయింది. చాలా వరకు లైవ్ స్ట్రీమింగ్ అయింది.

Also Read : ముంబైలో వర్ష బీభత్సం.. మేయర్ ముందే మ్యాన్ హోల్ లో పడ్డ పౌరుడు.. సంచలన ఆదేశాలు!

Facebook Live To Funeral Pyre

భరత్‌ను ప్రజలు చూడొచ్చు.పోలీసులను ప్రజలు చూడొచ్చు.వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు వినొచ్చు. ఇక ఇప్పుడు అసలు వివాదానికి కారణమైన ఆ క్షణం రానే వచ్చింది.తర్వాత వైరల్ అయిన వీడియోల ప్రకారం, భారత్ లొంగిపోవడానికి అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తుపాకి కింద పెట్టేసాడు.ఆయుధాన్ని పక్కకు విసిరేశారు.ఘర్షణ ముగిసినట్లే కనిపించింది. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు కనిపించింది. అంతలోనే ఫేస్‌బుక్ లైవ్ కట్ అయింది.కెమెరా ఆఫ్ అయింది.ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఇప్పుడు బీహార్‌ను కుదిపేస్తున్న ప్రశ్న.ఎందుకంటే కొద్దిసేపటికే భరత్ భూషణ్ తివారీ చనిపోయాడు.

మేం చేసింది కరెక్టే అంటోంది పోలీసు శాఖ.అప్పటికే లొంగిపోయాడంటుంది భరత్ కుటుంబం.ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటున్నాయి ప్రజాసంఘాలు. న్యాయ విచారణకు ఆదేశించింది బీహార్ ప్రభుత్వం.పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.అన్ని పార్టీల నాయకులు సమాధానాలు డిమాండ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటూ వేలాది మంది ఆందోళనలు చేపట్టారు.భరత్ అంత్యక్రియల్లో పాల్గొని నినాదాలు చేశారు.భారత్ మంచివాడా కాదా అనేది ఇప్పుడు బీహార్ చర్చించడం లేదు.భరత్ తప్పులు చేశాడా లేదా అనేది కూడా చర్చించడం లేదు.ప్రస్తుతం అందరూ అడుగుతున్న ప్రశ్న చాలా పెద్దది. ఒక మనిషి ఆయుధం కింద పెట్టి లొంగిపోతానంటే, ఆ తర్వాత ఏం జరగాలి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, అసలు భరత్ భూషణ్ తివారీ ఎవరు అనేది ముందు తెలుసుకోవాలి.ఎందుకంటే ఇరువర్గాలు చెప్పేదానికంటే ఈ కథ చాలా లోతైనది.

ఏం జరిగింది? అని ఎవరిని అడుగుతున్నారనే దానిపై స్టోరీ ఆధారపడి ఉంటుంది.పోలీసులను అడిగితే ఒక కథ చెబుతారు. కుటుంబ సభ్యులను అడిగితే మరో కథ చెబుతారు.రాజకీయ నాయకులను అడిగితే ఇంకొన్ని కథలు వినిపిస్తాయి.కానీ,ఆ ఎన్‌కౌంటర్ గురించి తెలుసుకునే ముందు, ఆ ఘటనకు కేంద్ర బిందువుగా ఉన్న వ్యక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి.ఎందుకంటే భరత్‌ భూషణ్ తివారీ ఆ ప్రాంతంలో ఎవరికీ తెలియని ముఖం కాదు.

Also Read : బ్రాలు, శానిటరీ ప్యాడ్లు తీయించి.. నీట్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినీల పట్ల సిబ్బంది అమానుషం..

భరత్‌ మరణం జాతీయ స్థాయిలో వార్త కాకముందే, షాపూర్ పరిసర ప్రాంతాల్లో చాలామందికి సుపరిచితుడు.ఎలాంటి రాజకీయ పదవి లేకపోయినా,బలమైన కుటుంబ నేపథ్యం లేకపోయినా,వందలాది జీవితాలను అతలాకుతలం చేసిన సమస్యలకు భరత్ గొంతుకయ్యాడు.అదే వరదలు.అదే నిర్వాసితుల  సమస్య.గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతం నదికోతలకు, వరదలకు గురైంది.ఎన్నో కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయి.గ్రామాలు దెబ్బతిన్నాయి. తమ సొంతం అనుకున్నవన్నీ వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.అయితే ఆ పునరావాస కేంద్రాల్లో జీవితం దారుణంగా ఉందనేది స్థానికులు ఆరోపించారు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇక్కడ ఎలా బతకాలంటూ జనం నుంచి కంప్లైంట్స్‌ వెల్లువలా పోటెత్తాయి.ప్రభుత్వం సరైన పునరావాస చర్యలు చేపట్టలేదని చాలామంది నినదించారు.

ఇక్కడే భరత్ భూషణ్ తివారీ ఎంట్రీ ఇచ్చాడు.నిర్వాసిత కుటుంబాల దుస్థితిపై గళమెత్తాడు. కేవలం చూస్తూ ఉండిపోయే వ్యక్తిలా కాకుండా..వారి సమస్యలను లేవనెత్తడంలో భరత్‌ దూకుడిగా వ్యవహరించాడు.బాధిత ప్రాంతాల నుంచి భరత్‌ వీడియోలు రికార్డు చేశాడు.ఫేస్‌బుక్ లైవ్‌లతో సమస్యను సమాజానికి చూపెట్టాడు. అధికారులను ప్రశ్నించాడు. వరద బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పదేపదే డిమాండ్ చేశాడు.సర్వస్వం కోల్పోయిన ప్రజల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండాలి? అనేక వీడియోలలో భరత్ సూటిగా ప్రశ్నించడం కనిపిస్తుంది.రెండేళ్లుగా వరద బాధితుల సమస్యపై భరత్ పోరాటం చేస్తున్నాడని అతడి సపోర్టర్స్‌ అంటున్నారు. భరత్ క్రమం తప్పకుండా అధికారులను కలిసేవాడని,  పాలనా యంత్రాంగంలోని నేతలను సంప్రదించేవాడని, ఫిర్యాదులు సైతం అనేకం సమర్పించాడని, పునరావాస హామీలపై నిరంతరం ఆరా తీసేవాడని భరత్ అనుచరులు చెప్తున్నారు.

ఈ క్రమంలో, సామాన్య ప్రజల కష్టాలపై వ్యవస్థను ఎదిరించే వ్యక్తిగా భరత్  గుర్తింపుతెచ్చుకున్నాడు. ప్రజలకు నిత్యం అందుబాటులో వారి సమస్యలు వినే వ్యక్తిగా అనేక వీడియోలలో కనిపిస్తారు.

వరద బాధితులు.నిరాశ్రయులైన కుటుంబాలు. తమ గోడు వినేవారు ఎవరూ లేరని భావించిన జనం.వీరందరికీ ఒకటే గొంతు…అదే భరత్‌.తమకు తెలిసిన భరత్ కథ ఇదేనంటూ ఆయన మద్దతుదారులు గుర్తుచేసుకుంటారు. అధికారాన్ని ధిక్కరించిన యువకుడు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేసిన వ్యక్తి. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యశాలి. భరత్ విషయంలో ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే.భరత్ వీడియోలు, బహిరంగ ప్రకటనలను మనం లోతుగా పరిశీలిస్తే మరో కోణం బయటపడింది. అతడి ఆవేశం గొడవపడే స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని ఇకపై సింపుల్‌గా చూడలేం. ఈ ఘర్షణ ఎలా ప్రాణాంతక మలుపు తీసుకుందో అర్థం చేసుకోవాలంటే, ఆ కోణాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిందే.వరద బాధితుల కోసం మాట్లాడిన అదే భరత్, రానూ రానూ ప్రవర్తనలోనూ, మాట్లాడే విధానంలోనూ చాలా మార్పు వచ్చింది. మాటల్లో సంయమనం తగ్గింది.ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎదురుదాడి చేసే ధోరణి పెరిగింది.ఈ దూకుడు తత్వం తనను ఏకీభవించే వారిని సైతం ఆందోళనకు గురిచేసే స్థాయికి చేరింది.ఇక్కడే ఈ కథలో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఇప్పటివరకు మీరు భరత్ భూషణ్ తివారీలో ఒక కోణాన్ని చూశారు. ఆయనకు మద్దతుగా నిలబడేవాళ్ళు చెప్పే కోణం అది.ఒక ఉద్యమకారుడు. స్ఫూర్తిని రగిల్చే ధీశాలి.వరద బాధితులు, పునరావాసం, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి నిలదీసిన ఒక యువకుడు. కానీ కథ ఇంతటితో అయిపోలేదు. ఇందులో మరో కోణం కూడా ఉంది. అందుకే దీనిపై ఇంత వివాదం నడుస్తోంది. ఒక న్యాయ విచారణ కూడా జరుగుతోంది. భరత్ తీసిన వీడియోలే అసలు నిజం ఏంటో బయటపెడుతున్నాయి. ఆ నిజం కళ్లారా చూడాల్సిందే. రోజులు గడుస్తున్న కొద్దీ భరత్ మాట్లాడే విధానం మారింది. అసహనం మరింత స్పష్టంగా కనిపించింది.కోపం ఎక్కువైంది. ప్రభుత్వాన్ని విమర్శించే తీరు మరింత పెరిగింది.సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని వీడియోలు, పోస్టుల్లో వ్యవస్థను కేవలం ప్రశ్నించడంతో ఆగిపోలేదు. దాంతో నేరుగా ఢీకొనే స్థాయికి వెళ్లాడు.కొన్ని వీడియోల్లో భరత్ అధికారుల పేర్లు డైరెక్ట్‌గా ప్రస్తావించాడు.ప్రజల కష్టాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. అధికారంలో ఉన్నవాళ్ళు హామీలు ఇస్తారే తప్ప, వాటిని నిలబెట్టుకోరని పదే పదే మండిపడ్డాడు.

పైపైన చూస్తే ఇది రాజకీయ విమర్శలా అనిపించవచ్చు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు.అధికారులను ప్రశ్నించడం నేరం కాదు. అన్యాయంపై పోరాడటం చట్టవ్యతిరేకం కాదు.బాధ్యత వహించాలని డిమాండ్ చేయడం నేరం కాదు.కానీ ఆందోళన కాస్తా వివాదాస్పదంగా మారినప్పుడే అసలు సమస్య వస్తుంది.ఎందుకంటే భరత్ బహిరంగ ప్రకటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.పోరాటం గురించి ఆయన మాట్లాడిన వీడియోలు, పోస్టులు చూస్తే అర్థమవుతుంది.విప్లవం గురించి, వ్యవస్థపై తిరుగుబాటు గురించి మాట్లాడాడు.తన పోరాటం కోసం ఆయుధాలు కూడా సేకరిస్తానని అన్నాడు.ఆ మాటలు కేవలం కోపంతో అన్నవా?  లేక రాజకీయ ఎత్తుగడా?  మానసిక ఆందోళనలో నుంచి వచ్చినవా?లేక అంతకుమించి ఏమైనా ఉందా? అనేది తేలాలి. కానీ ఆ మాటలన్నీ రికార్డుల్లో ఉన్నాయి.వాటిని చూసీ చూడనట్టు వదిలేయలేం.

అలాగే భరత్‌ చేసిన సామాజిక సేవను కూడా పక్కన పెట్టలేం. ఇక్కడే ఈ కథ చాలా గందరగోళంగా మారుతుంది. భరత్‌ను ఒకేలా చూడలేకపోతున్నారు.మద్దతుదారులు చెబుతున్నట్టు పూర్తిగా సాధువు కాదు.అలాగని ఒక నేరస్థుడిగా కూడా ముద్ర వేయలేం. పైకి కనిపించే దానికి, అసలు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది.భరత్ చనిపోయిన తర్వాత మరో ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది.భరత్‌కు మెంటల్ స్టెబిలిటీ లేదా..?జూన్ 16న పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భరత్ ప్రవర్తన చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టు కనిపిస్తోందని పోలీసులు చెప్పారు.నిజానికి ఆయన్ని మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసుల ప్రకటనలో ఉంది.ఈ ప్రకటన వెంటనే కొన్ని కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.భరత్ మానసిక క్షోభను ఎదుర్కొంటున్నాడా? తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు.

ఏళ్ల తరబడి సాగిన పోరాటం, నిరాశ, విరక్తి  భరత్‌ను చివరి దశకు చేర్చాయా? లేదంటే మానసిక రోగి అనే ముద్రను కావాలనే వేశారా?ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆధారాలు ఏమీ లేవు.కానీ ఇక్కడ మనం కచ్చితంగా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. జూన్ 16న భరత్‌కు చికిత్స అవసరమని పోలీసులు స్వయంగా చెప్పారు.కానీ, 24 గంటలు తిరక్కుండానే, అదే వ్యక్తి ఒక పోలీసు ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు.ఈ వైరుధ్యమే ఇప్పుడు ఈ వివాదానికి మెయిన్ రీజన్‌. జూన్ 17న ఏం జరిగిందో తెలుసుకునే ముందు, జూన్ 16న ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి. జూన్ 16 నాటి ఘటనలు ఈ కేసులో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చేజారిన అవకాశాలపై అనుమానాలు వస్తున్నాయి. ఈ మరణాన్ని ముందే ఆపగలిగే అవకాశం ఉందా? లేదా? అని ఆలోచించాల్సి వస్తోంది.

భరత్ భూషణ్ తివారీ చనిపోవడానికి ఇరవై నాలుగు గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకుంటేనే, బీహార్ ఈ రోజు ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతుందో అర్థమవుతుంది.జూన్ 16.ఎన్‌కౌంటర్ జరగడానికి ముందు రోజు.ఈ పాటికే పోలీసులకు భరత్ గురించి పూర్తి సమాచారం తెలిసిపోయింది.జూన్ 16న విడుదల చేసిన పోలీసు ప్రకటన ప్రకారం..భరత్ దగ్గర ఆయుధం ఉందని, అతను దాంతో తిరుగుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ కథలోనే చాలా కీలకమైన ఘట్టం. ఎందుకంటే చాలా నివేదికలు, వీడియోల ప్రకారం.. పోలీసు సిబ్బంది భరత్‌తో గంటల తరబడి సంప్రదింపులు జరిపారు.ఏదో కొద్ది నిమిషాలు కాదు.గంటల కొద్దీ మాట్లాడారు.పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.భరత్ చేతిలో ఆయుధం ఉంది. పోలీసులు అక్కడే ఉన్నారు. చర్చలు కొనసాగాయి. కుటుంబ సభ్యులు ఉన్నారు.గ్రామస్థులు చూస్తున్నారు.ఇందులో చాలా వరకు సోషల్ మీడియాలో కూడా కనిపించింది.అయినా సరే, పోలీసులు అక్కడ గంటల కొద్దీ గడిపినా భరత్‌ను అదుపులోకి తీసుకోలేదు.ఆయుధం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఎలాంటి పరిష్కారం లేకుండానే ఆ గొడవ సద్దుమణిగింది.పోలీసులు వెళ్లిపోయారు.ఇప్పుడు ఆ నిర్ణయమే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఎందుకు? ఎందుకంటే మరుసటి రోజు జరిగిన ఘటన రక్తపాతానికి దారితీసింది.జూన్ 16 నాటి పోలీసు ప్రకటనలో మరో కీలకమైన విషయం ఉంది. అదే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.పోలీసులు భారత్‌ను పెద్ద నేరస్థుడిగా వర్ణించలేదు.ఉగ్రవాదిగా చెప్పలేదు.సాయుధ తిరుగుబాటుదారుడిగా పేర్కొనలేదు.కేవలం, అతను మానసిక స్థితి సరిగ్గా లేదని ఆ ప్రకటన చెబుతోంది.భరత్‌కు చికిత్స, సంరక్షణ కోసం మెంటల్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పోలీసులు చెప్పారు.

పోలీసుల ప్రకటన ఇప్పుడు పబ్లిక్ రికార్డులో ఉంది.ఇది ఇప్పుడు ఎవరూ కాదనలేని ఒక పెద్ద ప్రశ్నకు దారి తీస్తోంది.జూన్ 16న భరత్‌కు చికిత్స, సంరక్షణ అవసరమని పోలీసులు నమ్మితే, జూన్ 17 నాటికి ఏం మారింది?ఆ ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగింది? మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పిన వ్యక్తిని,ఏకంగా ఆపరేషన్ చేసి మరీ పోలీసులు మట్టుబెట్టడం వెనుక కారణమేంటి..? కానీ, ఇక్కడ మరో ప్రశ్న ఉంది.అది ఇంకా ఇంపార్టెంట్ కావొచ్చు. జూన్ 16న భరత్ కండీషన్ బాలేదని చెప్పిన పోలీసులు…అతని వద్ద వెపన్ ఉందని ముందే చెప్పిన పోలీసులు… అప్పటికే అతనితో గంటల తరబడి మాట్లాడిన పోలీసులు…జూన్‌ 17న జరిగే భరత్ మరణాన్ని ఎందుకు ఆపలేకపోయారు..?ఆ రోజే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని ఉండొచ్చు కదా?భరత్‌ను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి ఉండొచ్చు కదా?పరిస్థితి చేయి దాటకుండా జాగ్రత్తపడి ఉండొచ్చు కదా..? ఇవి ఆరోపణలు కావు.ప్రశ్నలు మాత్రమే. ఏదైనా జ్యుడీషియల్ విచారణలో కామన్‌గా వచ్చే ప్రశ్నలివి. ఎందుకంటే…ఎవరేంటో ముందే తెలిసి ఉండి కూడా ఈ ఘోరం జరిగితే..ఆ ఘటనకు ముందు జరిగిన పరిణామాల గురించి అందరూ ఆలోచించాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు ఇప్పుడు చాలా ముఖ్యం. మరుసటి రోజు ఉదయం, అంటే జూన్ 17న సిచ్యువేషన్‌ పీక్స్‌లో ఉంది.ఈసారి యావత్ దేశం ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కింది. భరత్ భూషణ్ తివారీ ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు బీహార్‌ను రెండుగా చీల్చేసాయి.

జూన్ 17, 2026.బీహార్ ఎప్పటికీ మర్చిపోలేని రోజు. భరత్ భూషణ్ తివారీ ఎవరనేది పోలీసులకు స్పష్టంగా తెలుసు. ఒక రోజు ముందే వాళ్లు అతడితో మాట్లాడారు. అతడి దగ్గర ఆయుధం ఉందని వాళ్లకు తెలుసు. భరత్‌ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడని వాళ్లకు తెలుసు.పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని వాళ్లు గ్రహించారు. ఇప్పుడు జరగబోయేది ఊహలు, ఆరోపణలు మాత్రమే కాదు. అందులో చాలా వరకు రికార్డయింది. చాలా వరకు ప్రత్యక్ష ప్రసారమైంది. అందుకే ఈ కేసు ఇంతటి వివాదాస్పదంగా మారింది. భరత్ మరోసారి ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చాడు. వేలమంది దీన్ని చూశారు. తర్వాత చూసేవాళ్ల సంఖ్య మరింత పెరిగింది. తన ఇంటి డాబా మీద నిలబడి ఉన్న భరత్ చేతిలో నాటు తుపాకీ కనిపిస్తోంది. కింద పోలీసు వాహనాలు ఉన్నాయి. చుట్టూ పోలీసు బలగాలు మోహరించాయి. వీడియోల్లో భారత్ చాలా ఎమోషనల్‌గా కనిపిస్తున్నాడు. కోపంగా ఉన్నాడు. నిరాశతో రగిలిపోతున్నాడు. కొన్నిసార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరికొన్నిసార్లు తీవ్ర ఆందోళనతో కనిపిస్తున్నాడు. లైవ్ కొనసాగుతుండగానే, లొంగిపోవాలని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఆయుధం కింద పెట్టాలని అధికారులు పదే పదే కోరడం వినిపిస్తోంది. కొన్ని చోట్ల భరత్ గాల్లోకి కాల్పులు జరపడం కూడా చూడొచ్చు. ఇది చాలా కీలకమైన పాయింట్.ఈ కథను నిజాయితీగా చెప్పాలంటే ఈ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. భరత్ చేతిలో ఆయుధం ఉన్న మాట వాస్తవం. అక్కడ తీవ్రమైన ఉద్రిక్తత నెలకొందనేది నిజం. లొంగిపోయేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నించారనేది కూడా నిజం.

కొంత సమయానికి పరిస్థితి మేడ మీద నుంచి కిందకు మారింది. పోలీసులు మరింత దగ్గరికి వచ్చారు. మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ సంభాషణల్లోకి భరత్ తల్లి కూడా వచ్చింది.ఒక దశలో భరత్, తల్లి, పోలీసులు… అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. గొడవ సద్దుమణిగి లొంగిపోయే దిశగా అడుగులు పడుతున్నట్లు అనిపించింది. ఇక సమస్య తీరిపోయిందనుకునే లోపు…అంతా తలకిందులయ్యే ఆ క్షణం వచ్చేసింది. ఇప్పుడు న్యాయ విచారణకు కేంద్ర బిందువుగా మారిన క్షణం అదే.బీహార్‌ను రెండుగా చీల్చిన ఘటన అదే. తర్వాత బయటికి వచ్చిన వీడియోల ప్రకారం… భరత్ లొంగిపోవడానికి అంగీకరించినట్లు కనిపిస్తోంది. అతడి చేతిలో తుపాకీ కనిపించడం లేదు. అది కింద పడిఉంది. కొన్ని వీడియోల్లో ఆయుధాన్ని విసిరేయడం కూడా చూడొచ్చు. పోలీసులు మరింత ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా గొడవ సద్దుమణుగుతున్నట్లు అనిపించింది.చూస్తున్న వాళ్లందరికీ వివాదం క్లోజ్ అయిందని అనిపించింది.

కానీ అక్కడే కథ అసలు మలుపు తిరిగింది. ఫేస్‌బుక్ లైవ్ కట్ అయింది. కెమెరా బ్లాంక్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై ప్రజల దగ్గర ఎలాంటి వీడియో రికార్డు లేదు.లైవ్ ఆగిపోయిన తర్వాతి నిమిషాల్లో ఏం జరిగిందనే దానిపైనే… రెండు వేర్వేరు వాదనలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం… భరత్‌ అప్పటికే లొంగిపోయాడు. వాళ్ల నాన్న చెబుతున్నట్లు… ఆయుధం కింద పడేసి పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. వీడియోల్లో గొడవ శాంతియుతంగా ముగిసినట్లే కనిపిస్తోందని భరత్ అనుచరులు అంటున్నారు. కానీ పోలీసులు మరో కథ చెప్తున్నారు.లైవ్ ఆగిపోయిన తర్వాత భరత్ మళ్లీ ప్రమాదకరంగా మారాడని పోలీసులు వాదిస్తున్నారు. అధికారిక వర్గాల ప్రకారం… భరత్‌ మళ్లీ ఆయుధం చేతిలోకి తీసుకుని పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇక్కడే రెండు వర్గాల వాదనలు పూర్తిగా విభేదిస్తున్నాయి.

ఒక వర్గం లొంగిపోయాడంటోంది. మరో వర్గం మళ్లీ బెదిరింపులకు దిగాడంటోంది. ప్రమాదం ముగిసిందని ఒకరు చెప్తుంటే… ప్రమాదం ఇంకా కొనసాగిందని మరొకరు చెప్తున్నారు. ఈ రెండు వాదనల మధ్యే… బీహార్ వెతుకుతున్న అసలు నిజం దాగి ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై ఎలాంటి వివాదం లేదు. తుపాకీ పేలింది. భరత్ భూషణ్ తివారీ కుప్పకూలాడు. స్పృహ తప్పిన భరత్‌ను హాస్పటల్‌కు తీసుకెళ్లారు.అక్కడ మృతి చెందినట్లు ప్రకటించారు.కొద్ది నిమిషాల ముందు వరకు పోలీసులతో జరుగుతున్న గొడవను లైవ్‌లో చూపించిన ఆ యువకుడు… ఇక లేడు. కానీ భరత్‌ మరణంతో కథ ముగియలేదు.అసలు కథ ఇప్పుడే మొదలైంది.ఆ వీడియోలు వైరల్ కావడంతో… ప్రశ్నలు తలెత్తడంతో… పొంతన లేని విషయాలు బయటికి రావడంతో… ఆ వివాదం ఒక్క భోజ్‌పూర్ గ్రామానికే పరిమితం కాలేదు. ఒక రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది.చివరకు రాజకీయ పార్టీలు కూడా స్పందించక తప్పలేదు.

భరత్‌ భూషణ్‌ తివారీ చనిపోయిన క్షణం నుంచీ, ఈ కథ ఒక్క మనిషికే పరిమితం కాలేదు. ఇది పూర్తిగా బీహార్‌ విషయంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, ప్రజల మదిలో ప్రశ్నలు ఎక్కువయ్యాయి. మొదటి ప్రశ్న భరత్‌ కుటుంబం నుంచే వచ్చింది. మా అబ్బాయి లొంగిపోయిన తర్వాత కూడా ఎందుకు కాల్చారు? అని నాన్న బహిరంగంగానే నిలదీశాడు. ఇక రెండో ప్రశ్న మొదలైంది. టీవీ డిబేట్లు, సోషల్ మీడియా చర్చలు, రాజకీయ నాయకుల ప్రసంగాల్లో ఇదే ప్రధాన అజెండాగా మారింది. నిజంగానే భరత్‌ భూషణ్‌ లొంగిపోయాక కాల్పులు జరిపారా?

చాలామంది ఈ వీడియోలు చూడటంతో, ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అప్పుడే ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదం కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదు. అధికార పార్టీలోని నేతలు సైతం నోరెత్తారు. ఏం జరిగిందో చెప్పాలంటూ అధికార పార్టీ సీనియర్లు నిలదీశారు.కొందరేమో వీడియోలను చూపించారు. మరికొందరేమో ఈ ఎన్‌కౌంటర్ జరిగిన పరిస్థితులను తప్పుపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్లు పోటెత్తాయి.ఆ తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. దీంతో జనాల్లో అనుమానాలు మరింత పెరిగాయి.పోలీసులు చెప్పిందే నిజమైతే ఎందుకు సస్పెండ్ చేశారని భరత్‌ మద్దతుదార్లు ప్రశ్నించారు. నిజానిజాలు తేలే వరకు అధికారులను విధుల్లో నుంచి తప్పించడం సహజమని, సస్పెన్షన్ అంటేనే తప్పు చేసినట్లు కాదని కొందరు పోలీసులు బదులిచ్చారు.

ఈ వివాదం మరింత ముదిరింది. ఆ సమయంలో బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈ కేసు రూపురేఖలనే మార్చేసింది.జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. హైకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జి ఈ ఘటనపై విచారణ జరుపుతారని ప్రకటించారు. భరత్ మద్దతుదారుల దృష్టిలో ఈ కేసులో నిజంగానే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మరికొందరి దృష్టిలో, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.ఎలా చూసినా ఈ ఇష్యూ సోషల్ మీడియా పరిధిని దాటింది.రాజకీయాలను మించిపోయింది.నేరుగా కోర్టు పరిధిలోకి వచ్చేసింది.అయితే ఎన్‌కౌంటర్ వీడియోల కంటే, ఫేస్‌బుక్ లైవ్‌ల కంటే, ప్రెస్ మీట్ల కంటే కూడా..భరత్ అంతిమ యాత్రలోనే అత్యంత భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి.అతని అంత్యక్రియలకు వేలాదిగా జనం తరలివచ్చారు.రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. ఎవరూ ఊహించని రీతిలో భారీగా జనం వచ్చారు.యువకులు, వృద్ధులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు భరత్‌ చివరిప్రయాణంలో పాల్గొన్నారు. తమ నివాళులు అర్పించారు.సమాధానాలు వెతుక్కుంటూ వచ్చిన వాళ్లంతా….తమ ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు.

భరత్ భూషణ్ తివారీ గురించి మీరేమనుకున్నా సరే.. ఒక స్పష్టమైన నిజాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. అతని మరణం జనాలను తీవ్రంగా కదిలించింది. వరద బాధితుల కోసం, ఒక గ్రామం కోసం గొంతు ఎత్తిన యువకుడిగా కొందరు అతన్ని చూశారు. అదే సమయంలో ఆవేశం, దాడులు, చేతిలోకి చట్టాన్ని తీసుకోవడం ఎంత ప్రమాదకరమో అతడి ఉదంతం చెబుతోందని మరికొందరు భావించారు. కానీ ఒక్క విషయంలో మాత్రం దాదాపు అందరూ ఏకీభవించారు. నిజం ఏంటనేది చాలా ముఖ్యం. ఎందుకంటే, భరత్ లొంగిపోయిన తర్వాత కూడా పోలీసులు అతన్ని కాల్చి చంపారంటే..  చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నేరానికి పాల్పడినట్లు అవుతుంది.ఒకవేళ పోలీసులు నిజంగానే ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపి ఉంటే, ఆ విషయాన్ని పక్కా ఆధారాలతో నిరూపించాలి. అందుకే ఈ కథ ఇప్పుడు భరత్ భూషణ్ తివారీకి మాత్రమే పరిమితం కాదు. ఇది అంతకంటే చాలా పెద్ద విషయం. ఆవేశం కంటే ఆధారాలు ముఖ్యమా? కాదా? చట్టం ముందు అందరూ సమానులేనా? కాదా?ఇప్పుడు ఇవన్నీ ప్రధాన ప్రశ్నలు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఈ వివాదానికి మూలమైన అసలు ప్రశ్న ఇదే. ఒక వ్యక్తి ఆయుధాన్ని కిందపడేసి, లొంగిపోతే చట్టపరంగా ఏం జరగాలి..?

మరి మనకు ఏం తెలుసు? భరత్‌ భూషణ్‌ తివారీ అంటే ఆ ప్రాంతంలో ఏదో సాధారణ పేరు కాదు. వరద బాధితులు, నిర్వాసితుల సమస్యలపై అతడు ఏళ్ల తరబడి పోరాడాడు.అధికారులను నిలదీశాడు.పాలనా యంత్రాంగాన్ని ప్రశ్నించాడు. అతడి మాటల్లో తీవ్రత పెరిగిన సందర్భాలున్నాయి.  కొన్ని వీడియోలు కూడా ఇందుకు సాక్ష్యం. అతడి దగ్గర ఆయుధం ఉంది. అతడు కాల్పులు జరిపాడు. లొంగిపోవాలని పోలీసులు పదేపదే చెప్పారు. జనాల కళ్లెదురుగా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చివరికి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కానీ అసలు ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. ఆఖరి క్షణాల్లో ఏం జరిగింది? లైవ్‌ స్ట్రీమింగ్ ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆయుధం కిందపడేసిన కాసేపటికే కాల్పులు ఎందుకు జరిగాయి? ఒక పూర్తి స్థాయి విచారణ జరిగితేనే ఈ విషయాలన్నీ బయటికి వస్తాయి. అందుకే ఈ కథను కేవలం నినాదాలకు పరిమితం చేయలేం. సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లకు కట్టిపడేయలేం. రాజకీయ ప్రసంగాల కోణంలో చూడలేం. ఆవేశం కంటే.. సిద్ధాంతం కంటే.. రాజకీయ ప్రయోజనాల కంటే నిజం చాలా ముఖ్యం. భరత్‌ భూషణ్‌ తివారీని కొందరేమో హీరోగా ప్రకటించేశారు. మరికొందరేమో అతన్ని నేరస్థుడిగా ముద్రేశారు. కానీ ప్రజాస్వామ్యం ఇలాంటి తక్షణ తీర్పుల ఆధారంగా నడవదు. కేవలం ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది. న్యాయబద్ధమైన విచారణ జరగాలి. అధికారులు బాధ్యత వహించాలి. చట్టం తన పని తాను చేయాలి.

భరత్ తప్పు చేశాడని కాసేపు అనుకుందాం. అతడి దగ్గర అక్రమ ఆయుధం ఉంటే అది నేరం. కాల్పులు జరిపి ఉంటే అది నేరం. అధికారులను బెదిరించి ఉంటే అది నేరం. వీటన్నింటికీ చట్టంలో శిక్షలున్నాయి. రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కోర్టులు ఉండేది అందుకే కదా! అయితే మనం ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఒక వ్యక్తి తన ఆయుధం కిందపడేస్తే.. లొంగిపోవడానికి సిద్ధమైతే.. చట్టానికి తలొగ్గితే.. ఆ తర్వాత ఏం జరగాలి? దాని సమాధానం కులం మీద ఆధారపడి ఉండకూడదు. మతం మీద ఆధారపడి ఉండకూడదు. రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదు. వ్యక్తిగతంగా మనకు ఆ మనిషి నచ్చాడా లేదా అనేది ముఖ్యం కాదు. ఎవరికైనా సరే సమాధానం ఒకేలా ఉండాలి. ఎందుకంటే బలంగా ఉన్నవారికి ఒక న్యాయం, బలహీనంగా ఉన్నవారికి మరో న్యాయం రాజ్యాంగం చెప్పదు. అగ్రవర్ణాలు, దళితులు, ముస్లింలు, ఓబీసీలు అని వేర్వేరుగా చట్టాలు ఉండవు. ఒకే ఒక్క నిబంధన ఉంటుంది. అదే చట్టం ముందు అందరూ సమానులే. అందుకే ఇప్పుడు జ్యుడీషియల్ విచారణ చాలా ముఖ్యం. ఏదో ఒక రాజకీయ పార్టీని సంతృప్తి పరిచేందుకు కాదు. సోషల్ మీడియా కోసం అంతకంటే కాదు. బీహార్ అడుగుతున్న ప్రశ్నకు ఇది అయితేనే సరైన సమాధానం ఇస్తుంది.

నిజంగానే భరత్ లొంగిపోయాడా? లేక, ఇంకా ప్రమాదకరంగానే మారాడా? భరత్ ప్రమాదకరంగానే ఉంటే, దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఒకవేళ లొంగిపోతే, ఆ నిజాన్ని కూడా ఆధారాలతో సహా నిరూపించాలి.ఏది ఏమైనా బీహార్ ప్రజలకు నిజం తెలిసే హక్కు ఉంది. అతడి కుటుంబానికి నిజం తెలియాలి. పోలీసులకు కూడా నిజం తెలియాలి. వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికీ వాస్తవం ఏంటో అర్థం కావాలి. ఎందుకంటే ఈ కథ కేవలం భరత్ భూషణ్ తివారీ గురించే కాదు. ఒక వ్యక్తికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ కథ చెబుతుంది. పోలీసుల అధికారాల గురించి మాట్లాడుతుంది. బాధ్యత గురించి ప్రశ్నిస్తుంది. అన్నింటికంటే మించి.. ప్రజాస్వామ్యం కాపాడాల్సిన సూత్రం గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి లొంగిపోయి తన ఆయుధాన్ని కిందపడేసిన తర్వాత అక్కడ ఆవేశానికి తావు ఉండకూడదు.  పూర్తిగా Rule of Law మాత్రమే అమలు కావాలి. ఆవేశం కాదు. కోపం కాదు.ప్రతీకారం కాదు. కేవలం చట్టం మాత్రమే పనిచేయాలి.అందుకే బీహార్ ప్రస్తుతం సమాధానాల కోసం ఎదురుచూస్తోంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.