దేశంలోని వాణిజ్య, పారిశ్రామిక రంగానికి చెందిన వినియోగదారులకు ప్రభుత్వ చమురు సంస్థలు, ప్రైవేటు ఇంధన రంగం గుడ్ న్యూస్ తెలిపాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించారు. దీనితో పాటు వాహనదారులకు మరింత ఊరటనిస్తూ ప్రైవేట్ ఇంధన సంస్థ కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. 19 కేజీల బరువుండే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.183 తగ్గించారు. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు రూ.3,113 గా ఉన్న ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,930 కి తగ్గింది. గత కొంతకాలంగా స్థిరంగా పెరుగుతూ వచ్చిన గ్యాస్ ధరలు ఒకేసారి ఈ స్థాయిలో తగ్గాయి.

గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, రాజకీయ అస్థిరత కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ముడి చమురు, గ్యాస్ రవాణా మార్గాలు తగ్గాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి గ్యాస్ దిగుమతులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీనికి తోడు దేశీయంగా కూడా ఎల్పీజీ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు సరిపడా సరఫరా అందుబాటులోకి రావడంతో ధరలు తగ్గించడం చమురు సంస్థలకు సులువైంది.

గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపునకు తోడు, ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ ‘నయారా ఎనర్జీ’ వాహనదారులకు మరో తీపి కబురు అందించింది. తమ బంకుల్లో విక్రయించే ఇంధన ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలను తగ్గించింది. ప్రభుత్వ రంగ సంస్థల కంటే ముందే ఒక ప్రైవేట్ సంస్థ ఈ స్థాయిలో రేట్లను తగ్గించింది.