Greater Noida family deaths
Greater Noida family deaths

మ్యాగీ తింటున్నారా?.. అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఇన్‌స్టంట్ న్యూడిల్స్ (మ్యాగీ) తిని ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతి చెందడం సంచలనంగా మారింది. సాధారణ రోజులాగానే ఉదయం నిద్రలేవాల్సిన ఆ కుటుంబం.. చిన్న శబ్దం లేకుండానే ప్రాణాలు కోల్పోయింది. ఎంతసేపటికీ అలికిడి వినిపించకపోవడంతో.. చుట్టుపక్కల వారు వెళ్లి చూసి షాక్‌కు గురయ్యారు. ఒకే గదిలో బెడ్‌పై తల్లి, ఇద్దరు పిల్లలు.. నేలపై తండ్రి, కొడుకు నిద్రలోనే ప్రాణాలు విడిచి కనిపించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది. అయితే రాత్రి తిన్న ఆహారమే వీళ్ల ప్రాణాలు తీసిందా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర దాగిఉందా?.. అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.

ఏం జరిగింది..

శుక్రవారం రాత్రి ఆ కుటుంబం సంతకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఆకలిగి ఉండటంతో ఇన్‌స్టంట్ న్యూడుల్స్ (మ్యాగీ) చేసుకుంది. అది తిన్న తర్వాత టీ కూడా తాగి నిద్రపోయింది. అయితే ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు నిద్రలేవకపోవడంతో మహేష్ తల్లి గదిలోకి వెళ్లి చూడగా.. ఐదుగురి మృతదేహాలు మంచం మీద పడి ఉన్నాయి. మృతులలో 37 ఏళ్ల మహేష్, అతని 35 ఏళ్ల భార్య లలిత, 11 ఏళ్ల కుమారుడు లడ్డు, 7 ఏళ్ల కుమార్తె మిష్టి, 3 ఏళ్ల కుమారుడు సాక్షాత్ ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో మిగిలి ఉన్న ఫుడ్‌ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అలాగే మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల ప్రకారం.. ఫుడ్ పాయిజనింగ్ వల్లనే ఆ కుటుంబంలోని 5 మంది చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే మరణానికి గల కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే వారి మరణానికి అసలు కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

ఆరోపణలు..

స్థానికుల ప్రకారం.. ఆ కుటుంబంలో తరచూ ఆస్తి విషయమై గొడవలు జరిగేవని తెలిపారు. మృతుడి తల్లి ఎప్పటికప్పుడు గొడవపడుతూ ఉండేదని, ఇల్లు ఖాళీ చేయాలని హెచ్చరించినట్లు కూడా స్థానికులు చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.