
Maharashtra Floods : మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు, వరదలు దేవీపాడ గ్రామంలో ఒక కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని తీరని శోకాన్ని మిగిల్చాయి. పాల్ఘర్ జిల్లాలో సంభవించిన ఈ ప్రకృతి వైపరీత్యంలో, ఒకవైపు ప్రాణాలు కోల్పోయిన ఆత్మీయురాలి పార్థివ దేహం, మరోవైపు వేగంగా పెరుగుతున్న వరద నీరు.. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం గడిపిన క్షణాలు అత్యంత హృదయవిదారకంగా మారాయి.
దేవీపాడకు చెందిన 55 ఏళ్ల అనుస్య మనోహర్ లీలాక జూలై 6న మరణించారు. ఆమె మరణవార్తతో విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు, కడసారి వీడ్కోలు పలికేందుకు అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే, ప్రకృతి వైపరీత్యం వారి దుఃఖాన్ని రెట్టింపు చేసింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు గ్రామంలోకి పోటెత్తింది. క్షణాల్లోనే నీటి మట్టం పెరగడం, ఇళ్లలోకి చేరడంతో పరిస్థితి భీతావహంగా మారింది.
పెరుగుతున్న వరద నీటి నుండి ప్రాణాలను కాపాడుకోవడం, మరణించిన అనుస్య మృతదేహానికి గౌరవం ఇవ్వడం మధ్య ఆ కుటుంబం తీవ్ర సందిగ్ధంలో పడింది. చివరకు, తమ ప్రాణాలను ,ఆత్మీయురాలి పార్థివ దేహాన్ని కాపాడుకోవడానికి వారు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా ఇంటి పైకప్పుపైకి తీసుకెళ్లారు. ఆరుగురు కుటుంబ సభ్యులు ఆమె చుట్టూ కూర్చుని, పెరుగుతున్న వరదను చూస్తూ ప్రాణభయంతో, , శోకంతో దాదాపు నాలుగు గంటల పాటు నరకం అనుభవించారు.
చివరకు వరద ఉధృతి తగ్గే వరకు వారు ఇంటి పైకప్పుపైనే ఉన్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత అనుస్యకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై దేవీపాడ గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వరదల సమయంలో అధికారులు స్పందించలేదని, బాధిత కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల ప్రాధాన్యాన్ని , సమన్వయ లోపాన్ని ఈ విషాద ఘటన మరోసారి ఎత్తిచూపింది.









