
Indian Railway : ఇకపై టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేద్దాం, ఒకవేళ దొరికితే ఏదో ఒక చిన్న ఫైన్ కట్టి తప్పించుకుందాం అనుకునే వాళ్లకు రైల్వే శాఖ గట్టి షాక్ ఇచ్చింది. కొత్తగా జన్ విశ్వాస్ చట్టం 2026 అమల్లోకి రావడంతో రైల్వే నిబంధనలను చాలా కఠినం చేశారు. నిన్నటి వరకు టికెట్ లేకుండా దొరికిపోతే కట్టాల్సిన కనీస జరిమానా కేవలం రూ. 250 మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడా ఫైన్ మొత్తాన్ని ఏకంగా డబుల్ చేసి రూ. 500 కి పెంచేశారు. ఒకవేళ పొరపాటున జరిమానా కట్టకపోతే జేబు ఖాళీ అవ్వడమే కాదు, ఏకంగా సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది.
రైల్వే చట్టంలోని సెక్షన్ 137, 138 ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం పెద్ద నేరంగా పరిగణిస్తారు. కేవలం టికెట్ లేకుండా రైలు పెట్టెలోకి ఎక్కడమే కాకుండా, గత ప్రయాణంలో ఆల్రెడీ వాడేసిన పాత టికెట్ లేదా పాస్‌ను మళ్లీ మళ్లీ వాడటం, రిటర్న్ టికెట్‌లోని సగభాగాన్ని రెండోసారి వాడటానికి ప్రయత్నించడం లాంటివి చేస్తే రైల్వే పోలీసులు వెంటనే పట్టుకుంటారు. ఒకే టికెట్‌తో రెండుసార్లు ప్రయాణం చేసి రైల్వే శాఖను మోసం చేయాలని చూస్తే మూడో కంటికి తెలియకుండా లోపల వేస్తారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా టికెట్ లేకుండా దొరికిపోతే వారు ప్రయాణించిన దూరానికి అయ్యే అసలు టికెట్ ధరతో పాటు, దానికి సమానమైన అదనపు ఛార్జీని కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ అదనపు ఛార్జీ కనీసం రూ. 500 గా ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు ఎక్కడ ఎక్కాడో సరిగ్గా చెప్పకుండా అబద్ధం చెబితే టికెట్ కలెక్టర్ (TTE) అస్సలు నమ్మరు. ప్రయాణికుడు ఎక్కడ ఎక్కాడనేది క్లియర్‌గా తెలియకపోతే, సదరు రైలు ఎక్కడైతే మొదలైందో లేదా చివరిసారిగా ఎక్కడైతే టికెట్లు చెక్ చేశారో అక్కడి నుంచే దూరాన్ని లెక్కించి భారీగా ఫైన్ వేస్తారు. దీనివల్ల చిన్న ప్రయాణమైనా సరే, ఫైన్ మాత్రం కొండంత పడే అవకాశం ఉంది.
ఆరు నెలల వరకు జైలు శిక్ష
కొందరు ప్రయాణికులు తమ దగ్గర డబ్బులు లేవని TTE తో గొడవపడుతుంటారు. అలా జరిమానా కట్టడానికి నిరాకరిస్తే రైల్వే అధికారులు వారిని వదిలిపెట్టకుండా నేరుగా కోర్టుకు ఈడుస్తారు. వందల్లో ఉండే టికెట్ ధరను ఎగ్గొట్టాలని చూస్తే కోర్టు విధించే శిక్షలు చాలా ఘోరంగా ఉంటాయి. కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలు వసూలు చేయడంతో పాటు గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడొచ్చు లేదా రూ. 500 అదనపు కోర్టు జరిమానా విధించవచ్చు, లేదా ఈ రెండూ కలిపి కూడా శిక్ష వేసే అధికారం కోర్టుకు ఉంటుంది. కాబట్టి రూల్స్‌తో ఆటలు వద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ కొత్త చట్టం గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జన్ విశ్వాస్ బిల్లు సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా తొలిసారిగా 79 చట్టాల పరిధిలోని దాదాపు 1,000 చిన్న చిన్న నేరాలను నేరరహితం చేశారని ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఇలాంటి చిన్న చిన్న కేసులు దాదాపు 5 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ సంస్కరణల వల్ల న్యాయవ్యవస్థకు పెద్ద ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు తమ సొంత జన్ విశ్వాస్ చట్టాలను తెచ్చాయని ఆయన పేర్కొన్నారు. కేవలం మే నెలలోనే సెంట్రల్ రైల్వే జోన్ ఒక్కటే ఏకంగా 4.96 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంది. వారి నుంచి వసూలు చేసిన జరిమానా అక్షరాలా రూ. 40.85 కోట్లుగా నమోదైంది.









