
Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రేగిన తిరుగుబాటుపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీలో నేరుగా రంగంలోకి దిగి, తన పార్టీ నేతలను వాడుకుంటూ టీఎంసీలో చీలిక తెచ్చేందుకు కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. తనకు ఎంతో కాలంగా నమ్మకస్తురాలైన చంద్రుమా భట్టాచార్య టీఎంసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఇతర బాధ్యతలకు రాజీనామా చేసిన రోజే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన మమత.. పార్టీని వీడిపోతున్న తిరుగుబాటుదారులకు బహిరంగ సవాల్ విసిరారు. బీజేపీ స్పాన్సర్ చేస్తున్న ఈ వెన్నుపోటు ఆటలు ఆపండి. కృతజ్ఞత లేని ఆ ద్రోహులకు దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా వెళ్లి బీజేపీలోనే చేరి నాతో తలపడాలి అంటూ ఆమె సవాల్ చేశారు.
ఈ కష్టకాలంలో కూడా పార్టీకి అండగా ఉంటూ, నమ్మకంగా ఉన్న కార్యకర్తలే టీఎంసీకి అసలైన బంగారు గనులని మమతా బెనర్జీ కొనియాడారు. సర్వం సర్దుకుని పార్టీని మోసం చేసి వెళ్ళిపోతున్న తిరుగుబాటుదారులు.. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను కూడా ఇలాగే మోసం చేయకుండా చూసుకోవాలని ఆమె హితవు పలికారు. పార్టీలో నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అధినేత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే.. అనారోగ్యంతో ఉన్న సీనియర్ నేత సుబ్రతా బక్షి కోలుకునే వరకు తానే స్వయంగా టీఎంసీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు చూసుకుంటానని ప్రకటించారు. దీనితో పాటు పార్టీ కీలక నేతలు కునాల్ ఘోష్, మదన్ మిత్రాలను పార్టీ జనరల్ సెక్రటరీలుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు.
చివరగా తిరుగుబాటు నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మిమ్మల్ని మీరు రెబెల్స్ అని పిలుచుకుంటున్నారా? మరి ఎన్నికలకు ముందు మీ తిరుగుబాటు ఏమైంది? గత 15 ఏళ్లుగా టీఎంసీ టిక్కెట్లపై ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రులుగా, పెద్ద పెద్ద ప్రభుత్వ పదవుల్లో అనుభవించినప్పుడు మీ అసమ్మతి ఎటు పోయింది? అప్పుడు నా దగ్గరకు వచ్చి మీకున్న విభేదాలను ఎందుకు చెప్పలేదు?” అంటూ మమతా బెనర్జీ వారిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.









