
Badrinath : అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం వివాదం దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం మరువకముందే.. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్‌లోనూ అలాంటి ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియా వేదికగా ఆలయ నిధుల దుర్వినియోగంపై వస్తున్న పుకార్లు, ఆరోపణలను బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) అత్యంత తీవ్రంగా పరిగణించింది. భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు ఉన్నత స్థాయి అంతర్గత విచారణకు ఆదేశించింది.
Now, Badrinath accused of donation theft claims, temple trust orders probe https://t.co/pj8ZjxHHP2
— The Tribune (@thetribunechd) July 4, 2026
ఈ వ్యవహారంపై బీకేటీసీ ప్రెసిడెంట్ హేమంత్ ద్వివేది స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పూర్తి పారదర్శకత కోసం విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆరోపణలు వచ్చిన సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగుల పూర్తి వివరాలను, నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఛైర్మన్ పీఏ హస్తం ఉందంటూ భైరవ సేన ఆరోపణలు
బద్రీనాథ్ ఆలయంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ‘భైరవ సేన’ అనే స్థానిక సంస్థ బహిరంగంగా ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా ఆలయ కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత సహాయకుడికి (PA) ఈ నిధుల దుర్వినియోగంలో ప్రత్యక్ష సంబంధం ఉందని, దీనిపై నిష్పాక్షిక విచారణ జరపాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.
Haldwani, Uttarakhand: On reports of alleged donation mismanagement at the Badrinath temple, BKTC Chairman Hemant Dwivedi says, “As the Chairman of BKTC, I have been seeing reports on social media since morning claiming that the employee being referred to as my personal secretary… pic.twitter.com/WFZA04KzWn
— IANS (@ians_india) July 4, 2026
అయితే ఈ ప్రచారంపై ప్రెసిడెంట్ హేమంత్ ద్వివేది స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో తన పర్సనల్ సెక్రటరీగా ప్రచారంలో ఉన్న వ్యక్తి కేవలం బీకేటీసీలోని ఒక సాధారణ ఉద్యోగి మాత్రమేనని స్పష్టం చేశారు. సదరు ఉద్యోగి గతంలో ముగ్గురు మాజీ ఛైర్మన్ల వద్ద కూడా విధులు నిర్వహించారని, ఆయనపై వచ్చిన ఆరోపణల వెనుక వాస్తవాలను కమిటీ నిలదీస్తుందని చెప్పారు.
సీసీటీవీ ఫుటేజ్ అస్పష్టం.. చట్టప్రకారం కఠిన చర్యలు
మరోవైపు ఈ వివాదంపై బీకేటీసీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి (CEO) సోహన్ సింగ్ రంగడ్ మాట్లాడుతూ.. ఆరోపణలు వచ్చిన వెంటనే తాము ప్రాథమిక దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినప్పటికీ, సదరు ఫుటేజీ స్పష్టంగా లేకపోవడంతో పూర్తి వివరాలు లభ్యం కాలేదని వివరించారు. విషయం కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించింది కాబట్టి, తదుపరి చర్యల కోసం ఛైర్మన్‌కు తక్షణమే నివేదిక ఇచ్చామన్నారు.
ఛైర్మన్ ఆదేశాల మేరకు సదరు ఉద్యోగులను విచారించేందుకు, సమగ్ర దర్యాప్తు కోసం అంతర్గత కమిటీని రంగంలోకి దించుతున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు. ఈ విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు లేదా నిధుల అవకతవకలకు పాల్పడినట్లు రుజువైతే.. వారిపై బీకేటీసీ చట్టం-1939తో పాటు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠినమైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బద్రీనాథ్ ధామ్ పవిత్రతను దెబ్బతీసేలా సాగుతున్న నిరాధారమైన ఆరోపణలను, తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా ప్రచారాలను భక్తులు నమ్మవద్దని ఆలయ కమిటీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.









