
Wife Killed Husband : సాధారణంగా పెళ్లయిన కొత్తలో ఏ జంట అయినా నూరేళ్ల జీవితం గురించి ఎన్నో అందమైన కలలు కంటుంది. కానీ, హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఒక విషాద ఘటన పెళ్లి అనే పవిత్ర బంధానికే మచ్చ తెచ్చింది. పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కూడా గడవక ముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక నవవధువు కన్నతల్లి లాంటి అత్తగారింట్లోనే కాలనాగులా మారింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా అంతమొందించిన ఈ ఉదంతం మొదట ఒక సాధారణ ప్రమాదంగా నమ్మించినప్పటికీ, చివరకు టెక్నాలజీ సాయంతో అసలు నిజాలు బయటపడి సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
జర్తాల్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోను అనే కష్టపడే స్వభావం ఉన్న యువకుడు, ఇటీవల జలియావాస్లో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో స్థిరపడాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి కసోలి గ్రామానికి చెందిన తన్ను అనే యువతితో వివాహమైంది. అయితే, పైకి అమాయకంగా కనిపించే తన్నుకు పెళ్లికి ముందే సోను అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తన్ను.. వివాహం తర్వాత కూడా ప్రియుడితో రహస్య బంధాన్ని కొనసాగించింది. తమ శారీరక, మానసిక సుఖాలకు భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఈ ప్రేమోన్మాదులు, ఎలాగైనా అతడిని భూమిపై లేకుండా చేయాలని ఒక కిరాతక వ్యూహాన్ని రచించారు.
తమ ప్లాన్ ప్రకారం, జూన్ 8వ తేదీ రాత్రి భార్య తన్ను మాయమాటలు చెప్పి భర్త మోనును కసోలి గ్రామానికి రప్పించింది. అక్కడ అప్పటికే ప్రియుడు సోను పురమాయించిన హరిఓమ్, అమన్ అనే ఇద్దరు కిరాయి హంతకులు పొంచి ఉన్నారు. మోను అక్కడికి చేరుకోగానే పశువులకన్నా హీనంగా అతడిని గట్టిగా పట్టుకుని, ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఎలాంటి ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో శవాన్ని అసల్వాస్ కాల్వలో పడేసి, అతడు నడుపుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒడ్డున పడేశారు. జూన్ 10న శవం లభ్యమైనప్పుడు ఒంటిపై గాయాలు లేకపోవడంతో, పోలీసులు సైతం అది స్కూటర్ నియంత్రణ కోల్పోయి కాల్వలో పడిపోయిన ప్రమాదంగానే భావించి కేసు ముగించారు.
Also Read : సభ్యసమాజం తలదించుకునే ఘోరం: కన్నతల్లిపైనే కుమారుడి లైంగిక దాడి..
భర్త మరణవార్త వినగానే నవవధువు తన్ను ప్రదర్శించిన నటన థ్రిల్లర్ సినిమాలను తలపించింది. ఏమీ తెలియనట్లు తన పుట్టింటి వారితో కలిసి అత్తగారింటికి వచ్చి శవంపై పడి గుండెలవిసేలా ఏడ్చింది. అంత్యక్రియల్లో పాల్గొని, ఒక పుణ్యస్త్రీగా చేయాల్సిన అన్ని సాంప్రదాయ ఆచారాలను కన్నీరుమున్నీరవుతూ పూర్తి చేసింది. ఆమె కపట కన్నీటిని చూసి అత్తమామలు, గ్రామస్తులు సైతం ‘పాపం.. పెళ్లైన కొద్దిరోజులకే ఎంతటి కష్టం వచ్చి పడింది’ అని జాలిపడ్డారే తప్ప, ఆ కన్నీళ్ల వెనుక భర్తను మింగేసిన రాక్షసి దాగుందని ఎవరూ ఊహించలేకపోయారు.
జూన్ 11న పోలీసులు మోను మొబైల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథలో ఊహించని మలుపు తిరిగింది. ఫోన్ తెరిచి చూడగా కాల్ హిస్టరీ, చాట్స్ అన్నీ పూర్తిగా డిలీట్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు డేటా రికవరీ నిపుణులను ఆశ్రయించి డిలీట్ అయిన సమాచారాన్ని బయటకు తీయించారు. ఆ డేటా చూడగానే కుటుంబ సభ్యుల కాళ్ల కింద భూమి కదిలింది. మోను అదృశ్యానికి ముందు ప్రియుడు సోను ఆమెకు ఏకంగా 49 సార్లు కాల్స్ చేశాడని, అలాగే తన్ను స్వయంగా మెసేజ్ చేసి భర్తను రప్పించి హంతకులకు పక్కా స్కెచ్ ఇచ్చిందని వాట్సాప్ చాటింగ్స్ ద్వారా నగ్నసత్యం నిరూపితమైంది.
ఇంతటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లభించినప్పటికీ, స్థానిక కసోలా పోలీసులు మొదట బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నవవరుడి దశదిన కర్మలు ముగిసేవరకు ఓపిక పట్టిన కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత డీఎస్పీని కలిసినా ఫలితం లేకపోవడంతో జూలై 2న నేరుగా జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో ఉలిక్కిపడ్డ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి కిల్లర్ వైఫ్ తన్నుతో పాటు కిరాయి హంతకుడు హరిఓమ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో తన్ను తన పాపాన్ని అంగీకరించిందని, ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రియుడు సోను, మరో నిందితుడు అమన్ కోసం వేట కొనసాగుతోందని డీఎస్పీ సురేందర్ షియోరన్ స్పష్టం చేశారు.
Also Read : ఢిల్లీలో దారుణం: పెళ్లయిన రెండు నెలలకే నవవధువు అనుమానాస్పద మృతి!









