
NTA : దేశంలో నీట్ (NEET-UG), సీయూఈటీ (CUET), జేఈఈ మెయిన్ (JEE Main) వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కేవలం 39 శాశ్వత పోస్టులు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఇవన్నీ కూడా డెప్యుటేషన్ పద్ధతిలోనే భర్తీ చేసినట్లు పార్లమెంట్‌కు వెల్లడించింది. సిపిఐ(ఎమ్) ఎంపీ డాక్టర్ వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంత మజుందార్ రాతపూర్వక సమాధానమిచ్చారు. 2018లో ఎన్టీఏ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 270కి పైగా జాతీయ స్థాయి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కాలంలో 6.6 కోట్లకు పైగా అభ్యర్థుల రిజిస్ట్రేషన్లను ఎన్టీఏ పర్యవేక్షించిందని స్పష్టం చేసింది. ఒప్పంద ఆధారిత (కాంట్రాక్ట్), అవుట్సోర్సింగ్, ఫీల్డ్ సిబ్బంది సహాయంతో ఈ భారీ పరీక్షల ప్రక్రియను నిరంతరం నడిపిస్తున్నామని పేర్కొంది.
ఎన్టీఏలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా కనిపించినప్పటికీ, ఆధునిక పరీక్షా నిర్వహణ సంస్థలలో ఇది సాధారణ విషయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశ్నాపత్రాల తయారీ, సెంటర్ల కేటాయింపు, సైబర్ సెక్యూరిటీ, మూల్యాంకనం వంటి బాధ్యతలను థర్డ్ పార్టీ సాంకేతిక భాగస్వాములు, కన్సల్టెంట్లకు అప్పగిస్తూ.. శాశ్వత కోర్ టీమ్ కేవలం విధాన నిర్ణయాలు, నాణ్యతా ప్రమాణాలు, సమన్వయంపై మాత్రమే దృష్టి సారిస్తుంది. ఎన్టీఏలోని 39 శాశ్వత పోస్టులలో డైరెక్టర్ జనరల్, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ఎనిమిది మంది డైరెక్టర్లు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు/రిసెర్చ్ సైంటిస్టులు, ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇద్దరు సీనియర్ సూపరింటెండెంట్లు ఉన్నారు. వీరికి తోడుగా 73 మంది కాంట్రాక్ట్ సిబ్బంది (అడ్వైజర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు), 124 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది (డేటా అనలిస్ట్‌లు, లీగల్ అసోసియేట్లు) పనిచేస్తున్నారు.
Also Read : రీల్స్ నుంచి రియల్ లైఫ్ దాకా: ఒకే యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
పరీక్షల నిర్వహణ సమయంలో ఎన్టీఏ తన ప్రధాన సిబ్బందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భారీ యంత్రాంగాన్ని వినియోగించుకుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధికారులు, అబ్జర్వర్లు, సిటీ కోఆర్డినేటర్లు, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లుగా సేవలందిస్తున్నారు. ఈ వికేంద్రీకృత వ్యవస్థ వల్లే తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ వేలాది కేంద్రాల్లో ఏకకాలంలో పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు.గణాంకాల ప్రకారం, 2026 సంవత్సరంలోనే ఎన్టీఏ ఇప్పటివరకు 12 రకాల పరీక్షలను నిర్వహించగా, వీటిలో 65 లక్షలకు పైగా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఎన్టీఏ పనితీరుకు నిదర్శనంగా నీట్ యూజీ (NEET UG) 2026 నిర్వహణను ప్రభుత్వం ఉదాహరణగా చూపిస్తూ.. మే 3న 565 నగరాల్లోని 5,432 కేంద్రాల్లో 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించామని, జూన్ 21న రీ-ఎగ్జామ్ పూర్తి చేసి జూలై 16న ఫలితాలను వెల్లడించామని తెలియజేసింది.
పరీక్షల పరిధి పెరగడంతో పాటు ఎన్టీఏ ఆర్థిక కార్యకలాపాలు కూడా భారీగా పెరిగాయని పార్లమెంట్ సమర్పించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 504.16 కోట్ల ఆదాయం, రూ. 440.20 కోట్ల వ్యయం నమోదు కాగా.. 2023-24 నాటికి ఏజెన్సీ రాబడి రూ. 1,116.84 కోట్లకు, ఖర్చు రూ. 1,040.95 కోట్లకు పెరిగినట్లు ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఎన్టీఏ కార్యకలాపాలు నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ పనితీరును మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల 16 మంది సీనియర్ స్థాయి అదనపు అధికారుల పోస్టులను కొత్తగా మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ రాజ్యసభలో స్పష్టం చేశారు.
Also Read : నీట్ లీకేజీ వ్యవహారం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు –కేంద్రానికి నోటీసులు









