passport fees :విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దేశంలో పాస్‌పోర్ట్ దరఖాస్తు, జారీ ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘పాస్‌పోర్ట్స్ (అమెండ్‌మెంట్) రూల్స్, 2026’ పేరిట కొత్త ఫీజుల వివరాలతో అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పెంచిన ధరలు 2026, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2012 తర్వాత, అంటే దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం పాస్‌పోర్ట్ ఫీజులను పెంచడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా 18 ఏళ్లు దాటిన దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. సాధారణ  తత్కాల్ విభాగాలలో పెరిగిన కొత్త ఫీజుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సాధారణ (నార్మల్) పాస్‌పోర్ట్ ధరలు
36 పేజీల పాస్‌పోర్ట్: ప్రస్తుతం దీని ధర రూ.1,500 ఉండగా, జూలై 1 నుంచి రూ.2,500కు పెరగనుంది.
60 పేజీల పాస్‌పోర్ట్: జంబో సైజ్ పాస్‌పోర్ట్ ధర ప్రస్తుతం రూ.2,000 ఉండగా, ఇకపై దీని కోసం రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది.
తత్కాల్ పాస్‌పోర్ట్ ధరలు
అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలనుకునే వారిపై కూడా భారం పడనుంది.
36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్: ప్రస్తుతం ఉన్న రూ.3,500 ఫీజు కాస్తా ఇకపై రూ.5,000కు చేరనుంది.
60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్: ప్రస్తుతం రూ.4,000 ఉన్న ఈ ఫీజు జూలై 1 నుంచి రూ.6,000కు పెరగనుంది.
పోగొట్టుకున్న లేదా పాడైపోయిన పాస్‌పోర్ట్‌ల రీప్లేస్‌మెంట్ ఫీజులు
ఒకవేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా అది పాడైపోయినా, దాని స్థానంలో కొత్తది (డూప్లికేట్/రీప్లేస్‌మెంట్) పొందాలంటే మునుపటి కంటే ఎక్కువ జరిమానా వసూలు చేయనున్నారు.
36 పేజీల రీప్లేస్‌మెంట్ (తత్కాల్): ప్రస్తుతం రూ.5,000 ఉండగా, ఇకపై రూ.7,500 చెల్లించాలి.
60 పేజీల రీప్లేస్‌మెంట్ (తత్కాల్): ప్రస్తుతం రూ.6,000 ఉండగా, జూలై 1 నుంచి ఈ ధర రూ.8,500కు పెరగనుంది.
మైనర్ల (పిల్లల) పాస్‌పోర్ట్ ధరలు
18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ల పాస్‌పోర్ట్ ధరలను కూడా కేంద్రం సవరించింది.
18 ఏళ్ల లోపు పిల్లలకు (36 పేజీలు): సాధారణ పద్ధతిలో రూ.1,750 కాగా, తత్కాల్ పథకం ద్వారా రూ.4,250గా నిర్ణయించారు.
8 ఏళ్ల లోపు పిల్లల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌కు: సాధారణ కేటగిరీలో రూ.4,250 కాగా, తత్కాల్ ద్వారా అయితే రూ.6,750 చెల్లించాల్సి ఉంటుంది.
ఎమర్జెన్సీ , ఐడెంటిటీ సర్టిఫికెట్ల వివరాలు
దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో జారీ చేసే ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను భారతదేశంలో ఉచితంగానే అందిస్తారు. అయితే, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఈ సర్టిఫికెట్ కోసం 15 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, భారతదేశంలో ఐడెంటిటీ సర్టిఫికెట్ ధర రూ.1,000 గా నిర్ణయించగా, విదేశాలలో ఉండే భారత పౌరులకు దీని ధరను 50 డాలర్లుగా ఖరారు చేశారు.
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, సాంకేతిక హంగులతో కూడిన కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌ల (e-Passports) జారీ ప్రక్రియ నేపథ్యంలోనే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 1 లోపు దరఖాస్తు చేసుకునే వారికి పాత ధరలే వర్తిస్తాయి కాబట్టి, పాస్‌పోర్ట్ కావాలనుకునే వారు ఈ లోపే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.