
Rahul Gandhi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రహ్లాద్ జోషిని రేపిస్టులను వెనకేసుకొచ్చే వ్యక్తి అని అభివర్ణించారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబాన్ని హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషుల విడుదలను ప్రహ్లాద్ జోషి గతంలో సమర్థించడాన్ని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు.
పార్లమెంట్ వెలుపుల రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో విద్యా వ్యవస్థను కోరుతూ యువత, ఎంతోమంది అమ్మాయిలు రోడ్లపై ఆందోళన చేస్తుంటే, వారిని లాఠీలతో కొట్టి అణచివేశారని మంటగలిచింది అన్నారు. ఇలాంటి సమయంలో రేపిస్టులకు రక్షణగా నిలిచిన వ్యక్తిని బీజేపీ దేశ విద్యాశాఖ మంత్రిగా నియమించిందని ఆయన విమర్శించారు. ప్రధాన మంత్రి కేబినెట్‌లో ఎంతోమంది ఉన్నప్పటికీ, నేరస్థులను రక్షించే వ్యక్తినే ఎందుకు ఎన్నుకున్నారో తనకు అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తపరిచారు.
కాగా నీట్ పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరగడంతో, 2021 నుంచి ఆ పదవిలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే రోజు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.









