
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పుణె లోహగడ్ కోట హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ప్రముఖ రియల్టర్ అయిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతడికి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి కలిసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నవంబర్‌లో కేతన్, సియాలకు వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి ఇష్టం లేకపోవడంతో జూన్ 18న కేతన్‌ను లోహగడ్ కోట వద్దకు తీసుకెళ్లి లోయలోకి తోసి చంపేశారు.
ఈ కేసులో మృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ టీమ్ సభ్యుడు సునీల్ గైక్వాడ్ వెల్లడించిన విషయాలు హత్యలోని క్రూరత్వాన్ని కళ్లకు కడుతున్నాయి. లోయలో పడిన కేతన్ తల పూర్తిగా ఛిద్రమైందని, చేతులు, కాళ్లపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం, దట్టమైన అడవిలో రెండు గంటల పాటు శ్రమించి మధ్యాహ్నం 1:30 గంటలకు మృతదేహాన్ని అంబులెన్స్‌కు అప్పగించింది. మృతదేహాన్ని వెలికితీస్తున్న సమయంలో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురవగా, నిందితురాలు సియా మాత్రం ఎలాంటి భావోద్వేగాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read : ఏడు దశాబ్ధాల భూవివాదం… సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Ketan Agarwal Case
దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన డిజిటల్ ఆధారాలు ఈ హత్య వెనుక ఉన్న భారీ కుట్రను బయటపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి సియా, చేతన్ మధ్య ఏకంగా 2 వేలకు పైగా ఫోన్ కాల్స్ జరిగాయని, దాదాపు 238 గంటల పాటు వారు మాట్లాడుకున్నారని పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తమ మొబైల్స్‌లోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాట్లను డిలీట్ చేయగా, వాటిని ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో రికవరీ చేస్తున్నారు. అంతేకాకుండా, హత్యకు ముందు రోజు అనగా జూన్ 17న పుణెలోని లుల్లానగర్ ప్రాంతంలో ఉన్న ఓ కేఫేలో వీరిద్దరూ గంటపాటు సమావేశమై హత్యకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
నిందితుల పరిచయంపై సియా సోదరుడు సాహిల్ గోయల్ పోలీసులకు కీలక వాంగ్మూలం ఇచ్చాడు. తన క్రికెట్ మ్యాచ్‌లకు సియా వచ్చేదని, అక్కడే చేతన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత గతేడాది దీపావళి సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో కలుసుకున్నప్పటి నుంచి వారు మరింత సన్నిహితంగా మెలిగారని సాహిల్ తెలిపాడు. సియాకు పెళ్లి ఇష్టం లేకపోతే తామే రద్దు చేసేవాళ్లమని అతడు పేర్కొనగా.. తన కూతురు పెళ్లిపై ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదని, చేతన్‌ను తాను ఎన్నడూ చూడలేదని సియా తల్లి పూజా గోయల్ వెల్లడించింది. మరోవైపు, చేతన్ కేవలం సియాకు స్నేహితుడు మాత్రమేనని సియా తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.
కేతన్‌ను లోయలోకి తోసేయాలని సియాను చేతన్ చౌధరియే ప్రేరేపించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘాతుకంలో సియా, చేతన్ ఇద్దరి పాత్ర స్పష్టంగా నిర్ధారణ అయిందని లోణావాలా డివిజన్ డీఎస్పీ గజానన్ టోంపే అధికారికంగా ప్రకటించారు. పక్కా ప్రణాళికతోనే కేతన్‌ను వీరు అంతమొందించినట్లు లభ్యమవుతున్న సాక్ష్యాలు బలం చేకూరుస్తున్నాయి.
ఈ దారుణ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ హత్యను ఖండించిన ఆయన, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కేసు విచారణను వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
Also Read : బీజేపీది నకిలీ హిందుత్వం.. స్వామి అవిముక్తేశ్వరానంద్ సంచలన వ్యాఖ్యలు!









