HP Navya 10kg cylinder
HP Navya 10kg cylinder

ఒకప్పటిలా తరచూ షాపునకు వెళ్లి కిరాణా సామాన్లు కొనే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ ఆర్డర్ మయమైపోయింది. ఇంటికి అవసరమైన కిరాణా సరుకులు, కూరగాయాలు, ఇతర వస్తువులను మొబైల్‌లో ఇలా ఆర్డర్ పెట్టగానే అలా క్షణాల్లో ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో మరో వస్తువు చేరబోతోంది. ఇకపై వంట గ్యాస్‌ సిలిండర్‌ను సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే విప్లవం రాబోతోంది.

సాధారణంగా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తే.. అది ఒక లేదా రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. దేశంలోనే మొట్టమొదటి ఆన్-డిమాండ్ LPG సిలిండర్ డెలివరీ సేవను ప్రారంభించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్‌ను ఓపెన్ చేసి ఆర్డర్ చేయగానే.. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు డెలివరీ అవుతుంది. ఇదే తరుణంలో.. HPCL ఒక వినూత్నమైన సిలిండర్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. అదే హెచ్‌పి నవ్య (HP Navya) సిలిండర్. ఇది 10 కేజీల కాంపోజిట్ సిలిండర్. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. బ్లాస్ట్ అయ్యే ముప్పు లేకుండా దీనిని రూపొందించారు.

ఈ ఆన్‌లైన్ గ్యాస్ సిలిండర్ ఆర్డరింగ్ సేవలు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. ఇందులో భాగంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్.. కస్టమర్లకు రెండు ఆప్షన్‌లను అందిస్తుంది. అందులో ఇన్‌స్టామార్ట్ యాప్‌లో కొత్త 10-కిలోల ‘HP నవ్య’ సిలిండర్‌లను ఆర్డర్ చేయవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న 5-కిలోల ‘చోటు’ సిలిండర్‌లను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

దీనికోసం ఎలాంటి LPG కనెక్షన్ అవసరం లేదు. ఏ కొత్త వినియోగదారు అయినా యాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలను బెంగళూరులో విజయవంతంగా ప్రారంభించిన అనంతరం.. భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించాలని కంపెనీలు యోచిస్తున్నాయి.