Sowcar Janaki : ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయోభారం, శ్వాసకోశ సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న జానకి ఈ రోజు (శుక్రవారం) కన్నుమూశారు. ఆమె మృతితో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు జానకి మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.

కాగా జానకీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 389కు పైగా చిత్రాల్లో జానకి నటించారు. ఆమె ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌తో హీరోయిన్‌గా నటించడం గమనార్హం. ఆమె చివరగా 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలో కనిపించారు. ఆమె తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడుగా ఉన్నారు. ఆయన ఇంగ్లాండులో మూడేళ్ళపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివి ఇండియాకు వచ్చాడు. ఆమె తల్లి శచీదేవి, అస్సాం రాష్ట్రం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. ఆమె అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందడం విశేషం. జానకీకి15 ఏళ్ళకే పెళ్ళయింది.

జానకీ రంగస్థల నటిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో వచ్చారు. సినీ కథానాయికగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 389కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 2 వందలకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడం గమనార్హం. జానకి మొదట రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ మొదలైన అగ్రనటుల సరసన కథానాయికగా చేసిన అనుభవం ఆమెకు ఉంది. ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినిమా నటి. భారత ప్రభుత్వం జానకిని 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

జానకి చిన్నతనం నుంచే రంగస్థల నాటకాలలో పలు పాత్రలు పోషిస్తూ బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తన 11వ యేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొని మెప్పించింది. ఆమె మొట్టమొదటి చిత్రం రక్షరేఖ.1949లో వచ్చిన ఈ సినిమాలో చంద్రికగా నటించింది. అయితే 1950లో జానకి షావుకారు (1950) చిత్రంలో నటించగా అది మంచి గుర్తింపు తెచ్చింది. దీంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరైపోయింది. జానకి తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 385 చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, ఒక మలయాళం సినిమాలోనూ నటించారు. తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఆమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేశారు.. ఆమె సత్యసాయిబాబా భక్తురాలు. తెలుగులో ఆమె షావుకారు, డాక్టర్ చక్రవర్తి (1964), మంచి మనసులు (1962), రోజులు మారాయి (1955) తదితర సినిమాల్లో నటించి మెప్పించారు.

గాంధీకి సేవలు
జానకి దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ పాఠశాలలో చదువుకున్నారు. ఒకరోజు ఆ పాఠశాలకు గాంధీజీ హిందీ ప్రచార్‌ సభ కోసం వచ్చారు. ఆ సమయంలో ఆయనకు భోజనం, వసతి సౌకర్యాలు చూసుకునేందుకు జానకిని నియమించారు. అలా గాంధీతో ఏర్పడిన పరిచయంతో జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, ఇందిరాగాంధీ.. ఇలా ఎందరో గొప్ప వ్యక్తులను నేరుగా కలిసే అవకాశం ఆమెకు దక్కింది. అది తాను చేసుకున్న అదృష్టమని జానకి చెప్పుకునే వారు.

పెళ్లి అయ్యాకే సినిమాల్లోకి..
జానకికి 15 ఏళ్ల వయసులోనే రేడియో ఇంజినీర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఇంట్లో వారు అంగీకరించకపోవడంతో ఆమె అవకాశాలను వదులుకున్నారు. ఆ తర్వాత శంకరమంచి శ్రీనివాస్‌తో వివాహం అయింది. ఆ తర్వాతే ఆమె జీవితంలో రెండో అధ్యాయం మొదలైంది. ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయం మూలంగా వీరికి చిల్లిగవ్వ ఆస్తి రాలేదు. దీంతో పట్టెడన్నం కోసం ఎన్నో పాట్లు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. కొన్ని రోజులకు సంసారం గడవడమూ కష్టమైంది. అయినప్పటికీ ఆమె పుట్టింటికి వెళ్లాలని అనుకోలేదు. తనకు తెలిసిన విద్య నటన మాత్రమే. అందుకే, భర్త అనుమతితో సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ, సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే భర్తతో విభేదాలు మూలంగా విడిపోవడంతో పిల్లలకు అన్నీ తానై పెంచారు జానకి.

శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకే
సీనియర్‌ నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకినే. వాహిని స్టూడియోస్‌ వాళ్లు ఒక పెద్ద సినిమా తీయాలనుకున్నారట. ఆ సమయంలో బాల మురుగన్‌ పాత్రకు చిన్న పిల్లాడు కావాలి. అందంగా ఉండాలి. బ్రిలియంట్‌గా ఉండాలి’ అని అనుకున్నారు. ఆ సమయంలో శ్రీదేవి తల్లి రాజేశ్వరి పాపను పట్టుకుని వాహిని స్టూడియో వద్ద నిలబడి ఉందట. వెంటనే జానకి శ్రీదేవిని ఆమెను తీసుకుందామని చెప్పడంతో దర్శకుడు ఒకే అన్నారు. అలా శ్రీదేవి సినిమాల్లోకి వచ్చారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.