Tamil Nadu Budget 2026 :  తమిళనాడులోని సీఎం విజయ్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. విజయ్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ లోనే విద్య, సంక్షేమం, వైద్యం, ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసింది. 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలనే లక్ష్యంతో మందుకు వెళ్తున్నట్లుగా తెలిపింది.

ఈ బడ్జెట్‌లో పాఠశాల విద్యా శాఖకు రూ. 44,527 కోట్లు, ఉన్నత విద్యా శాఖకు రూ. 8,393 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 277 కోట్లతో సైకిళ్లు, హెల్మెట్లు, బాటిల్ హోల్డర్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడానికి ప్రభుత్వం రూ. 2,000 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి ప్రభుత్వం రూ. 2,132 కోట్లు ప్రకటించింది.

Also Read : ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యకు సంబంధించిన కార్యక్రమాల కోసం మరో రూ. 300 కోట్లు, పాఠశాల సిలబస్‌ను మార్చడానికి రూ. 25 కోట్లు కేటాయించారు. ఆధునిక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు రూ. 125 కోట్లు కేటాయించారు. విద్యా సంస్థలలో పారిశుద్ధ్యం , మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 139 కోట్లు కేటాయించారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి అవగాహన కల్పించే డ్రగ్ ఫ్రీ తమిళనాడు కార్యక్రమం కింద రూ. 7 కోట్లు కేటాయించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వడానికి రూ. 560 కోట్లు కేటాయించారు. అలాగే మహిళల కోసం ప్రభుత్వం సరికొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు వారి వివాహం సమయంలో ఎనిమిది గ్రాముల బంగారు నాణేం, ఒక పట్టు చీర అందజేస్తారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 812 కోట్లు కేటాయించింది. పేద కుటుంబాల కోసం వచ్చే ఏడేళ్లలో లక్ష ఇళ్లను నిర్మించడానికి మై హోమ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు రూ. 8,852 కోట్లు కేటాయించారు. అటు చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి రూ. 25 కోట్లు కేటాయించారు.

అయితే ఈ బడ్జెట్ పై మాజీ సీఎం స్టాలిన్ తో పాటు, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి బడ్జెట్‌ను నిరాశపరిచిందని కొట్టిపారేశారు. టీవీకే ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టకుండా, ఇప్పటికే ఉన్న పథకాలకు కేవలం కొత్త పేర్లు పెట్టిందని ఆయన ఆరోపించారు.

Also Read : ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పన్నీర్‌ బ్యాన్.. అమ్మితే లక్ష రూపాయలు ఫైన్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.