Whatsapp Username Feature (1)
Whatsapp Username Feature (1)

WhatsApp Username Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (whatsapp) తాజాగా ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ నంబర్లను మాత్రమే ఏకైక మార్గంగా వాడుతున్నారు. ఇలా దాదాపు దశాబ్ద కాలం పాటు జరుగుతోంది. అయితే ఇప్పుడు వాట్సాప్ ఆ ధోరణికి స్వస్తి పలికబోతోంది. త్వరలో ‘యూజర్‌నేమ్స్’ (whatsapp username feature) ఫీచర్‌ను తీసుకువస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులకు ఇవ్వకుండానే.. కేవలం ఒక యూజర్‌నేమ్ ద్వారా ఎవరితోనైనా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే దీనిని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా సైబర్ అటాక్ ఏమైనా జరుగుతుందా?, దీని వెనుక ఉన్న సామాజిక, భద్రతా కారణాలేంటి అనే విషయాల గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఫీచర్‌ను టెలిగ్రామ్ యాప్ ఎన్నో ఏళ్ల క్రితమే తీసుకువచ్చి మంచి విజయం సాధించగా.. వాట్సాప్ ఇంత ఆలస్యంగా తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Also Read : కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త మలుపు..!

సైబర్ భయాలు

సాధారణంగా ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినపుడు దాంతో పాటు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఎన్నో సవాళ్లను సైతం ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వినియోగదారుల భయం కూడా అదే. వాట్సాప్ తీసుకొస్తున్న యూజర్‌నేమ్స్ ఫీచర్ వల్ల ఆన్‌లైన్‌లో స్కామర్స్ ఫేక్ ఐడీలతో స్కామ్‌లు చేయడానికి ఇప్పుడు మరింత సులభతరం కావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారడంతో భారత ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఆందోళన నడుమ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చే ముందు భారత ప్రభుత్వం దీనిని నిశితంగా పరిశీలించనుంది. ఈ ఫీచర్‌ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు వాట్సాప్ భద్రతా చర్యలు తీసుకుందా లేదా అని అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఆ సమయంలో ఏవైనా లోపాలు కనిపిస్తే మెటా సంస్థకు నోటీసులు పంపే అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌పై సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, క్లారాకాన్ ఏఐ మేనేజింగ్ పార్టనర్ ముకుల్ కుమార్ తాజాగా ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాట్సాప్ తీసుకొస్తున్న యూజర్ నేమ్స్ ఫీచర్ యూజర్ల భద్రతకు పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు. భారతదేశంలో ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్ కచ్చితంగా వారి ఆధార్, బ్యాంక్, యూపీఐ సహా మరెన్నో ప్రభుత్వ రికార్డులతో ముడిపడి ఉంటుందన్నారు. అలాగే హౌసింగ్ సొసైటీలో గ్రూప్‌లలో అపరిచిత వ్యక్తులతో, ఆఫీసులో చేరిన రోజే సహోద్యోగితో ఫోన్ నంబర్‌ను షేర్ చేసుకుంటామని.. అలా పంచుకున్న ప్రతిసారి మనకు తెలియకుండానే మనకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని ఇతరుల చేతుల్లో పెడుతున్నామని హెచ్చరించారు. అందువల్ల వాట్సాప్ ఇప్పుడు తీసుకువస్తున్న ఫీచర్ వల్ల ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించకుండా హైడ్ అవుతుందని, ఇది యూజర్ల సేఫ్టీకి పెద్ద ఊరట అని ఆయన తెలిపారు.

Also Read : కేతన్ హత్య కేసులో కీలకంగా మారిన గెయిట్‌ అనాలసిస్‌..! ఎందుకంటే ?