
ఒక్క మ్యాప్.. అంతే.. కానీ ఆ ఒక్క మ్యాప్ ఇప్పుడు అమెరికా నుంచి యూరప్ వరకు కొత్త కాంట్రవర్సీకి కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఓ మ్యాప్ పోస్ట్ చేశారు. ఆ మ్యాప్‌లో.. అమెరికా మాత్రమే కాదు.. కెనడా, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, మెక్సికో, సెంట్రల్ అమెరికా, కరేబియన్ ప్రాంతాలు అన్నీ అమెరికా జెండా రంగుల్లో కనిపించాయి. అంతేకాదు .మొత్తం ప్రాంతాన్ని “United States of America”గా చూపించారు. కానీ.. ఈ మ్యాప్ ఎందుకు పోస్ట్ చేశారు?.. దీని వెనుక ఏదైనా స్పెసిఫిక్ మెసేజ్ ఉందా?.. లేక ట్రంప్ స్టైల్లో మరో రెచ్చగొట్టే పోస్ట్ మాత్రమేనా?.. అదే ఇప్పుడు అసలు డిబేట్.
ఎందుకంటే.. ఇది గ్రీన్‌ల్యాండ్ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత రావడం. మరోవైపు ఐస్‌ల్యాండ్‌ను కూడా అమెరికా మ్యాప్‌లో చూపించడం.. ఈ రెండూ కలిపి చూస్తే.. ఇది కేవలం ఒక మ్యాప్ కాదు.. ఒక భౌగోళిక రాజకీయ సంకేతం అంటూ చర్చ మొదలైంది. అసలు మ్యాప్‌లో ఏముంది?, ట్రంప్ ఈ మ్యాప్‌ను తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే.. ఆ పోస్ట్‌కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అంటే.. ‘గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్ ప్రాంతాలు అమెరికాలో కలుస్తాయి’ అని ట్రంప్ ఎక్కడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి.. ఒక్క మ్యాప్‌ను చూసి అమెరికా ఇప్పుడు ఆ దేశాలను ఆక్రమించబోతోంది అని చెప్పడం సరైంది కాదు. కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ గతంలో కూడా కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అలాగే.. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పదేపదే చెప్పారు. అందుకే.. ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌తో పాటు ఐస్‌ల్యాండ్ కూడా అమెరికా మ్యాప్‌లో కనిపించడంతో డెన్మార్క్, ఐస్‌ల్యాండ్ రెండూ సీరియస్‌గా స్పందించాయి. డెన్మార్క్ ఎందుకు ఆగ్రహించింది? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్‌ల్యాండ్ స్వతంత్ర దేశం కాదు. ఇది డెన్మార్క్ రాజ్యంలో స్వయంపాలిత ప్రాంతం. అక్కడ సొంత ప్రభుత్వం ఉంది. సొంత పార్లమెంట్ ఉంది. అనేక ఇంటర్నెల్ ఇష్యూస్‌ని గ్రీన్‌ల్యాండ్ స్వయంగా చూసుకుంటుంది. కానీ.. గ్రీన్‌ల్యాండ్ రక్షణ, విదేశాంగశాఖ వంటి కీలక అంశాల్లో డెన్మార్క్ జోక్యం ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని ఒక అమెరికా మ్యాప్‌లో అమెరికా భూభాగంగా చూపించడం డెన్మార్క్‌కు సహజంగానే దౌత్యపరమైన సమస్యగా మారింది.
డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కె రాస్ముసెన్.. ట్రంప్ పోస్టు చేసిన మ్యాప్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సరైంది కాదని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే.. డెన్మార్క్ దృష్టిలో ఇది ట్రంప్ సరదాగా పోస్ట్ చేసిన మ్యాప్ కాదు. ట్రంప్ మనసులో ఏముందో ఆ మ్యాప్ చెబుతోందని డెన్మార్క్ వాదిస్తోంది. మరోపక్క, ఐస్‌ల్యాండ్ ఎందుకు షాక్ అయింది?.. ఇక్కడే ఈ కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్ కాదు.. డెన్మార్క్ భూభాగం కూడా కాదు.. అది ఒక స్వతంత్ర దేశం. అయినా.. ట్రంప్ మ్యాప్‌లో ఐస్‌ల్యాండ్ కూడా అమెరికా భూభాగంలో ఉన్నట్టుగా కనిపించింది. దీంతో ఐస్‌ల్యాండ్ ప్రభుత్వం అమెరికా రాయబారిని పిలిపించింది.
Also Read : నా దవడ ఎముకలు విరిగాయి.. విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ రిప్లై!
విదేశాంగ మంత్రి కాట్రిన్ గున్నార్స్డొట్టిర్.. ట్రంప్ పోస్ట్ చేసిన మ్యాప్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఐస్‌ల్యాండ్ కూడా తమ దేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన విషయంగానే దీన్ని చూసింది. ఇంతకీ అమెరికా మ్యాప్‌లో ఐస్‌ల్యాండ్‌ను ట్రంప్ ఎందుకు పెట్టారు?.. అదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. దీనిపై ఇప్పటివరకు ట్రంప్ నుంచి సమాధానం లేదు. కాబట్టి.. ఐస్‌ల్యాండ్‌ను అమెరికాలో కలపాలనే ఉద్దేశం ట్రంప్‌కు ఉందని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారం లేదు. కానీ.. గ్రీన్‌ల్యాండ్‌పై గతంలో చేసిన ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మ్యాప్ విషయంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు గ్రీన్‌ల్యాండ్ మీద ట్రంప్‌కు అంత ఇంట్రెస్ట్ దేనికి?. ఇదే ఈ మొత్తం కథలో మెయిన్ పాయింట్. గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ఎక్కడ చూసినా మంచే కనిపిస్తుంది. కానీ.. ఆ మంచు కింద ప్రపంచానికి అవసరమైన విలువైన వనరులు ఉన్నాయి.
క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. అంతేకాదు గ్రీన్‌ల్యాండ్ ఉన్న ప్రదేశం అమెరికాకు చాలా వ్యూహాత్మకం. ఒక వైపు ఉత్తర అమెరికా, మరోవైపు యూరప్, మధ్యలో ఆర్కిటిక్ ప్రాంతం. ఆర్కిటిక్‌లో రష్యాకు కూడా చాలా కీలకమైన ప్రయోజనాలు ఉన్నాయి. చైనా కూడా ఆర్కిటిక్‌లో తన ఉనికి పెంచుకోవాలని చూస్తోంది. అందుకే.. గ్రీన్‌ల్యాండ్ కేవలం ఒక దీవి కాదు. ఆర్కిటిక్‌లో ఎవరి పట్టు పెరుగుతుందో నిర్ణయించే కీలక ప్రాంతం. మంచు కరిగితే మొత్తం స్టోరీయే మారిపోతుందా?.. ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. వాతావరణ మార్పులతో ఆర్కిటిక్‌లో మంచు క్రమంగా తగ్గుతోంది. దీంతో మంచు కరుగుతుంటే.. ఈ సముద్ర మార్గాలు భవిష్యత్తులో మరింత కీలకంగా మారొచ్చు. అంటే.. యూరప్ నుంచి ఆసియాకు ఉత్తర దిశగా కొత్త షిప్పింగ్ రూట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వాణిజ్యం, ఇంధనం, సైనిక రవాణా, వనరుల రవాణా అన్నింటికీ ఆర్కిటిక్ ప్రాధాన్యం మరింత పెరుగుతుంది.
అందుకే ఇప్పటి నుంచే అమెరికా, రష్యా, చైనా, యూరప్ అందరూ ఆ ప్రాంతంపై ఫోకస్ పెంచుతున్నారు. అదే సమయంలో గ్రీన్‌ల్యాండ్‌లో ఉన్న మరో పెద్ద ఆస్తి ఏంటి? మినరల్స్. ప్రపంచం ఇప్పుడు కేవలం చమురు కోసం పోటీ పడటం లేదు. బ్యాటరీలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు, సెమీకండక్టర్లకు, రక్షణ రంగానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్ కోసం కూడా పోటీ పెరుగుతోంది. గ్రీన్‌ల్యాండ్‌లో ఇలాంటి వనరులు ఉన్నాయన్న కారణంగా దాని ఎకనామిక్ వాల్యూస్ కూడా పెరుగుతోంది. అమెరికాకు ఇవి ఎందుకంత అవసరమో ఇక్కడ సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కీలక ఖనిజాల కోసం చైనాపై ఆధారపడకూడదనేది అమెరికా లక్ష్యం. అలాంటి సమయంలో ఆర్కిటిక్‌లో ఉన్న గ్రీన్‌ల్యాండ్ వనరులపై ఎవరి పట్టు ఉంటుందన్నది చాలా ఇంపార్టెంట్. కానీ గ్రీన్‌ల్యాండ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు?.. ఇదే ఇప్పుడు అసలు కీలకమైన విషయం. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తు గురించి నిర్ణయం.. గ్రీన్‌ల్యాండ్ ప్రజలదే కావాలి. ఇదే డెన్మార్క్, యూరప్ నుంచి వస్తున్న ప్రధాన సందేశం.
Also Read : రోడ్డు ప్రమాదంలో యువతి మరణం.. దర్యాప్తులో బయటపడ్డ అసలు ట్విస్ట్ ..
అంటే.. అమెరికా కావాలంటే తీసుకెళ్లే ప్రాంతం కాదు. అక్కడి ప్రజల అభిప్రాయం, వారి రాజకీయ భవిష్యత్తు, వారి నిర్ణయం అన్నీ కీలకం. అందుకే గ్రీన్‌ల్యాండ్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు వచ్చిన ప్రతిసారి డెన్మార్క్ మాత్రమే కాదు యూరప్ కూడా స్పందిస్తోంది. మరి యూరప్ ఏం చేస్తోంది?.. ఇక్కడే మరో బిగ్ డవలప్మెంట్ జరిగింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా గ్రీన్‌ల్యాండ్‌కు వెళ్లారు. అక్కడ.. గ్రీన్‌ల్యాండ్‌తో కలిసి పనిచేయడానికి ‘యూరోపియన్ యూనియన్’ 200 మిలియన్ యూరోల ఒప్పందం ప్రకటించింది. ఈ డబ్బును డిజిటల్ కనెక్టివిటీ శాటిలైట్ కమ్యూనికేషన్, సముద్రం కింద కేబుల్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, విద్య, ఫిషింగ్ ఇండస్ట్రీ, ఇళ్ల నిర్మాణలాంటి తదితర రంగాల్లో ఇన్వెస్టిమెంట్స్కు యూజ్ చేయబోతున్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు. దీనిలో ఒక వ్యూహాత్మక సందేశం కూడా ఉంది. అది ఏంటంటే.. “గ్రీన్‌ల్యాండ్ ఒంటరిగా లేదు.” “యూరప్ దాని వెంట ఉంది” అనే సందేశాన్ని అమెరికాకు కూడా పంపుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే.. అమెరికా వర్సెస్ యూరప్ అని ఇప్పుడే చెప్పలేం. కానీ.. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా ఆసక్తి పెరుగుతుంటే.. యూరప్ కూడా తన సంబంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఇది ఆధిపత్యం కోసం పోటీగా మారే అవకాశం ఉంది. ఒకవైపు అమెరికా.. మరోవైపు యూరప్.. మధ్యలో గ్రీన్‌ల్యాండ్. అదే సమయంలో రష్యా, చైనా కూడా ఆర్కిటిక్‌లో తమ ప్రయోజనాలను పెంచుకోవాలని చూస్తున్నాయి. అంటే చిన్నగా కనిపించే గ్రీన్‌ల్యాండ్ పెద్ద జియో పొలిటికల్ చెస్‌బోర్డులో కీలకమైన పావుగా మారింది.
మరి ట్రంప్ మ్యాప్‌లో కెనడా ఎందుకు ఎందుకు వచ్చింది?. ఇది కూడా ఈ స్టోరీలో ఇంపార్టెంట్ పాయింటే. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్ ఇదివరకే వ్యాఖ్యలు చేశారు. కెనడా మాత్రం దీనిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. ఇప్పుడు కొత్త మ్యాప్‌లో కెనడా కూడా అమెరికా భూభాగంలో ఉన్నట్టుగా ట్రంప్ చూపించారు. దీంతో గతంలో చేసిన ట్రంప్ వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి. అంటే.. ఈ మ్యాప్‌ను మాత్రమే చూస్తే సరిపోదు. గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా కలిపి చూడాల్సి ఉంటుంది. అప్పుడే ఈ నమూనా అర్థమవుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం. మ్యాప్ అంటే చట్టం కాదు. సోషల్ మీడియాలో ఒక మ్యాప్ పెట్టడం వల్ల ఏ దేశం అమెరికాలో కలిసిపోదు. అమెరికా అధ్యక్షుడు ఒక మ్యాప్ పోస్ట్ చేశారని.. అంతర్జాతీయ సరిహద్దులు మారిపోవు. గ్రీన్‌ల్యాండ్ ఒక్క రాత్రిలో అమెరికా టెరిటరీ అయిపోదు. ఐస్‌ల్యాండ్ కూడా అమెరికాలో 51వ రాష్ట్రం కాదు. కెనడా కూడా కాదు. అందుకే.. ఈ మ్యాప్‌ను లీగల్ డాక్యుమెంట్‌గా చూడకూడదు. కానీ.. ఇది ఎందుకు ముఖ్యమంటే ఒక దేశ అధ్యక్షుడు.. ఇతర దేశాల భూభాగాలను తన దేశంలో ఉన్నట్టుగా చూపిస్తే ఆ దేశాల నుంచి స్పందన రావడం సహజమే. మరి ట్రంప్ అసలు మెసేజ్ ఏంటి?. ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి.
మొదటిది.. ఇది ట్రంప్ రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు. అంటే.. ఒక వివాదాస్పద పోస్ట్. ఒక షాకింగ్ స్టేట్మెంట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం. ఇక రెండోది.. ఆర్కిటిక్‌లో తన ప్రయోజనాలను అమెరికా ఎంత సీరియస్‌గా చూస్తుందో చెప్పే సిగ్నల్ కావచ్చు. అయితే.. ఈ మ్యాప్ పోస్ట్ వెనుక ఉద్దేశం ఏంటో ట్రంప్ అఫీషియల్‌గా ఎక్కడా చెప్పలేదు. కానీ.. ప్రపంచ దేశాలు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే.. ఆర్కిటిక్ ఇక ఖాళీ ప్రాంతం కాదు. గతంలో ఆర్కిటిక్ అంటే మంచు. దూరంగా ఉన్న ప్రాంతం. అక్కడ జనాభా తక్కువ, ఆర్థిక కార్యకలాపాలు తక్కువ, కానీ ఇప్పుడు ఆర్కిటిక్ స్టోరీ మారింది. మంచు తగ్గుతోంది, కొత్త సముద్ర మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది, ఖనిజాలపై పోటీ పెరుగుతోంది, సైనిక ప్రాధాన్యం పెరుగుతోంది, శాటిలైట్ కమ్యూనికేషన్, డేటా, ఎనర్జీ అన్నింటికీ ఆర్కిటిక్ కీలకంగా మారుతోంది. అందుకే అమెరికా అక్కడ తన ఉనికి పెంచాలనుకోవడం.. గ్రీన్‌ల్యాండ్‌తో యూరప్ సంబంధాలు పెంచుకోవడం.. తన ఆర్కిటిక్ సామర్థ్యాలను రష్యా బలోపేతం చేయడం.. చైనా కూడా అక్కడ అవకాశాలు వెతకడం.. ఇవన్నీ ఒకే లార్జర్ పిక్చర్లో భాగం. మరి ఐస్‌ల్యాండ్ విషయంలో ఏం జరుగుతుంది?. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రస్తుతం ఐస్‌ల్యాండ్‌ను అమెరికా తన ఆధీనంలోకి తీసుకునే అధికారిక ప్రతిపాదన ఉందని చెప్పడానికి ఆధారం లేదు.
ఇక్కడో విషయాన్ని మరోసారి క్లియర్ చేస్తున్నా. ఐస్‌ల్యాండ్‌కు ఉన్న భౌగోళిక ప్రాధాన్యం మాత్రం చాలా ఎక్కువ. ఉత్తర అట్లాంటిక్‌లో యూరప్, ఉత్తర అమెరికా మధ్యలో ఐస్‌ల్యాండ్ చాలా కీలకమైన చోట ఉంది. సైనికంగా కూడా సముద్ర మార్గాల పరంగా కూడా దాని లొకేషన్ చాలా ముఖ్యమైనది. అందుకే తమ దేశ స్వాతంత్ర్యంపై ఎలాంటి ప్రశ్న వచ్చినా ఐస్‌ల్యాండ్ సీరియస్‌గా స్పందించింది. చివరికి అసలు కథ ఏంటి?.. ఒక మ్యాప్‌తో అమెరికా సరిహద్దులు మారలేదు. అమెరికాలో గ్రీన్‌ల్యాండ్ చేరలేదు.. ఐస్‌ల్యాండ్ కూడా అమెరికా రాష్ట్రం కాలేదు.. కెనడా కూడా కాదు. కానీ ఈ మ్యాప్ ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తోంది. ఆర్కిటిక్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన ప్రాంతంగా మారింది. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా ఆసక్తి.. యూరప్ ఆందోళన.. రష్యా వ్యూహాలు.. చైనా ప్రయోజనాలు.. ఇవన్నీ కలిసి ఆర్కిటిక్‌ను ఒక కొత్త పవర్ జోన్‌గా మారుస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ మ్యాప్‌లో.. గ్రీన్‌ల్యాండ్ మాత్రమే కాదు ఐస్‌ల్యాండ్ కూడా కనిపించింది. అందుకే ప్రపంచం ఇప్పుడు ఆ మ్యాప్‌ను చూస్తోంది. మ్యాప్‌లో గీసిన గీతల కోసం కాదు.. దాని వెనుక ఉన్న సందేసం కోసం. ఎందుకంటే ఒక మ్యాప్‌తో దేశాల సరిహద్దులు మారవు. కానీ ఒక దేశ అధ్యక్షుడు పదేపదే ఒకే ప్రాంతంపై ఆసక్తి చూపిస్తే.. ఆ ఆసక్తి వెనుక ఉన్న వ్యూహం ఏంటి అన్నది ప్రపంచం గమనిస్తుంది. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా, యూరప్ మధ్య ఇన్ఫ్లుయెన్స్ గేమ్ ఇప్పటికే మొదలైంది. ఇప్పుడు ఆ మ్యాప్‌లో ఐస్‌ల్యాండ్ కూడా కనిపించింది. అంటే ఇది కేవలం గ్రీన్‌ల్యాండ్ కథగా మిగిలిపోతుందా? లేక ఉత్తర అట్లాంటిక్ మొత్తం మీద కొత్త భౌగోళిక రాజకీయ గేమ్ మొదలవుతుందా? అదే ఇప్పుడు అసలు ప్రశ్న.









