FIFA World Cup : ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ ముగింపు వేళ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఒక భారీ వివాదం కుదిపేస్తోంది. కాన్సాస్ సిటీలో అల్జీరియా, ఆస్ట్రియా జట్ల మధ్య జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగియడంతో.. ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకుని ‘రౌండ్ ఆఫ్ 32’కు అర్హత సాధించాయి. అయితే, ఈ ఫలితం వెనుక పెద్ద ‘డ్రామా’ నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇరాన్ కొంపముంచిన ‘డ్రా’ మ్యాచ్!
నిజానికి ఈ మ్యాచ్ ఫలితం ఆసియా మేటి జట్టు ఇరాన్ భవితవ్యాన్ని తేల్చాల్సింది. ఇరాన్ నాకౌట్ దశకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మ్యాచ్ ఊహించని విధంగా డ్రా కావడంతో, ఇరాన్ దురదృష్టవశాత్తూ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో, అల్జీరియా-ఆస్ట్రియా జట్లు కావాలనే కుమ్మక్కై మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాయని నెటిజన్లు, ఫుట్‌బాల్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

అల్జీరియా కెప్టెన్ నోట ‘నిజం’.. ఆస్ట్రియా డిఫెన్స్ విచిత్రం:
ఈ అనుమానాలకు అల్జీరియా కెప్టెన్ రియాద్ మహ్రెజ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మ్యాచ్ చివరి నిమిషాల్లో ఆస్ట్రియా డిఫెండర్ల ప్రవర్తన తనకు చాలా ఇబ్బందికరంగా (Awkward) అనిపించిందని ఆయన స్వయంగా అంగీకరించారు. “చివర్లో పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. మేము బంతిని హోల్డ్ చేస్తుంటే, వారు అసలు అడ్డుకోకుండా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. ఆ సమయంలో నా సహచరుడు ఇచ్చిన పాస్‌తో నేను గోల్ చేయాల్సి వచ్చింది. క్రీడా స్ఫూర్తిని గౌరవించి నేను ఆ గోల్ (3-2) చేశాను. అయితే ఆ తర్వాత వారు కూడా వెంటనే గోల్ చేసి నాకౌట్ చేరడం వారికి కలిసి వచ్చింది. ఇద్దరం క్వాలిఫై అవ్వడమే ఇక్కడ ముఖ్యం” అంటూ మహ్రెజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చివరి 5 నిమిషాల్లో హైడ్రామా:
ఈ మ్యాచ్‌లో అసలైన డ్రామా అంతా స్టాపేజ్ టైమ్‌లోనే జరిగింది. మ్యాచ్ 90+3వ నిమిషంలో మహ్రెజ్ గోల్ కొట్టి అల్జీరియాను 3-2తో ముందంజలో నిలిపాడు. ఆ సమయంలో ఆస్ట్రియా టోర్నీ నుంచి అవుట్ అయినట్లే అనిపించింది. కానీ, కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే (90+5వ నిమిషం) ఆస్ట్రియా ఆటగాడు సాసా కాలాజ్డిక్ హెడర్ ద్వారా గోల్ చేసి మ్యాచ్‌ను 3-3తో సమం చేయడం గమనార్హం. ఈ బ్యాక్-టు-బ్యాక్ గోల్స్ వెనుక ఏదో మతలబు ఉందనేది విమర్శకుల వాదన.

ఆరోపణలను కొట్టిపారేసిన ఆస్ట్రియా కోచ్:
అయితే, ఈ ఫిక్సింగ్ ఆరోపణలను ఆస్ట్రియా ప్రధాన కోచ్ రాల్ఫ్ రంగ్‌నిక్ తీవ్రంగా ఖండించారు. మ్యాచ్ చివరి నిమిషాల్లో ఇరు జట్లు చేసిన గోల్స్.. గెలుపు కోసం ఆటగాళ్లు ఎంతలా పోరాడారో చెప్పడానికి నిదర్శనమని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు.

‘డిస్‌గ్రేస్ ఆఫ్ గిజోన్’ జ్ఞాపకాలు:
ఈ తాజా వివాదం ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత బ్లాక్‌ డేగా భావించే 1982 ప్రపంచకప్ నాటి ‘డిస్‌గ్రేస్ ఆఫ్ గిజోన్’ (Disgrace of Gijón) మ్యాచ్‌ను గుర్తుకు తెస్తోంది. నాడు అల్జీరియాను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేయడానికి పశ్చిమ జర్మనీ, ఆస్ట్రియా జట్లు ఇలాగే చేతులు కలిపాయి. ఇప్పుడు మళ్లీ ఆస్ట్రియా మ్యాచ్‌లోనే, అదే అల్జీరియా జట్టు సమక్షంలో ఇలాంటి వివాదం తలెత్తడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఫిఫా (FIFA) ఎలాంటి విచారణ జరుపుతుందో చూడాలి.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.