Allu Arjun
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్‌లో పుష్ప-2: ది రూల్ మూవీ ప్రీమియర్స్‌ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో వేశారు. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్‌కు వచ్చారు. భారీగా ఫ్యాన్స్ ఉండటంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలోనే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా సోమవారం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం, బౌన్సర్లతో సహా మొత్తం 23 మందిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ఏ1గా అల్లు అర్జున్ పేరును చేర్చారు. A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఛార్జ్ షీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. తాజాగా ఈ కేసులోని 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది.