HYDERABAD TRAFFIC RESTRICTION
HYDERABAD TRAFFIC RESTRICTION

హైదరాబాద్‌లో ఉన్న ప్రసిద్ధ కట్టడం చార్మినార్ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రోజుకు కొన్ని వేల మంది ప్రజలు చార్మినార్‌ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తుంటారు. ఉత్సవాలు వచ్చాయంటే ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ ఉంటుంది. ఇటీవలే జరిగిన దసరా ఉత్సవాల సందర్భంగా కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Also Read : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత బీమా!

ఇప్పుడు మరో పండుగ కోసం ప్రజలు సిద్ధమయ్యారు. నవంబర్ 8న జరగనున్న దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. టపాసులు కాలుస్తూ ఆనందంగా గడపనున్నారు. ఈ క్రమంలోనే చార్మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పాటు పండుగ కొనుగోళ్ల కోసం పాతబస్తీ మార్కెట్లకు జనం పోటెత్తే ఛాన్స్ ఉండటంతో హైదరాబాద్ పోలీసులు ముందుగా అలర్ట్ అయ్యారు.

ఈ రద్దీ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి నవంబర్ 11వ తేదీ వరకు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ముఖ్యంగా చార్మినార్ వైపు వెళ్లే మూడు రహదారులపై వాహనాల రాకపోకలకు ఆంక్షలు ఉండనున్నాయి.

మదీనా – చార్మినార్: ఈ మార్గంలో భక్తులు, వాహనదారుల రద్దీని బట్టి వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించనున్నారు.

ముర్గీ చౌక్ – చార్మినార్: ఈ రోడ్డులో రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నియంత్రించనున్నారు.

రాజేష్ మెడికల్ హాల్ – షా అలీ బండ – చార్మినార్: వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించనున్నారు.

ఈ ట్రాఫిక్ ఆంక్షల కారణంగా అటువైపుగా ప్రయాణించే వాహనదారులు వీలైనంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Also Read : భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్.. హైదరాబాద్‌కు డేంజర్?