Telangana :  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ క్లియరెన్స్ నిరాకరించడంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విదేశీ పర్యటనలకు కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం రేవంత్‌రెడ్డికి మాత్రమే జరిగిన విషయం కాదు. గతంలో పలువురు సీఎంల పర్యటనలకు కూడా కేంద్రం ఇలాగే అనుమతులు నిరాకరించింది. విదేశీ పర్యటనలకు రాజకీయ క్లియరెన్స్ ఎందుకు అవసరం, గతంలో ఎవరెవరి పర్యటనలు ఆగిపోయాయనే అనేది ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ రైజింగ్ లో భాగంగా పెట్టుబడులు, విద్యా సంస్థల భాగస్వామ్యాల కోసం రేవంత్‌రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. అమెరికా పర్యటనకు మాత్రం రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. ప్రతిపాదిత కార్యక్రమాలు సీఎం పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా లేవని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూడాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన లేకుండానే రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో కొన్ని ఒప్పందాల కోసం ముందుకు వెళ్లనుంది.

మమతా బెనర్జీ: 2021లో రోమ్‌లో జరిగిన వరల్డ్ పీస్‌ కాన్ఫరెన్స్‌కు వెళ్లాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావించారు. ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో లేదని పేర్కొంటూ కేంద్రం అనుమతి నిరాకరించింది.

అరవింద్ కేజ్రీవాల్: 2019లో డెన్మార్క్‌లో జరిగే సమ్మిట్‌కు, 2022లో సింగపూర్ పర్యటనకు వెళ్లాలనుకున్న అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా కేంద్రం నుంచి అనుమతులు రాలేదు.

భగవంత్ మాన్: 2026 ఫిబ్రవరిలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో యూకే, ఇజ్రాయెల్ దేశాలలో పర్యటించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన పరిశ్రమల మంత్రి, ఇతర ప్రతినిధి బృందంతో కలిసి భావించారు. అయితే, కేంద్ర విదేశాంగ శాఖ దీనికి రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది.

2024లో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లి అక్కడ భారత హాకీ జట్టును ప్రోత్సహించాలని ఆయన ప్రయత్నించినప్పటికీ, ఆ పర్యటనకు కూడా కేంద్రం నుంచి అనుమతి రాలేదు. 2025లో భగవంత్ మాన్ జపాన్, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించడానికి మాత్రం కేంద్రం నుంచి అనుమతి లభించింది.

పినరయి విజయన్: 2025లో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ దేశాలలో పర్యటించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్‌కు కేంద్రం నుంచి రాజకీయ క్లియరెన్స్ లభించలేదు. అంతకుముందు 2023 సంవత్సరంలో కూడా సౌదీ అరేబియాలో జరగాల్సిన ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్లే విషయంలోనూ ఇలాంటి అనుమతి సమస్యే తలెత్తింది.

సీఎం లేదా మంత్రులు అధికారికంగా విదేశాలకు వెళ్లాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. విదేశాంగ శాఖ పర్యటన ఉద్దేశం, కార్యక్రమాల స్వభావం వంటి వాటిని పరిశీలించి రాజకీయ క్లియరెన్స్ ఇస్తుంది. ఈ అనుమతి లేకుండా అధికారిక విదేశీ పర్యటనలకు వెళ్లడం కుదరదు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పర్యటన కోసం కోర్టు నుంచి కూడా అనుమతి పొందారు, కానీ కేంద్రం నుంచి రాజకీయ క్లియరెన్స్ రాకపోవడంతో ఈ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.