
Free Fire : మాయగాళ్లు, అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాలు సరికొత్త పంథాలో అమాయక ఆడపిల్లలను ఉచ్చులోకి లాగుతున్నాయి. ముఖ్యంగా ‘ఫ్రీ ఫైర్’ (Free Fire) వంటి ఆన్‌లైన్ గేమ్‌లను, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని బాలికలకు వల విసురుతున్నాయి. ఈ ఆటల్లో పరస్పరం మాట్లాడుకునే వెసులుబాటును ఆసరాగా చేసుకుని, మైనర్లతో పరిచయాలు పెంచుకుంటూ వారిని ఇల్లు వదిలి వచ్చేలా మానసికంగా సిద్ధం చేస్తున్న వైనం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాలికలు ఈ గేమ్ ద్వారా అపరిచితుల మాయమాటలకు ఆకర్షితులయ్యారు. ఇంట్లో తల్లి తిట్టగానే సదరు ముఠా ప్రేరేపణతో కోల్‌కతా వెళ్లేందుకు రైలెక్కారు. అయితే, సమయానికి పోలీసులు స్పందించి కాపాడటంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. మరో కేసులో తెలంగాణకు చెందిన ఒక బాలికను ఓ గుర్తుతెలియని మహిళ వారం రోజుల పాటు తన వెంట తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇంటికి చేరిన ఆ పాప.. భయంతోనో, మరేదైనా కారణంతోనో పొంతన లేని సమాధానాలు చెప్పడం కన్నవారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ రెండు కేసుల్లోనూ బాధితులకు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే అలవాటు ఉండటం గమనార్హం.
Also Read : ఖమ్మంలో రైతు అశీర్వాద సభ రద్దు…రేపు సాయంత్రం రైతు భరోసా నిధుల పంపిణీ
మాయగాళ్ల వ్యూహాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. మొదట ఆటల్లో ఉత్సాహంగా ఉండే అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని, వారి కుటుంబ, ఆర్థిక పరిస్థితులను తెలుసుకుంటారు. గేమ్స్‌లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ఆయుధాలు, కాయిన్స్ కొనేందుకు ఆర్థిక సహాయం చేస్తూ నమ్మకం కుదుర్చుకుంటారు. ఆపై ఫోన్ నంబర్లు తీసుకుని నకిలీ ఫొటోలు, వివరాలతో ప్రేమ, జాలి పేరిట పూర్తిగా లోబరచుకుంటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసిన ‘రిచ్ కిడ్స్ ట్రాప్’ కేసు ఇందుకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు స్నేహం పేరిట దగ్గరై, ఆపై బ్లాక్‌మెయిల్ చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేశారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.
మరో ఘటనలో సికింద్రాబాద్‌కు చెందిన 15 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువకుడు పరిచయమై, తాను ఆపదలో ఉన్నానంటూ నమ్మించి బీరువాలో ఉన్న రూ. లక్ష దొంగిలించి ఇచ్చేలా చేశాడు. అంతటితో ఆగక ఏకాంతంగా ఉన్న ఫోటోలను అడ్డుపెట్టుకుని, ఇంట్లోని నగలను కూడా కొల్లగొట్టాడు. చివరకు తన స్నేహితుడితో కూడా గడపాలని ఒత్తిడి చేయడంతో సదరు బాలిక తల్లిదండ్రులకు నిజం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులు, పిల్లలకు నిపుణుల సూచనలు
ఆన్‌లైన్ గేమింగ్ ముఠాల బారిన పడకుండా ఉండేందుకు హైదరాబాద్ నగర మహిళా భద్రత విభాగం డీసీపీ డా.లావణ్యనాయక్ జాదవ్ పలు కీలక సూచనలు చేశారు:
పరిమిత వినియోగం: పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా యాప్‌లను చాలా పరిమితంగా మాత్రమే వాడేలా చూడాలి. రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వాడటానికి అనుమతించకూడదు.
పర్యవేక్షణ,సెట్టింగ్స్: యాప్‌లలో ‘పేరెంటల్ కంట్రోల్స్’, ప్రైవసీ సెట్టింగ్‌లను తప్పనిసరిగా ఆన్ చేయాలి. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలి.
వ్యక్తిగత వివరాల గోప్యత: ఇంటర్నెట్‌లో పరిచయమైన అపరిచితులతో సొంత వివరాలు, కుటుంబ విషయాలు, ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
ప్రవర్తనలో మార్పులు: పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు వస్తే (కంగారుపడటం, రహస్యంగా దాక్కోవడం) గమనించాలి. సైబర్ ప్రమాదాలపై వారికి చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలి.
పోలీసులకు సమాచారం: ఏదైనా అనుమానాస్పద సందేశాలు, బెదిరింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలి.
ఆన్‌లైన్ ప్రపంచంలో పొంచి ఉన్న ఇలాంటి ముఠాల పట్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండటం నేటి కాలంలో అత్యంత అవసరం.
Also Read : సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబావుటా..బట్టబయలైన అంతర్గత అసంతృప్తి









