
Khairatabad Bada Ganesh Immersion : భాగ్యనగరంలో ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర ఎట్టకేలకు ఘనంగా ప్రారంభమైంది. భక్తుల కోలాహలం, జైబోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో బడా గణేష్ చుట్టూ భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. బడా గణేషుడిని ట్యాంక్‌బండ్ తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన భారీ టస్కర్ వాహనంపైకి సురక్షితంగా చేర్చారు. విగ్రహం ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వాహనం చుట్టూ వెల్డింగ్ పనులను పూర్తి చేశారు.
నిజానికి ఈ శోభాయాత్ర శుక్రవారం ఉదయం 6 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. వెల్డింగ్ పనులు, వాహన తనిఖీలు పూర్తయిన వెంటనే శోభాయాత్రను వేగవంతం చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికల్లా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ!
ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో కొలువుదీరిన ఈ మహాగణపతి నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వద్ద అధికారులు అత్యాధునిక భారీ క్రేన్లను సిద్ధం చేశారు. ఇందులో క్రేన్ నంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శోభాయాత్ర ప్రారంభమైన సమయంలో భక్తుల ఉత్సాహం అంబరాన్ని తాకింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ సుదీర్ఘ శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేందుకు రాజధాని పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో కలిపి నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అసాధారణ స్థాయిలో దాదాపు 45 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లక్షలాది మంది భక్తుల రద్దీ నెలకొనే హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులను విధుల్లో ఉంచారు. ఆకాశం నుంచి డ్రోన్ల ద్వారా, నేలపై సీసీ కెమెరాలు, పోలీసు బలగాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read : గణపయ్య నిమజ్జనానికి హైటెక్ సెక్యూరిటీ.. 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు!









