KTR : గ్లోబరీనా టెక్నాలజీస్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు (పరువు నష్టం నోటీసులు) జారీ చేశారు.ఈ అంశంపై మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన నిరాధార ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. “గ్లోబరీనాతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు కానీ, యాజమాన్య హక్కులు కానీ లేవు. అది నా బినామీ కంపెనీ అనడం, సీబీఎస్‌ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా పచ్చి అబద్ధం” అని కేటీఆర్ స్పష్టం చేశారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, గడువులోగా క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు.గ్లోబరీనా వ్యవహారంలో తాను లై డిటెక్టర్ (Lie Detector) పరీక్షతో పాటు సీఐడీ (CID) విచారణకు సైతం సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.మరి సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ అవినీతి ఆరోపణల అంశంలో సిట్ (SIT) లేదా సీఐడీ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు.గ్లోబరీనా సంస్థ నిజంగానే తన బినామీ సంస్థ అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు ఎందుకు చేసుకుందో సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.”మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని ఆరోపించడం ఎంతవరకు సమంజసం?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి పగటిపూట కాంగ్రెస్‌తో, రాత్రిపూట బీజేపీతో ఉంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఒక మూట పంపితే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సీఎం, ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించడానికి భయపడుతున్నారన్నారు. పాత కేసుల భయం, అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే కేంద్రంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్‌భవన్ (లేదా లోక్‌భవన్) ముందు నిరసన తెలపాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం కేవలం రాజకీయ నాటకం మాత్రమేనని తేల్చి చెప్పారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.