
Telangana : తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందించే పాలిటెక్నిక్ కోర్సులను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జి ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ పరిధిలోకి తేవడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు నష్టం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం బిగ్ షాక్.. యూఎస్ టూర్‌కు నో పర్మిషన్.. ఎందుకంటే?
మూడేళ్ల డిప్లొమా కోర్సు అనంతరం నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్ లో ఏంట్రీ పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నప్పటికీ, ఈ మార్పుల వల్ల సాంకేతిక అంశాలు తగ్గిపోయి ఉన్నత విద్యకు, అలాగే ప్రభుత్వ రంగంలోని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అతి తక్కువ ఫీజులతో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే స్కిల్ యూనివర్సిటీ విధానం అమల్లోకి వస్తే ఫీజులు భారీగా పెరిగి, విద్య సాధారణ ప్రజలకు అందకుండా ప్రైవేట్ బందీ అయ్యే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎలక్ట్రిసిటీ బోర్డులు, రైల్వేలు, డీఆర్‌డీవో, ఇస్రో వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో లభించే సబ్ ఇంజనీర్ లేదా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు డిప్లొమా అర్హత కోల్పోతే కేవలం ప్రైవేట్ రంగంపైనే ఆధారపడాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, విద్యార్థులకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ అందించేందుకే ఈ జీవో తెచ్చామని, బీటెక్‌లో లాటరల్ ఎంట్రీ సౌకర్యం యథాతథంగా కొనసాగుతుందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.
Also Read : 22Aపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి సంచలన ఆదేశాలు!









