
Rythu Bharosa : తెలంగాణలోని అన్నదాతలకు జూన్ నెలలో ఒకేసారి రెండు భారీ ఆర్థిక ప్రయోజనాలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘రైతు భరోసా’ నిధులతో పాటు, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్’ సాయం కూడా కేవలం పది రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమ కానుండటంతో వ్యవసాయ రంగానికి పెద్ద ఊతం లభించినట్లయింది. వానాకాలం సాగు సీజన్ ప్రారంభ వేళ ఈ నిధులు విడుదలవుతుండటం గమనార్హం.
జూన్ 30న మధిర వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదల
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా మూడో విడత నిధుల పంపిణీకి ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయం ప్రకారం జూన్ 30వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిరలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం వరుసగా తొమ్మిది రోజుల పాటు ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందించింది.
ఈ పథకం కింద ప్రతి ఎకరానికి ఏడాదికి రూ. 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుండగా, దాన్ని ఖరీఫ్, రబీ సీజన్లకు విడగొట్టి ప్రతి విడతకు ఎకరాకు రూ. 6,000 చొప్పున అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 కోట్ల ఎకరాలకు ఈ సాయం వర్తించనుంది. ఇప్పటికే ముగిసిన రెండు విడతల్లో.. తొలి విడత కింద ఎకరం లోపు ఉన్న వారికి, రెండో విడతలో 45.11 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 5,653 కోట్ల మేర నిధులు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 73 లక్షల మంది రైతులకు విడతల వారీగా ఈ లబ్ధి చేకూరనుంది.
జూన్ 20న పీఎం కిసాన్ 23వ విడత నగదు జమ
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత నిధులను జూన్ 20న విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడత ద్వారా అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ. 2,000 చొప్పున నగదు జమ కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయం ఒకేసారి అందుతుండటంతో రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం వానాకాలం సాగు ఏర్పాట్లు, ధాన్యం నిల్వలపై సమగ్ర సమీక్ష నిర్వహించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉన్న ఏడు మేలుజాతి సన్న రకాల వరి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించవచ్చని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇదే సమయంలో, ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్‌సీఐ (FCI) కొనుగోళ్లు తగ్గించడం, బాయిల్డ్ రైస్ తీసుకోకపోవడం వంటి చర్యలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన కంపెనీలు, శాస్త్రవేత్తలతో సమావేశమై వానాకాలం సీజన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎగుమతులకు అనుకూలమైన ఏడు సన్న రకాల వరి పంటలకు ప్రభుత్వం తరపున ప్రత్యేక బోనస్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని అధికారులను, డీలర్లను ఆదేశించారు.









