Rajagopal Reddy :తనపై.తన సోదరుడు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన తీవ్ర ఆరోపణలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా ఖండించారు. సామేలు వ్యాఖ్యలు “వినాశకాలే విపరీత బుద్ధి”కి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశానని గుర్తు చేస్తూ.. సామేలు ఒక్కడే ఉద్యమకారుడు కాదని స్పష్టం చేశారు.

సామేలు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రాజగోపాల్ రెడ్డి.. ఒక తప్పుడు వ్యక్తికి తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ వచ్చేలా చేసి పెద్ద తప్పు చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. “తనను నమ్మి సామేలుకు ఓటు వేసి గెలిపించిన తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, ప్రజలకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను” అని ఆవేదనతో ప్రకటించారు.

గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. “తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ కోసం మందుల సామేలు నా ఇంటికి వందసార్లు వచ్చాడు. ఆ నియోజకవర్గంలో ఎంతోమంది సీనియర్లు పోటీపడినా, సామేలుకు మాట ఇచ్చానని అధిష్ఠానంతో మాట్లాడి టికెట్ తెప్పించాను” అని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తన సొంత మునుగోడు టికెట్‌తో పాటు తుంగతుర్తి, బాన్సువాడ (ఏనుగు రవీందర్) స్థానాలను అధిష్ఠానాన్ని ఒప్పించి ఇప్పించుకున్నానని గుర్తు చేశారు.

ఎంపీగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు తమ నాయకత్వమే కాంగ్రెస్‌ను నిలబెట్టిందన్నారు. తాను కొద్దిరోజులు వేరే పార్టీలోకి వెళ్లినప్పటికీ, గతంలో కాంగ్రెస్ కోసం చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ అధిష్ఠానమే తనను సగౌరవంగా తిరిగి ఆహ్వానించిందని స్పష్టం చేశారు.

పార్టీలోని ఒరిజినల్, పాత కార్యకర్తల రక్షణే తమ ప్రాధాన్యమని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. “మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరగకూడదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి అహంకారం వల్ల పాత కార్యకర్తలు ఇబ్బంది పడితే సహించేది లేదు. అసలైన కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం” అని స్పష్టం చేశారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌లతో పాటు తమపై ఉందన్నారు.

తనపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, శాంతిభద్రతల దృష్ట్యా పార్టీ శ్రేణులు ఉద్రేకపడవద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు. సామేలుకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహించవద్దని, నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని కార్యకర్తలకు సూచించారు. “ఇలాంటి ఆయారాం, గయారాం రాజకీయ నాయకులకు నేను భయపడే ప్రసక్తే లేదు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకాలు, నియోజకవర్గ పర్యటనల ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే మందుల సామేలు, కోమటిరెడ్డి వర్గీయుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. సామేలు విమర్శలు చేయడం, దానికి ప్రతిగా రాజగోపాల్ రెడ్డి ‘క్షమాపణలు’ చెబుతూ ఘాటు కౌంటర్ ఇవ్వడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇరువర్గాల మధ్య మాటల యుద్దం ముదిరి పాకాన పడటంతో ఈ వివాదం రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం పేరుతో సామేలు ప్రశ్నిస్తుంటే, మరోవైపు పాత కార్యకర్తల రక్షణ, అన్యాయం పేరుతో కోమటిరెడ్డి సోదరులు ఎదురుదాడి చేస్తున్నారు. పీసీసీ సమన్వయ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ అంతర్గత విభేదాలు ఎటు దారితీస్తాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.