
SIR Voter List Revision Rules :రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇప్పటికే ఇంటింటికీ తిరిగి దాదాపు 60 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అయితే, కేవలం ఫారం అందుకోవడం మాత్రమే సరిపోదు; ఈ ప్రక్రియలో అసలైన కీలక అంకం ఇప్పుడే మొదలైంది. మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే, బీఎల్‌వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి, తక్షణమే తిరిగి అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోని వారు ఉంటే, వెంటనే వాటిని పొంది పూర్తి చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న ఈ ‘సర్’ ప్రక్రియలో మీ ఓటు భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ క్రింది వివరాల ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం.
2002 ఓటరు జాబితా పరిశీలన – ప్రాధాన్యత
ఈ సవరణ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు 2002 నాటి ఓటరు జాబితాను తనిఖీ చేసుకోవడం. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన voters.eci.gov.in లేదా ceotelangana.nic.in వెబ్‌సైట్లలోకి వెళ్లి ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్‌ఐఆర్’ లేదా ‘సెర్చ్ బై ఎలక్టర్స్ డీటెయిల్స్’ అనే ఆప్షన్ ద్వారా మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవచ్చు. ఈ సమాచారం పోలింగ్ బూత్‌ల వారీగా పీడీఎఫ్ రూపంలోనూ, బీఎల్‌వోల వద్ద కూడా అందుబాటులో ఉంటుంది. 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే, మీరు బీఎల్‌వోకు ఎలాంటి అదనపు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారంలోని “గత ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు’’ అనే కాలమ్‌లో ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబరు (అందుబాటులో ఉంటే), తండ్రి లేదా తల్లి పేరు, జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం,బూత్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు పూర్తి చేస్తే సరిపోతుంది.
2002 జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి?
ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి 2002 ఓటరు జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు. ఇలాంటి వారు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి తమ తల్లిదండ్రులు లేదా నాయనమ్మ, తాతయ్యలు 2002లో ఎక్కడ ఓటు కలిగి ఉన్నారనే వివరాలను నిర్ధారించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్యూమరేషన్ ఫారంలోని రెండో కాలమ్‌లో బంధువుల వివరాలు, వారి ఓటరు కార్డు నెంబరు, నియోజకవర్గం, బూత్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ ఈ వివరాలు లేని ఓటర్లు, తమ పుట్టిన తేదీ లేదా పుట్టిన ప్రాంతాన్ని ధ్రువీకరించడానికి ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల అధికారిక పత్రాలలో ఏదో ఒకదానిని ఆధారంగా సమర్పించవచ్చు.
ధ్రువీకరణకు ఉపయోగపడే ముఖ్యమైన పత్రాలు: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగి లేదా పెన్షన్ గుర్తింపు కార్డు, బ్యాంకులు/పోస్టాఫీసులు/ఎల్‌ఐసీ జారీ చేసిన పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హత కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలు (OBC, SC, ST), ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన భూమి/గృహ కేటాయింపు సర్టిఫికెట్లు. అయితే, ఈ ప్రత్యామ్నాయ పత్రాలను స్వీకరించాలా లేదా తిరస్కరించాలా అనే తుది నిర్ణయాధికారం పూర్తిగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకే (ఈఆర్వో) ఉంటుంది.
బీఎల్‌ఓ మీ వద్దకు రాకపోతే లేదా ఆన్‌లైన్‌లో సమర్పించాలంటే..
ఈ మొత్తం ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌వో) పాత్ర అత్యంత కీలకం. ఒకవేళ ఇప్పటివరకు బీఎల్‌వో మీ ఇంటికి రాకపోతే, voters.eci.gov.in వెబ్‌సైట్ లేదా ‘ఈసీఐనెట్’ యాప్‌లోని ‘నో యువర్ బీఎల్‌వో’ ఆప్షన్ ద్వారా మీ బీఎల్‌వో పేరు, ఫోన్ నెంబర్ తెలుసుకుని తక్షణమే సంప్రదించవచ్చు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు, 2024 ఎన్నికల తర్వాత ఇల్లు మారిన వారు తప్పనిసరిగా బీఎల్‌వోను సంప్రదించాలి.
మరోవైపు, వేరే ప్రాంతాల్లో ఉండే వారు ఆన్‌లైన్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించే వెసులుబాటు ఉంది. ‘ఈసీఐనెట్’ యాప్‌లో ‘ఈ–సైన్’ ద్వారా డిజిటల్‌గా ఫారాన్ని సబ్మిట్ చేయవచ్చు. అయితే, దీనికోసం మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డుతో లింక్ అయి ఉండాలి. అలాగే ఓటర్ కార్డుపై ఉన్న పేరు స్పెల్లింగ్, ఆధార్ కార్డులోని స్పెల్లింగ్‌తో కచ్చితంగా సరిపోవాలి. ఏదైనా తేడా ఉంటే డిజిటల్ సైన్ విఫలమవుతుంది, అప్పుడు ఫిజికల్‌గా మాత్రమే ఫారం సమర్పించాల్సి ఉంటుంది.
ఫారాల సమర్పణలో జాగ్రత్తలు నోటీసుల జారీ
ప్రతీ బీఎల్‌వో మీ ఫొటో వివరాలు ముద్రించిన రెండు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. అందులో ఒక ఫారం పూర్తి చేసి, తాజా ఫొటో అంటించి, సంతకం చేసి బీఎల్‌వోకు ఇవ్వాలి, రెండోది మీ వద్దే ఉంచుకోవాలి. మీ తరఫున వేరే వారు ఫారం అందజేస్తే సదరు ఓటరుతో మీకు గల బంధుత్వాన్ని పేర్కొనాలి. ఫారంలో ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ (ఐచ్ఛికం), మొబైల్ నెంబర్, తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి పేరు, వారి ఓటర్ కార్డు వివరాలను స్పష్టంగా పూరించాలి. ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడం లేదని డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత, 2002 జాబితాతో మ్యాపింగ్‌లో తేడాలు ఉన్న వారికి లేదా బంధువుల పేర్లు లేని వారికి ఈఆర్వోలు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందుకున్న వారు నిర్దేశిత తేదీన విచారణకు హాజరై వయసు ప్రాతిపదికన ఆధారాలు చూపాలి. 1987 జూలై 1 కంటే ముందు పుట్టిన వారు తమ స్వంత వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. కానీ 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన వారు తమతో పాటు తల్లి లేదా తండ్రి ధ్రువీకరణ పత్రాలను, 2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన వారు తమతో పాటు తల్లిదండ్రులు ఇద్దరి పుట్టిన తేదీ/ప్రాంత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ముసాయిదా జాబితా పరిశీలన – కీలక గడువులు
ఇంటింటి సర్వే ముగిసిన అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా బీఎల్‌వోల వద్ద లేదా ceoandhra.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ముసాయిదా జాబితాలో మీ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ విధిగా సరిచూసుకోవడం అత్యంత కీలకం. ఒకవేళ పేరు లేకపోతే ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను తెలపవచ్చు. ఇందుకోసం మూడు రకాల ఫారాలు అందుబాటులో ఉన్నాయి:
ఫారం 6: జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి.
ఫారం 7: చనిపోయిన లేదా వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించడానికి.
ఫారం 8: జాబితాలో పేరు లేకున్నా, వేరే చోటుకి ఓటు బదలాయించాలన్నా లేదా తప్పులను సవరించాలన్నా.
ఈ అభ్యంతరాలన్నింటినీ సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
అజాగ్రత్తగా ఉంటే ఓటు హక్కు గల్లంతే!
ప్రస్తుతం రాష్ట్రంలో 4.16 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో నకిలీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయనే ప్రచారంతో వాటిని తొలగించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో నిజమైన ఓటర్లు అజాగ్రత్తగా ఉంటే వారి ఓట్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంది. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని వారు, అలాగే 2002 ఓటర్ల జాబితాలో పేరు లేక నిర్దేశిత ధ్రువీకరణ పత్రాలు అందజేయని వారు తమ ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి, ఎన్యూమరేషన్ ఫారం అందుకున్నప్పటి నుంచి సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురించే వరకు ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండి, తమ ప్రజాస్వామ్య హక్కును కాపాడుకోవాలి.









