
Telangana TET Exam : తెలంగాణ లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా టెట్ 2026 నోటిఫికేషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ప్రస్తుతం బడులలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్ పొందాలన్నా ఈ టెట్ పాస్ కావడం తప్పనిసరి. అందుకే ప్రభుత్వం సాధారణంగా జరిగే పరీక్షలతో పాటు, ఇప్పుడు ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్లు నిర్వహించనుంది.
ప్రభుత్వ, లోకల్ బాడీ, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్ ఇతర ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ పరీక్షలో వచ్చిన అర్హత కేవలం ఉపాధ్యాయులకే వర్తిస్తుంది తప్ప, కొత్త ఉద్యోగాల నియామకాలకు ఇది పనికిరాదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఈ పరీక్ష కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో రెండు పేపర్లుగా జరుగుతుంది. 1 నుంచి 5 తరగతులు చెప్పే ఎస్‌జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు పేపర్-1 రాయాలి. అలాగే 6 నుంచి 8 తరగతులు చెప్పే స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు, లాంగ్వేజ్ పండిట్లు, హైస్కూల్ హెచ్‌ఎంలు పేపర్-2 రాయాలి. ప్రతి పేపర్‌కు 150 మార్కులకు గాను 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
Also Read : రక్తమోడిన రహదార్లు..నలుగురు మృతి
జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950 ఫీజుగా నిర్ణయించారు. పరీక్షలో పాస్ కావడానికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60% మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు 40% మార్కులు రావాలి.
అర్హత ఉన్న ఉపాధ్యాయులు 2026 జులై 22 నుంచి జులై 29 వరకు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారు ఆగస్టు 31 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 వరకు రోజుకు రెండు విడతల్లో (ఉదయం 9:00 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 నుండి 4:30 వరకు) పరీక్షలు జరుగుతాయి. ఫలితాలు సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య వస్తాయి. దరఖాస్తు చేసేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే సహాయం కోసం 7093958881, 7093468882, 7032901383 నంబర్లను సంప్రదించవచ్చు.
Also Read : భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణం..ట్రాఫిక్ ఆంక్షలు ఇలా…









