స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌ స్టోర్లపై టీజీ సేఫ్‌ దాడులు…బయటపడ్డ సంచలన లోపాలు

ఆధునిక కాలంలో ప్రజలంతా ఆన్‌లైన్‌ ఆర్డర్‌లకు అలవాటు పడ్డారు. దీంతో అనేక ఈ కామర్స్‌ సంస్థలు పుట్టుకొచ్చాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే కావాలసిన పదార్థాలను ఇంటికి చేరుస్తామని ప్రకటిస్తున్నాయి. అందుకు తగినట్లే ఆయా ప్రాంతాల్లోనే స్టోర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు అతి తక్కువ సమయంలోనే కావాలసిన వస్తువులను చేరుస్తున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ, ఆ స్టోర్స్‌ నిర్వాహణ ఎలా ఉంది అనేది వినియోగదారులకు ఏ మాత్రం తెలియదు. ఈ విషయాన్ని తేల్చేందుకే తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ రోజు విస్తృత తనిఖీలు చేపట్టింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన స్విగ్గీ మార్ట్‌, జెప్టో, ఫ్లిప్‌ కార్ట్‌లకు చెందిన డార్క్‌ స్టోర్లలో తనిఖీలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ఆయా సంస్థలు నిర్వహిస్తున్న స్టోర్లలో తనిఖీలు చేపట్టింది.

టీజీ సేఫ్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 10 ప్రత్యేక బృందాలు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ (ఇన్‌స్టాకార్ట్), జెప్టో, డ్రాప్‌ఎక్స్ లాజిస్టిక్స్‌తదితర సంస్థలకు చెందిన మొత్తం 16 డార్క్ స్టోర్లలో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించడం గమనార్హం. కాగా ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గడువు ముగిసిన, పాడైపోయిన నిల్వలు, బూజు పట్టిన కూరగాయలు, బొద్దింకలతో కూడిన పరిసరాలు, తుప్పుపట్టిన ర్యాక్‌లు, కోల్డ్ రూమ్‌లలో సక్రమంగా లేని ఉష్ణోగ్రతలు వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆయా స్టోర్లలో కల్తీ అనుమానంతో అధికారులు 15 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌‌కు పంపించడం గమనార్హం. అంతేకాక తీవ్ర లోపాలు బయటపడిన నాలుగు డార్క్ స్టోర్ల ఎఫ్‌‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను వెంటనే సస్పెండ్ చేసి వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. అధికారులు చేపట్టిన తనిఖీల్లో పేట్ బషీరాబాద్, సైదాబాద్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్టోర్లు, రామ్‌కోటిలోని జెప్టో, చార్మినార్ పత్తర్‌గట్టిలోని ఫ్లిప్‌కార్ట్ స్టోర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే నిజాంపేట్, గాజులరామారం, షాలిబండలోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, మూసారాంబాగ్‌, గోల్కొండ రేతిగల్లీలోని ఫ్లిప్‌కార్ట్‌లకు చెందిన 5 స్టోర్లకు నిర్వహణ లోపాలను చూసి షోకాజ్ నోటీసులు జారీ చేసి పెనాల్టీల విధించినట్లు తెలిపారు. మరోవైపు చింతల్, గాజులరామారంలోని ఫ్లిప్‌కార్ట్, చింతల్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్టోర్లలో ఉన్న లోపాలను ఎత్తిచూపి సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా… గతంలోనూ డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ దాడులు చేసింది. అయినా కూడా వారిలో ఏమాత్రం మార్పు రాకపోవడం వినియోగదారుల, ప్రజల ఆరోగ్యంపై ఆయా సంస్థలకు ఉన్న బాధ్యతను గుర్తు చేస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.