
Spain : స్పెయిన్ లోని మాడ్రిడ్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 64 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత మాడ్రిడ్ నుంచి సియుడాడ్ రియల్, అండలూసియా వైపు వెళ్లే రైలు సేవలను నిలిపివేశారు. టోలెడో ప్రావిన్స్‌లో ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మాడ్రిడ్-అండలూసియా హైస్పీడ్ రైలు మార్గంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఒక రైలు మరో రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమై ఉండొచ్చని సమాచారం. ప్రధాన సిగ్నల్ సమస్యను సరిచేస్తున్న ఓ సిబ్బంది.. ఎదురుగా వస్తున్న ఐరియో రైలు గురించి ఏవీఈ హైస్పీడ్ రైలుకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
మాడ్రిడ్-అండలూసియా హైస్పీడ్ రైలు మార్గంలో రెండు రైళ్లు ఢీకొన్న నేపథ్యంలో రైలు రాకపోకలను నిలిపివేసినట్లు ఏడీఐఎఫ్ ఎక్స్‌లో తెలిపింది. దక్షిణ దిశగా వెళ్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని రెన్ఫే ఏవీఈ రైలు.. అక్కడ నిలిచివున్న ఐరియో రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కొన్ని బోగీలు పక్కనున్న వాలు ప్రాంతంలోకి దొర్లిపోయాయి. కాస్టిల్లా-లా మంచా ప్రాంత అధికార ప్రతినిధి ఎస్తేర్ పడిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. రెన్ఫే రైలులో 397 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐరియో రైలులో 147 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐరియో సంస్థ భద్రతా చర్యలు ప్రారంభించి, అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది.
స్పెయిన్ ప్రధాని దిగ్భ్రాంతి
ఈ ఘటనపై స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశ హైస్పీడ్ రైలు మార్గంలో జరిగిన రెండో భారీ ప్రమాదం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ‘‘టోలెడోలో జరిగిన తీవ్ర రైలు ప్రమాదంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. రవాణా మంత్రి, కాస్టిల్లా-లా మంచా అధ్యక్షుడితో నిరంతరం మాట్లాడుతున్నాను. ప్రమాదంలో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు అత్యవసర సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. బాధితులు, వారి కుటుంబాలకు నా మద్దతు, సానుభూతి’’ అని సాంచెజ్ ఎక్స్‌లో తెలిపారు.
ఈ ఏడాది జనవరిలోనూ స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అడముజ్‌లో రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టడంతో 45 మంది చనిపోయారు. తాజాగా జరిగిన ప్రమాదంతో ఈ ఏడాది స్పెయిన్ హైస్పీడ్ రైలు వ్యవస్థలో ఇది రెండో పెద్ద ప్రమాదంగా నిలిచింది. 2013లో జరిగిన రైలు ప్రమాదంలో 80 మంది చనిపోయారు. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగిన అత్యంత ప్రాణాంతక రైలు ప్రమాదాల్లో తాజా ఘటన కూడా ఒకటిగా నిలిచింది. వరుస ప్రమాదాలతో దేశంలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.









