
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల పాకిస్థాన్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆ భూభాగంపైకి వెళ్లి మరి భారీ వైమానిక దాడి చేపట్టింది. అర్ధరాత్రి వేళ ఆఫ్ఘన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు పాకిస్థాన్ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించి బాంబుల వర్షం కురిపించాయి. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టాయి. బలూచిస్తాన్‌లోని పిషిన్ జిల్లా ‘సర్నాన్’ ప్రాంతంలో ఉన్న ఐసిస్ (ISIS) ఉమ్మడి కేంద్రాన్ని ఈ దాడిలో పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో పాటు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని చిత్రాల్ ప్రాంతంలో గల ‘షా సలీం’ లోయ, ‘కంబర్ ఖేల్’ లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా ఆఫ్ఘన్ వాయుసేన విరుచుకుపడింది. ఈ దాడులు అత్యంత ఖచ్చితత్వంతో జరిగాయని.. దీనివల్ల ఉగ్రవాద సంస్థలకు భారీ ప్రాణనష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే ఎక్కడా పౌరులు మరణించలేదని ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వైమానిక దాడికి దారితీసిన పరిస్థితులను గమనిస్తే.. పాకిస్థాన్ చర్యకు ప్రతీకారమేనని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ సైన్యం ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఒక భారీ భూతల ఆపరేషన్, ఆ తర్వాత వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కనీసం 35 మంది ఆఫ్ఘన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్లుగానే అర్ధరాత్రి వేళ పాక్‌పై విరుచుకుపడింది. తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఈ ఇరు దేశాల యుద్ధ వాతావరణంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రష్యా దీనిపై ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తమ మధ్య ఉన్న సైనిక ఘర్షణలను తక్షణమే నిలిపివేయాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఇరు దేశాల పోరాటం వల్ల అమాయక పౌరులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రెండు దేశాలు ఆయుధాలను పక్కన పెట్టి, దౌత్య పరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని రష్యా సలహా ఇచ్చింది.







