అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడంతో రోజురోజుకు ఘర్షణ పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. రాబోయే రోజుల్లో ఆ దేశంపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇరాన్ దేశంలోని ప్రముఖ ‘నతాంజ్’ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న ‘పికాక్స్ పర్వతం’ లక్ష్యంగా త్వరలోనే భారీ స్థాయిలో భీకర దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ పర్వతం కింద ఉన్న రహస్య భూగర్భ స్థావరాల్లో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాలను ముమ్మరంగా పునరుద్ధరిస్తోందని ఆరోపించారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం దాదాపు 1,000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని.. దానికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు.

ఈ యురేనియంను ఉపయోగించి ఇరాన్ మళ్లీ ప్రమాదకరమైన అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. అందుకోసమే ఆ పికాక్స్ పర్వతం కింద ఉన్న భూగర్భ అణు కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఇప్పటివరకు జరిపిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమే.. త్వరలోనే అసలు సినిమా చూపిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

త్వరలోనే అక్కడ అమెరికా బలగాలతో ప్రత్యక్ష సైనిక చర్య చేపట్టి, ఇరాన్ అణు రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆ దేశం వద్ద ఉన్న యురేనియం నిల్వల మొత్తాన్ని అమెరికా సైన్యం తన స్వాధీనం చేసుకుంటుందన్నారు.