Indus Waters Treaty : ఆరు దశాబ్దాలకు పైగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) ప్రస్తుత రూపంలోనే మళ్లీ అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం తేల్చిచెప్పంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పడమే కాకుండా, ఈ జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భవిష్యత్తులో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వస్తే కచ్చితంగా సమూల మార్పులు చేయాల్సిందేనని, అందుకోసం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా విడనాడాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి ఈ ఒప్పందం నుంచి భారత్ పూర్తిగా వైదొలగాలని భావించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రపంచంలో ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మారినప్పుడు, ఒక సార్వభౌమ దేశంగా దానిని ఏకపక్షంగా రద్దు చేసుకునే హక్కు భారత్‌కు ఉంటుందని హెచ్చరించాయి. ఇకపై ఈ జలాల పంపిణీకి సంబంధించిన భవిష్యత్తు, కొత్త వ్యవస్థ ఏర్పాటు అనేది పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదంపై తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాయి.

ఒప్పందం నిలిపివేత కారణంగా తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను భారత్ ఖండించింది. ఇస్లామాబాద్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే న్యూఢిల్లీపై నిందలు వేస్తోందని మండిపడింది. సరిపడా ఆనకట్టలు, నీటి నిల్వ సామర్థ్యాలు లేకపోవడం, తీవ్రమైన నీటి లీకేజీలు ,ఆ దేశంలోని ప్రావిన్సుల (రాష్ట్రాల) మధ్య ఉన్న జల వివాదాలే పాకిస్థాన్ నీటి సంక్షోభానికి అసలు కారణమని భారత్ ఎండగట్టింది.

Also Read : అమెరికా-ఇరాన్ వార్.. పశ్చిమాసియాలో భగ్గుమంటున్న యుద్ధజ్వాలలు

సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి పాకిస్థాన్ ఎలాంటి విశ్వసనీయ చర్యలు తీసుకోలేదని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి (UN) నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులు,ఉగ్ర సంస్థలు ఇప్పటికీ పాక్‌లో బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఇప్పటికీ ఉగ్రవాదుల కదలికలు కొనసాగుతున్నట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయని, ఉగ్రవాదం-చర్చలు/ఒప్పందాలు ఒకేసారి సాగవని పునరుద్ఘాటించాయి.

పశ్చిమ నదులైన జీలం, చినాబ్‌లపై జమ్మూకశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగా, రాట్లే, బగ్లిహార్‌, సలాల్‌, పాకల్‌దుల్‌ వంటి జలవిద్యుత్‌ ప్రాజెక్టులపై పాకిస్థాన్ అనవసరపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఒప్పందంలోని వివాద పరిష్కార నిబంధనలను దుర్వినియోగం చేస్తూ, అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరుతూ ఈ అభివృద్ధి ప్రాజెక్టులను ఆలస్యం చేయడానికి పాక్ నిరంతరం కుట్రలు చేస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ నదుల నీటిపై పాకిస్థాన్‌కు ఎక్కువ హక్కులు లభించాయి. అయితే, 1960 నాటి భూగోళిక, వాతావరణ, జనాభా పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి, తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పెరిగిన ఇంధన అవసరాలకు అనుగుణంగా ఒప్పంద నిబంధనల సమీక్ష అత్యవసరమని భారత్ భావిస్తోంది.

సింధూ నదీ పరివాహక ప్రాంతం పాకిస్థాన్ వ్యవసాయ రంగానికి, దాదాపు 80% తాగునీటి అవసరాలకు వెన్నెముక వంటిది. భారత్ ఒకవేళ ఈ జలాల మళ్లింపును ముమ్మరం చేస్తే లేదా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ.ఆహార భద్రత తీవ్ర ప్రమాదంలో పడతాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు భారత్ జరిపిన ఈ రాజతంత్ర హెచ్చరిక తీవ్ర కలకలాన్ని రేపింది.

సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ వేదికలపై శాంతి వచనాలు పలకడం ఇక చెల్లదని భారత్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. సింధూ జలాల ఒప్పందాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలా లేక పూర్తిగా రద్దు చేసుకునే దిశగా అడుగులు వేయాలా అనేది పూర్తిగా ఇస్లామాబాద్ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. తమ జాతీయ ప్రయోజనాలు, పౌరుల భద్రత విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని న్యూఢిల్లీ ఈ నిర్ణయంతో స్పష్టం చేసింది.

Also Read : RED SEA మూసేస్తే ఏమవుతుంది?

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.