Britain Hospitals : బ్రిటన్‌లో సాధారణంగా ఉండే ఆహ్లాదకర వాతావరణానికి భిన్నంగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోత అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణ పౌరులతో పాటు కార్యాలయాల్లో ఏసీల కింద పనిచేసే ఉద్యోగులు కూడా ఈ వేడి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా యూకే జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అయిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) పరిధిలోని ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, రోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

బ్రిటన్‌లోని మెజారిటీ ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లు దశాబ్దాల నాటి పాత భవనాల్లో కొనసాగుతున్నాయి. అక్కడ ఆధునిక ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలు లేకపోవడంతో లోపల ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి చేరుకుంటున్నాయి. సర్జరీలు చేసే సమయంలో డాక్టర్లు, నర్సులు ప్రత్యేకమైన, మందపాటి పిపిఇ కిట్లు , సర్జికల్ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. విపరీతమైన వేడికి తోడు ఈ దుస్తుల వల్ల వారు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. దీనివల్ల తల తిరగడం, తీవ్ర అలసట, కొన్ని సందర్భాల్లో స్పృహతప్పి పడిపోయేంతటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

డీహైడ్రేషన్ వల్ల కంటిచూపు లేదా శ్రద్ధ లోపించి రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు సర్జన్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సుదీర్ఘంగా సాగే ఆపరేషన్లను మధ్యలోనే తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. వెంటనే తమ సర్జికల్ దుస్తులను తొలగించి, శరీరాన్ని చల్లబరుచుకోవడంతో పాటు చల్లని పానీయాలు తాగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్దిగా కోలుకున్న తర్వాతే తిరిగి ప్లాస్టిక్ దుస్తులు ధరించి శస్త్రచికిత్సను పూర్తి చేస్తున్నారు.

ఈ ఆందోళనకర పరిస్థితిపై రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అధ్యక్షుడు డాక్టర్ టిమ్ లేన్ ది టెలిగ్రాఫ్ పత్రికతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన ఎన్‌హెచ్ఎస్ భవనాల్లో తగిన శీతలీకరణ యంత్రాలు లేకపోవడం వల్ల ఉక్కపోత తారాస్థాయికి చేరుతోందన్నారు. శస్త్రచికిత్సలు నిర్వహించే ఆపరేషన్ థియేటర్లలో (OT) తేమ శాతం (హ్యుమిడిటీ) ఎంతగా పెరిగిపోయిందంటే… శస్త్రచికిత్సకు ఉపయోగించే స్టెరిలైజ్డ్ పరికరాలపై కూడా నీటి బిందువులు పేరుకుపోతున్నాయని, ఇది తీవ్ర ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.

ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల వేలాది ప్రణాళికాబద్ధమైన (ఎలెక్టివ్) శస్త్రచికిత్సలు గంటల తరబడి ఆలస్యమవుతుండగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు డాక్టర్లు లోపల స్వేదంతో పోరాడుతుంటే, మరోవైపు సర్జరీ కోసం వేచి ఉండే గదుల్లో సరైన ఏసీలు లేక, కేవలం ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ వెలుగులోనే రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాల కొరత , వాతావరణ మార్పుల కారణంగా యూకే వైద్య రంగానికి ఎదురవుతున్న ఈ అపూర్వ సంక్షోభం తక్షణమే ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.