Singapore :  సింగపూర్‌లో 400 మందికి పైగా వలస కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యాపారి దివాళా తీసినట్లు అక్కడి కోర్టు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్‌లో పర్మనెంట్ రెసిడెంట్‌గా ఉంటున్న రాము పళని వేలు అనే వ్యక్తిపై ఆగస్టు 13న కోర్టు ఈ బ్యాంక్రప్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఎయిర్ కండిషనింగ్, ప్లంబింగ్, భవన నిర్మాణ సేవలు అందించే కేపీఏ ఇంజనీరింగ్, ఎస్‌కే ఇండస్ట్రీస్, వివిఆర్ ప్లాంట్ ఇంజనీరింగ్ వంటి ఏడు కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులతో సహా దాదాపు 407 మంది కార్మికులకు రెండు నెలలకు పైగా జీతాలు అందకపోవడంతో వారంతా అధికారులకు ఫిర్యాదు చేశారు.

Also Read : బంగారు గనిలో తీవ్ర విషాదం.. కొండచరియలు పడి 13 మంది దుర్మరణం!

ఈ జీతాల గొడవ 2025లోనే మొదలైంది. మొదట కేపీఏ ఇంజనీరింగ్‌కు చెందిన ఐదుగురు కార్మికులు జీతాలు రావట్లేదని కార్మిక వివాదాల పరిష్కార కేంద్రానికి వెళ్లగా, వారానికి సమస్య సర్దుమనిగి జీతాలు అందాయి. కానీ, మే, జూన్ నెలల్లో మళ్లీ మరికొందరు కార్మికులు ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా జూన్ 8న కార్మికులు ఉంటున్న హాస్టల్ ఖాళీ చేయాలంటూ నోటీసులు రావడంతో పరిస్థితి మరింత క్షీణించింది. జూన్ 22న ఏకంగా 100 మందికి పైగా కార్మికులు ఒకేసారి సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆఫీసుకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరడంతో ఈ విషయం బాగా వెలుగులోకి వచ్చింది.

ఈ వివాదం సంచలనం సృష్టిస్తున్న సమయంలో కంపెనీ డైరెక్టర్ రాము దేశంలో లేరు. అధికారులు ఆయన కోసం ప్రయత్నిస్తుండగా, జూన్ 26న ఆయన సింగపూర్ తిరిగొచ్చి అధికారుల విచారణకు సహకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత జులై 9న ఆయనే స్వయంగా దివాళా పిటిషన్ దాఖలు చేయగా, ఆగస్టు 13న కోర్టు ఆయనను బ్యాంక్రప్ట్‌గా ప్రకటించింది. సింగపూర్ చట్టాల ప్రకారం కార్మికులకు జీతాలు ఎగ్గొట్టే యజమానులకు ప్రతి నేరానికి సుమారు 3,000 నుండి 15,000 డాలర్ల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరుపుతున్నారు.

Also Read : టిక్‌టాక్‌ టు గ్యాంగ్‌ స్టర్‌.. నగరంలోనూ షహజాద్‌ భట్టీ నెట్‌ వర్క్‌.. చెక్‌ పెట్టిన ఆర్మీ

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.