Strait Of Hormuz Close : అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు ఇరు దేశాల మధ్య ఈనెల 18న కుదిరిన శాంతి ఒప్పందం వారం రోజులు కూడా గడవక ముందే కుప్పకూలింది. ఒప్పందంలోని నిబంధనలను అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఘోరంగా ఉల్లంఘించిందంటూ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలాంటి ‘హోర్ముజ్ జలసంధి’ని (Strait of Hormuz) మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. ఈ పరిణామంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) నిరంతరాయంగా జరుపుతున్న భీకర దాడులే ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణమ్యాయి. లెబనాన్‌లోని నబతియెహ్‌ తదితర ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో విరుచుకుపడటంతో అనేక నివాస భవనాలు ధ్వంసమవడమే కాకుండా, కనీసం ఐదుగురు పౌరులు మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గకపోవడం, అమెరికా తన హామీలను నెరవేర్చడంలో విఫలం కావడం వల్లే హోర్ముజ్ జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని ఇరాన్ సాయుధ దళాల అత్యున్నత సంయుక్త కమాండ్ ‘ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్’ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం శత్రువుల నమ్మకద్రోహానికి తమ ప్రతిస్పందనలో కేవలం మొదటి అడుగు మాత్రమేనని, దురాక్రమణలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా రంగంలోకి దిగి, అంతర్జాతీయ నౌకలు ఏవీ హోర్ముజ్ జలసంధి వైపు రావద్దని, అలా వస్తే వాటి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని గట్టిగా హెచ్చరించింది. ఏదైనా ఒప్పందం పూర్తిస్థాయిలో అమలు దశలోకి వచ్చినప్పుడు మాత్రమే అన్ని విషయాలు తేలుతాయని ఐఆర్జీసీ స్పష్టం చేసింది.
అయితే, ఇరాన్ చేసిన ఈ మూసివేత ప్రకటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూతపడినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని, ఆ జలమార్గం ఇంకా తెరిచే ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. నౌకల రాకపోకలు, అంతర్జాతీయ చమురు రవాణా యథావిధిగా కొనసాగుతున్నాయని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇరాన్ కేవలం బెదిరింపులకు పాల్పడుతోందని, క్షేత్రస్థాయిలో రవాణాకు ఎలాంటి ఆటంకం కలగలేదని అమెరికా రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించి, ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తెరవెనుక దౌత్య ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మధ్యంతర ఒప్పందంపై అమెరికాతో సాంకేతిక అంశాలపై చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌కు బయలుదేరింది. వాస్తవానికి ఈ చర్చలు శుక్రవారమే జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా త్వరలోనే స్విస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇరు దేశాల ఉన్నతాధికారుల సమక్షంలో స్విట్జర్లాండ్ వేదికగా జరిగే ఈ చర్చలపైనే పశ్చిమాసియా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు ఐదో వంతు (20%) వాటా ఒక్క హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. అలాంటి వ్యూహాత్మక జలమార్గాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ చమురు మార్కెట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయేమోననే భయాలు అంతర్జాతీయంగా నెలకొన్నాయి. ఇరాన్ ప్రకటనపై అమెరికా మున్ముందు ఎలా రియాక్ట్ అవుతుంది, స్విస్ చర్చలు సఫలమవుతాయా లేదా అనే అంశాలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.