Earthquake
Earthquake
Earthquake : అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా సంభవించిన ఒక భారీ భూకంపం భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 దేశాలను ఒక్కసారిగా వణికించింది. శనివారం సాయంత్రం భారత కాలమానం ప్రకారం సుమారు 7:04 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు భారత జాతీయ సిస్మోలజీ కేంద్రం (NCS) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రమాదకరమైన హిందూకుష్ రీజియన్‌లో టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానినొకటి బలంగా ఢీకొట్టుకోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని రెడ్ క్రాస్ సంస్థ నివేదిక పేర్కొంది.
ఈ భూకంప కేంద్రం ఈశాన్య అఫ్గానిస్థాన్‌లోని జుర్మ్‌కు దక్షిణంగా 43 కిలోమీటర్ల దూరంలో, ఫైజాబాద్‌కు దక్షిణంగా 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అంతర్జాతీయ భూగర్భ పరిశోధన సంస్థలు తెలిపాయి. అయితే, ఈ భూకంపం భూమి అంతర్భాగంలో దాదాపు 215 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంప కేంద్రం ఇంతటి లోతులో ఉండటం వల్లే ఉపరితలంపై దాని తీవ్రత తగ్గి, అఫ్గానిస్థాన్‌లో పెద్దగా నష్టం జరగలేదని, కానీ ప్రకంపనలు మాత్రం సుదూర ప్రాంతాల వరకు విస్తరించాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అఫ్గాన్ పొరుగు దేశాలతో పాటు భారత్‌లోనూ దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (నోయిడా, గురుగ్రామ్), జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో పలుచోట్ల భూమి బలమైన ప్రకంపనలతో కంపించింది. ఇళ్లలోని వస్తువులు, ఫ్యాన్లు ఒక్కసారిగా కదలడంతో కశ్మీర్ లోయతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అపార్టుమెంట్లు, ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
భారత్, అఫ్గానిస్థాన్‌లతో పాటు చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్థాన్ , పాకిస్థాన్ దేశాలలోనూ ఈ భూప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అదృష్టవశాత్తూ భారత్,అఫ్గాన్‌లలో ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన అధికారిక ఘటనలు నమోదు కాలేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతాన్ని మాత్రం శుక్రవారం నుంచే వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బర్ఖాన్, మూసాఖేల్, కోహ్లు, కింగ్రి, రఖ్ని వంటి ప్రాంతాల్లో 4.3 నుంచి 5.3 తీవ్రతతో సంభవించిన వరుస ప్రకంపనల ధాటికి అక్కడి మట్టి ఇళ్లు కూలిపోయాయి. ఈ సంఘటనల్లో పలువురు స్థానికులు తీవ్రంగా గాయపడగా, వారిని రక్షించి ప్రస్తుతం స్థానిక ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం మిగిల్చిన తీవ్ర విషాదం, భయం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకముందే, ఇప్పుడు ఆసియా ఖండంలోని ఎనిమిది దేశాలను ఒకేసారి కదిలించిన ఈ హిందూకుష్ భూకంపం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో రావడం వల్లనే భారత్‌లో పెద్ద ప్రమాదం తప్పిందని, లేదంటే నరమేధం జరిగి ఉండేదని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.