
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్సిల్లా చాన్ కలిసి ఐర్లాండ్‌లోని దాదాపు 200 ఏళ్ల పురాతనమైన ‘స్ట్రాన్‌కల్లీ’ కోటను కొనుగోలు చేశారు. దీని ధర సుమారు 30 మిలియన్ యూరోలు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.335 కోట్లు. అసలు ఈ కోటలో ఏముంది? జుకర్‌బర్గ్ ఇంత భారీ మొత్తం పెట్టి దీన్నే ఎందుకు కొన్నారో చూద్దాం.
ఐర్లాండ్‌లోని బ్లాక్‌వాటర్ వ్యాలీలో, ‘బ్లాక్‌వాటర్ నది’ ఒడ్డున ఈ స్ట్రాన్‌కల్లీ కోట ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి, నది, భారీ భూభాగం కలసి దాదాపు 440 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోతిక్ శైలి భవంతిని సుమారు 1830లో అప్పటి మాజీ పార్లమెంట్ సభ్యుడు జాన్ కీలీ కోసం ‘పేన్ సోదరులు’ రూపకల్పన చేశారు. అంటే దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ చారిత్రాత్మక భవంతిని ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ సొంతం చేసుకున్నారు.
ఈ కోట వైశాల్యం దాదాపు 16 వేల చదరపు అడుగులు. ఇంట్లో వంటగది నుండి భోజన శాలకు నడుచుకుంటూ వెళ్లాలంటే నాలుగున్నర నిమిషాల సమయం పడుతుంది. సాధారణంగా ఇంట్లో ఒక గది నుండి మరో గదికి వెళ్లడానికి కొన్ని అడుగులు వేస్తాం.. కానీ జుకర్‌బర్గ్ కొత్త ఇంట్లో భోజనం చేసే ప్రదేశానికి వెళ్లాలంటే చిన్నపాటి ప్రయాణమే చేయాల్సి ఉంటుంది.
ఈ స్ట్రాన్‌కల్లీ కోట గత 25 ఏళ్లుగా ‘ఆర్ఏబి క్యాపిటల్’ సహ వ్యవస్థాపకుడు మైకేల్ అలెన్-బక్లీ, ఆయన భార్య జియాన్కార్ల ఆధీనంలో ఉంది. ఇప్పుడు వారు ఈ ఆస్తిని జుకర్‌బర్గ్ దంపతులకు విక్రయించారు. అయితే ఈ ఒప్పందం బహిరంగ మార్కెట్లో కాకుండా ప్రైవేట్‌గా జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఈ లావాదేవీ ఇంకా ఐర్లాండ్ ఆస్తుల ధరల నమోదు పత్రాల్లో అధికారికంగా నమోదు కాలేదు.
అమెరికాలోనే జుకర్‌బర్గ్ కుటుంబానికి భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అయినా ఐర్లాండ్‌లో ఇంత ఖరీదైన కోట ఎందుకు కొన్నారంటే దానికి కారణం.. మెటా సంస్థకు ఐరోపాలో అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం డబ్లిన్ (ఐర్లాండ్) లోనే ఉంది. 2009 నుండి ఐర్లాండ్‌లోనే ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ సుమారు 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త కోట డబ్లిన్‌లోని కార్యాలయానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. జుకర్‌బర్గ్ కుటుంబం ఐర్లాండ్‌కు వచ్చినప్పుడు ఈ ఇంటిని ఉపయోగించనున్నారు.
కేవలం ఖరీదైన ఇల్లు కాదని.. ఒక చారిత్రాత్మక ఆస్తిని సొంతం చేసుకుని భవిష్యత్తు తరాలకు కాపాడటమే తమ లక్ష్యమని జుకర్‌బర్గ్ కుటుంబం చెబుతోంది. జుకర్‌బర్గ్‌కు ఆస్తుల కొనుగోలు కొత్తేమీ కాదు. అమెరికాలోని పాలో ఆల్టో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డిసి, హవాయి వంటి ప్రాంతాల్లో ఆయనకు ఎన్నో భారీ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఐర్లాండ్‌లోని ఈ చారిత్రాత్మక కోట కూడా చేరింది.









