పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో అక్కడి ప్రజలపై పాకిస్తాన్ సైన్యం అణచివేత చర్యలను తీవ్రతరం చేసింది. పీఓకే పరిధిలోని రావాలాకోట్‌లో నిరసనకారులు ధర్నా చేస్తున్న ప్రాంతంపై పాక్ సైన్యం డ్రోన్ల ద్వారా బాంబులు కురిపించింది. అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 12 నుండి 1 గంటల మధ్య కాలంలో ఈ దాడి జరిగింది. నిరసన స్థలంలో భారీ సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఆర్‌డీఎక్స్ (RDX) లాంటి నాలుగు టైమర్ బాంబులను డ్రోన్ల ద్వారా కిందకు వదిలారు. అయితే, అప్రమత్తమైన కమిటీ సభ్యులు సమయానికి వాటిని గుర్తించి నిష్క్రియం చేయడంతో ఒక పెద్ద ఘోర ప్రమాదం తప్పింది.

Also Read : ఫ్రాన్స్‌లో ఎండలకు వెయ్యిమంది బలి..కారణం అమెరికానే అంటోన్న జనం..ఎందుకో తెలుసా?

ఇంటర్నెట్ నిలిపివేత.. ఆహార సరఫరా బంద్

గత జూన్ 5వ తేదీ నుండి పీఓకే వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఇంటర్నెట్ బంద్‌ను ఆసరాగా చేసుకుని పాక్ సైన్యం గతంలో నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో 58 మంది మరణించారు. అంతేకాకుండా, గత రెండు వారాలుగా పీఓకే ప్రాంతానికి ఆహార సరఫరాను కూడా నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు తమ తిరుగుబాటును ఆపకపోవడంతో, పాక్ సైన్యం ఈ రకమైన అమానవీయ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది.

“పాక్ సైన్యం చేసే ఇలాంటి దుశ్చర్యలకు పీఓకే ప్రజలు భయపడరు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, మా హక్కుల కోసం మా శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తాం.” అని  జమ్మూ-కాశ్మీర్ జాయింట్ పబ్లిక్ యాక్షన్ కమిటీ తేల్చి చెప్పింది.

అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు

పీఓకేలో పాకిస్తాన్ భద్రతా దళాల అరాచకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గత వారం లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్ వెలుపల దీనిపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనంతరం నిరసనకారులు బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసమైన ’10 డౌనింగ్ స్ట్రీట్’ వరకు మార్చ్ నిర్వహించారు. ఈ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తాలని, ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే మానవతా సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

పీఓకేను ఒంటరి చేసేందుకు పాక్ కుట్ర

పీఓకేను పాకిస్తాన్‌లోని మిగిలిన ప్రాంతాల నుండి వేరు చేయడానికి పాక్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. నిరసనకారులతో చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ నుండి బయలుదేరిన పాక్ సెనేట్ ప్రతిపక్ష నేత మహమూద్ అచక్జాయ్, మాజీ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీలను కహుటా వద్దే భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ, పీఓకేలో 21వ రోజూ తిరుగుబాటు కొనసాగింది. రావాలాకోట్‌లోని ఈద్గా మైదానంలో 60 వేల మందికి పైగా ప్రజలు గుమిగూడగా, ఇతర నగరాల్లోనూ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రదర్శనలు, నినాదాలు మిన్నంటాయి.

ఈద్గా మైదానంలో వేలాది మందిని ఉద్దేశించి అవామీ యాక్షన్ కమిటీ సభ్యుడు సర్దార్ లియాఖత్ హయత్ మాట్లాడుతూ, ఈ పోరాటంలో అంతిమ విజయం ప్రజలదేనని ఇస్లామాబాద్ పాలకులు, పీఓకేలోని వారి తోలుబొమ్మ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

Also Read : పశ్చిమాసిమాలో మరోసారి ఉద్రిక్తతలు… చర్చలకు సిద్ధమైన అమెరికా, ఇరాన్‌

పీఓకేలో అసలు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

పీఓకేలో విపరీతమైన ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల), రాజకీయ హక్కుల కొరత, అధ్వాన్నమైన పరిపాలన కారణంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. స్థానిక వ్యవహారాల్లో ఇస్లామాబాద్ శృతిమించిన జోక్యం చేసుకోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ అసంతృప్తే ఇప్పుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ నెలలో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలను బయటపెట్టాయి. సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్న ప్రజలపై పాక్ దళాలు జరిపిన దాడులు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. ఇది ఇస్లామాబాద్ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.