పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో అక్కడి ప్రజలపై పాక్ ప్రభుత్వం తీవ్రమైన అణచివేతకు పాల్పడుతోంది. తమ హక్కుల కోసం గత మూడు వారాలుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న స్థానిక ప్రజలను భయపెట్టేందుకు పాక్ సైన్యం, పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని ఎలాగైనా ఆపేయాలనే పగతో.. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ కమిటీ ముఖ్య నేత షౌకత్ నవాజ్ మీర్‌ను పాక్ భద్రతా దళాలు అక్రమంగా అరెస్ట్ చేశాయి. ఆయనపై ఏకంగా దేశద్రోహం, ఉగ్రవాద కేసులు బనాయించారు. ధిర్‌కోట్‌లో ఓ రహస్య ఇంట్లో ఆయన ఉన్నట్లు తెలుసుకున్న పాకిస్తానీ రేంజర్లు, అర్ధరాత్రి వేళ అడవి మార్గంలో వచ్చి, గాలిలోకి కాల్పులు జరిపి ఈడ్చుకెళ్లారు.

షౌకత్ నవాజ్ మీర్ అరెస్టుతో ఆగని పాక్ దళాలు ఈ ఉద్యమంతో సంబంధం ఉన్న ఇతర ప్రజా నాయకుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి. ఈ నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న సర్దార్ ఉమర్ నజీర్ ఇంటిపై కూడా రావల్కోట్‌లో పోలీసులు, రేంజర్లు అర్ధరాత్రి దాడులు చేసి సోదాలు నిర్వహించారు. నిరసనకారులను భయభ్రాంతులకు గురిచేయడానికి పాక్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 150 మంది స్థానిక నిరసనకారులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నలుగురు ప్రముఖ నేతలపై దేశద్రోహం కేసులు పెట్టడమే కాకుండా.. వారిని పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.1 కోటి చొప్పున భారీ బహుమతిని కూడా ప్రకటించింది.

పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతలా అణచివేతకు పాల్పడుతున్నప్పటికీ.. పీఓకేలో ప్రజా నిరసనలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నిరసనలు 22వ రోజుకు చేరుకున్నాయి. రావల్కోట్‌లోని ఈద్గా మైదానంలో ఇప్పటికీ 60,000 మందికి పైగా సామాన్య ప్రజలు చేరి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. అయినా ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తమ అగ్ర నాయకుడు షౌకత్ నవాజ్ మీర్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా మండిపడుతోంది. రాబోయే రోజుల్లో పాక్ ప్రభుత్వ అన్యాయాలకు నిరసనగా ముజఫరాబాద్‌కు భారీ ఎత్తున పాదయాత్ర చేపట్టడానికి కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.