పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న ఘోర అకృత్యాలు బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేందుకు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఓ పెద్ద ప్లాన్ వేసింది. ఇటీవల PoKలో స్థానిక ఎన్నికల సమయంలో ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం దారుణంగా విరుచుకుపడింది. సైనిక దళాలు జరిపిన అంధాధుంద్ కాల్పుల్లో 100 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ భయానక సైనిక అణచివేత, పౌరులపై జరుగుతున్న దాడులు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. దీంతో అసలు నిజాలు ప్రపంచ దేశాల కంట పడకుండా చూసేందుకు విదేశీ జర్నలిస్టుల కదలికలపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన ఆంక్షల ఉక్కుపాదం మోపింది.

Also Read : ఉక్రెయిన్ వీధుల్లో రష్యన్ డ్రోన్ హంటింగ్.. వ్యాపారిని వెంటాడిన డ్రోన్లు.. ఎలా ఎటాక్ చేస్తాయంటే?

పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్టర్నల్ పబ్లిసిటీ (EP) వింగ్ అంతర్జాతీయ మీడియా సంస్థల కోసం కొత్త మార్గదర్శకాలను అధికారికంగా జారీ చేసింది. ఈ కొత్త నియమాల ప్రకారం పాకిస్తాన్‌లో పనిచేస్తున్న విదేశీ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఇకపై ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ మినహా దేశంలోని ఏ ఇతర ప్రాంతానికైనా ప్రయాణించాలంటే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ‘నిరభ్యంతర పత్రం’ (NOC) పొందాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పాత్రికేయులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, అక్కడ ఎలాంటి వార్తలు లేదా డాక్యుమెంటరీలు తీస్తున్నారనే ప్రతి విషయాన్ని గమనించి ముందే వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకొచ్చారు.

Also Read : అగ్రరాజ్యానికి ఇరాన్ సవాల్.. ప్రపంచానికి చమురు గండం.. అమెరికా వార్నింగ్.. ఇరాన్ సైలెంట్ ప్లాన్!

విదేశీ జర్నలిస్టులు ఏ ఇతర నగరానికైనా వార్తల సేకరణ, వీడియో షూటింగ్ లేదా సోషల్ మీడియా కంటెంట్ తయారీ కోసం వెళ్లాలనుకుంటే కనీసం మూడు వర్కింగ్ డేస్ ముందుగానే EP వింగ్ వద్ద NOC కోసం దరఖాస్తు చేసుకోవాలి. సెలవుల కోసం అబోటాబాద్ లేదా ముర్రే వంటి ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా ఇదే రకమైన అనుమతి తప్పనిసరి చేశారు. అలాగే విదేశీ మీడియా సంస్థలకు స్థానికంగా సహాయం అందించే ప్రొడక్షన్ హౌస్‌లు, కంపెనీలు, ఫ్రీలాన్సర్లు, ఫిక్సర్లు, జర్నలిస్టులు కాని ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికే క్యూఆర్ కోడ్‌లతో కూడిన ప్రత్యేక పీవీసీ గుర్తింపు కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డులు జారీ కావడానికే దాదాపు 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది.

పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్ వంటి తీవ్ర ఉద్రిక్త ప్రాంతాలలో పాక్ సైన్యం జరుపుతున్న దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, స్థానిక పౌరుల గొంతు నొక్కే చర్యలను ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి ఈ రూల్ తెచ్చిందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.