
H-1B Visa Fees : : రెండవసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ దేశంలో విదేశీ వలసలను తగ్గించేందుకు వీలయినన్ని ఆంక్షలు విధిస్తూను ఉన్నాడు. వలసలను కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. అందులో భాగంగా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను తన ప్రధాన టార్గెట్‌గా పెట్టుకున్నారు. వీలయినన్ని మార్గాల్లో వీసా ఫీజులు పెంచి విదేశీయుల రాకను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా హెచ్-1బీ వీసా ఫీజులను మరోసారి పెంచేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువరించింది. వైట్‌హౌస్‌లోని ఆఫిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (ఓఐఆర్ఏ) విభాగం ఈ ప్రతిపాదనపై పూర్తి స్థాయి సమీక్ష జరిపినట్లు వెల్లడించింది.
ఈ ఫీజు పెంపు ప్రతిపాదనను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను మాత్రం ట్రంప్ సర్కారు ఇంతవరకు బహిర్గతం చేయక పోవడం గమనార్హం. అయితే ఏ మేరకు ఫీజులు పెంచుతారన్న విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు బయటకురాలేదు. ఏయే రకాల హెచ్-1బీ వీసా పిటిషన్లకు ఈ ఫీజు పెంపు వర్తిస్తుందనే వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. రాబోయే వారాల్లో డీహెచ్ఎస్ స్వయంగా ఈ ప్రతిపాదనను బహరింగ పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం ప్రజల అభ్యంతరాలు స్వీకరించి ఆపై తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం సాగుతోంది.
అయితే మరో వైపు ఓఐఆర్ఏ సమీక్ష పూర్తైనంత మాత్రాన ఫీజుల పెంపునకు అనుమతి లభించినట్టు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదనను, ప్రజల ముందు పెట్టాక వారి అభిప్రాయాల ఆధారంగా డీహెచ్ఎస్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై గతంలో కోర్టులో చుక్కెదురైంది. అయినా వెనక్కు తగ్గని ట్రంప్ సర్కారు ఇటీవల 9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఫీజులను భారీగా పెంచింది. హెచ్-1బీ, ఎల్-1 వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే కొన్ని సంస్థలపై ట్రంప్ సర్కారు ఈ అదనపు భారం వేసింది. ఇవే కాకుండా, వీసా స్పాన్సర్ చేసే సంస్థలపై కూడా నిఘా మరింత కట్టుదిట్టం చేసేలా హెచ్-1బీ వీసాకు మరిన్ని మార్పులు చేసే ఆలోచనలో ట్రంప్ సర్కారు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికా 4,06,348 హెచ్-1బీ వీసా పిటిషన్లను ఆమోదించినట్లు తెలిసింది. అందులో 2,91,542 పిటిషన్లు వీసా పొడిగింపునకు సంబంధించినవి కాగా ఇందులో భారతీయుల పిటిషన్ల వాటా 77.6 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి వీసా ఫీజులు పెరిగితే భారతీయ ఉద్యోగులు అధికంగా ఉన్న టెక్ కంపెనీలకు ఖర్చుల భారం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.









