donald Trump

అమెరికా రాజకీయాల్లో ఓ కుంభకోణం సంచలనం రేపుతోంది. వైట్‌హౌస్ బాల్‌రూమ్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ కేటాయింపులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 500 మిలియన్ డాలర్లు ప్రాజెక్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు.

అసలు వివాదం ఏంటి?
సాధారణంగా అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి పెద్ద నిర్మాణ ప్రాజెక్టులైనా టెండర్ల ప్రక్రియ ద్వారానే కాంట్రాక్ట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నో అర్హత ఉన్న అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఈ టెండర్లలో పాల్గొని పోటీపడతాయి. అయితే 500 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో చేపట్టిన వైట్‌హౌస్ బాల్‌రూమ్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఎలాంటి టెండర్లు పిలవలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని ఉపయోగించి ఎలాంటి పోటీ లేకుండానే తనకు నచ్చిన ఓ ప్రైవేట్ సంస్థకు ఈ కాంట్రాక్ట్‌ను ఇష్టానుసారంగా కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

కిక్‌బ్యాక్‌ల రూపంలో?
ఈ కాంట్రాక్ట్ కేటాయింపు వెనుక కేవలం పక్షపాతమే కాకుండా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు నిర్మాణ సంస్థకు అంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఏకపక్షంగా అప్పగించినందుకు బదులుగా అధ్యక్షుడు ట్రంప్ కిక్‌బ్యాక్‌ల రూపంలో భారీగా వ్యక్తిగత ఆర్థిక లబ్ధి పొందారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అధికారిక హోదాను ఉపయోగించుకుని సొంత లాభం కోసం చూశారని ట్రంప్‌పై మండిపడుతున్నారు.

ఈ వ్యవహారం బయటకు రావడంతో అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిపక్షాలు ట్రంప్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాధనాన్ని అడ్డగోలుగా తనకు నచ్చిన సంస్థలకు దోచిపెడుతున్నారని, దేశ నియమ నిబంధనలను అధ్యక్షుడు కాలరాస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో జరగకూడని అతిపెద్ద అవినీతి వ్యవహారం.. దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి నిష్పాక్షిక విచారణ జరగాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక, చట్టపరమైన నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎలాంటి టెండర్లు లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను అప్పగించడం వల్ల నాణ్యత లోపించే ప్రమాదం ఉందంటున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన అధ్యక్షుడే ఇలాంటి చర్యలకు పాల్పడటం అమెరికా పరిపాలనా వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే తప్ప అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు.