
ఇరాన్‌కు దుబాయ్ బిగ్‌షాక్ ఇచ్చింది. ఇరాన్‌తో అన్ని ట్రేడ్, కమర్షియల్ యాక్టివిటీస్, ఫైనాన్సియల్ ట్రాన్షక్షన్స్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. UAE తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఇరాన్‌తో ఆర్థికంగా బలమైన సంబంధాలు ఉన్న యూఏఈ.. ఒక్కసారిగా ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది..? ఇరాన్ నుంచి యూఏఈకి ఎదురవుతున్న ముప్పు ఏంటి..? ఈ బిజినెస్ కటాఫ్ వల్ల ఇరాన్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? ప్రస్తుతం గల్ఫ్‌లో పరిస్థితి ఎలా ఉంది..? ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మొదలైన తర్వాత గల్ఫ్ కంట్రీస్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ కంట్రీస్లోని US మిలిటరీ, ఎయిర్ బేస్‌లపై దాడులు చేస్తోంది. ఈ దాడుల ప్రభావం యూఏఈ పైనా పడుతోంది. తాజాగా ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు UAE వైపు వచ్చినట్టు అక్కడి వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించాయి. దీంతో UAE అధికారులు ప్రజల ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్‌లు పంపించి.. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్‌తో అన్ని వాణిజ్యం, వాణిజ్య కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలును తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.
గత కొన్ని వారాలుగా తమ ఆయిల్ ట్యాంకర్స్, వాణిజ్య నౌకలను ఇరాన్ టార్గెట్ చేస్తోందని UAE ఆరోపిస్తోంది. ముఖ్యంగా యూఏఈ ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ ఆయిల్ కంపెనీ ADNOCకు సంబంధించిన నౌకలపై హర్మూజ్ జలసంధిలో వరుస దాడులు జరిగినట్టు చెబుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పలుమార్లు ADNOC నౌకలు దాడులకు గురయ్యాయని UAE వెల్లడించింది. దీంతో యూఏఈకి ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పు కేవలం మిస్సైల్ అటాక్కే పరిమితం కాలేదు.. సముద్ర మార్గాల్లోనూ భద్రతా సమస్యగా మారింది. ఆయిల్ ట్యాంకర్స్పై దాడులు కొనసాగుతుండటంతో ఇంధన సరఫరా, షిప్పింగ్ మార్గాలు, వాణిజ్యంపై ఆందోళనలు పెరిగాయి.
ఈ పరిస్థితుల్లోనే గత జూన్‌లో యూఏఈ, ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం అమల్లో ఉన్న దాదాపు రెండు నెలల పాటు తమపై పెద్దగా దాడులు జరగలేదని యూఏఈ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒప్పందం గడువు ముగియడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఒప్పందం ముగిసిన మరుసటి రోజే యూఏఈ వైపు క్షిపణి ముప్పు రావడంతో రెండు దేశాల మధ్య టెన్షన్ మరోసారి పెరిగింది. దీంతో ఇరాన్ నుంచి వస్తున్న ముప్పును సీరియస్‌గా తీసుకున్న UAE.. ఇప్పుడు వాణిజ్య, ఆర్థిక సంబంధాలపైనా కఠిన నిర్ణయం తీసుకుంది.
తాజాగా ఘటనతో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. యూఏఈ రక్షణ శాఖ ప్రకారం.. ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల(Territorial Waters)కు బయట పడిపోగా.. మరోటి UAE ప్రాదేశిక జలాల్లో కూలిపోయింది. ఈ ఘటన తర్వాతే ఇరాన్‌తో సంబంధాలపై యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇరాన్‌తో అన్ని ట్రేడ్ యాక్టివిటీస్, కమర్షియల్ ఎక్ఛేంజెస్, ఫైనాన్సియల్ లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇరాన్, యూఏఈ మధ్య చాలాకాలంగా బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్.. ఇరాన్‌కు ఒక కీలకమైన ట్రేడింగ్ హబ్ గా ఉంది. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, రీఎక్స్పోర్ట్, షిప్పింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ వంటి అనేక రంగాల్లో రెండు దేశాల మధ్య వ్యాపారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు యూఏఈ ఈ వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడం ఇరాన్‌పై నేరుగా ఆర్థిక ఒత్తిడి పెంచే నిర్ణయంగా మారింది. ఇప్పటికే యుద్ధం, ఆంక్షలు, వాణిజ్య పరిమితులతో ఇబ్బందులు పడుతున్న ఇరాన్‌కు.. యూఏఈతో వ్యాపార మార్గాలు మూసుకుపోవడం మరో ఆర్థిక దెబ్బగా మారే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇంపోర్ట్ – ఎక్స్పోర్ట్, రీ–ఎక్స్పోర్ట్ బిజినెస్, షిప్పింగ్, పేమెంట్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. యూఏఈలోని కమర్షియల్, ఫైనాన్సియల్ నెట్వర్క్ ఇరాన్ వ్యాపారాలకు కీలకం కావడంతో.. ఇప్పుడు ఈ లావాదేవీలు నిలిచిపోతే ఇరాన్ కంపెనీలు, ట్రేడర్స్‌కు పేమెంట్స్, షిప్పింగ్, సప్లై చైనాలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే.. యూఏఈ తీసుకున్న నిర్ణయం కేవలం రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని నిలిపివేయడం మాత్రమే కాదు.. ఇరాన్ వ్యాపార వ్యవస్థకు కీలకమైన మార్గాలను కూడా దెబ్బతీసే నిర్ణయంగా మారింది.
అయితే యూఏఈ ముందున్న మరో పెద్ద సవాలు హోర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు, నౌకాయాన మార్గాలలో ఇది ఒకటి. ప్రస్తుతం ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడానికి నిరాకరిస్తుండటంతో.. హోర్ముజ్‌లో షిప్పింగ్ రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే యూఏఈతో పాటు మొత్తం గల్ఫ్ ప్రాంతంలో చమురు సరఫరా, రవాణా, వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించి.. హోర్ముజ్ జలసంధిలో రాకపోకలు సాధారణ స్థితికి తీసుకురావాలని UAE కోరుతోంది.
ఇక ఈ పరిణామాల మధ్య గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఒకవైపు ఇరాన్ నుంచి క్షేపణి, డ్రోన్ ముప్పు కొనసాగుతోంది.. మరోవైపు గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను హై అలర్ట్‌లో ఉంచాయి. దీనికి తోడు హోర్ముజ్‌పై ఇరాన్ హెచ్చరికలు కొనసాగుతుండటంతో చమురు ట్యాంకర్లు, షిప్పింగ్ మార్గాలు, ఓడరేవులు, ఇంధన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. దీంతో యుద్ధం ప్రభావం కేవలం యుద్ధరంగంకే పరిమితం కాకుండా.. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరా, ఇంధన మార్కెట్ల పైనా పడే పరిస్థితి కనిపిస్తోంది.
మొత్తంగా ఒకవైపు క్షిపణి ముప్పు.. మరోవైపు హోర్ముజ్‌పై ఉద్రిక్తత.. ఇప్పుడు UAE-ఇరాన్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. దీంతో గల్ఫ్‌లో పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నదే కీలకంగా మారింది. మరి UAE ఇచ్చిన ఈ కౌంటర్ షాక్‌కు ఇరాన్ ఎలా స్పందిస్తుంది..? దాడులు ఆపి చర్చలకు వస్తుందా.. లేక యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందా అన్నది వేచి చూడాలి.









