
-RAVI PRAKASH
RED SEA : కొన్ని రాత్రులు చరిత్రలో కలిసిపోతాయి… మరికొన్ని రాత్రులు చరిత్రనే శాశ్వతంగా మార్చేస్తాయి. అలాంటి ఒక భయంకరమైన రాత్రి ఇది. కొద్ది గంటల వ్యవధిలోనే… మిడిల్ ఈస్ట్ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రమాదం అంచున నిలబడింది. క్షిపణులు… డ్రోన్లు… మంటలు…. పేలుళ్లు… సైనిక బెదిరింపులు…. వ్యూహాత్మక చమురు మార్గాలు… విద్యుత్ కేంద్రాలు… నీటి సరఫరా వ్యవస్థలు… యుద్ధనౌకలు…. నిజమేంటో ప్రభుత్వాలు తేల్చేలోపే… సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అయిపోయాయి… ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి, ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవడం నేడు అసాధ్యంగా మారింది. ఎందుకంటే, ఆధునిక యుద్ధాలు కేవలం క్షిపణులతో మాత్రమే జరగడం లేదు. సమాచారంతో జరుగుతున్నాయి… వైరల్ వీడియోలతో జరుగుతున్నాయి… అనామక సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్నాయి.. పరస్పర ఆరోపణల ద్వారా జరుగుతున్నాయి… అయితే, మిడిల్ ఈస్ట్‌లో ఆ రాత్రి ఏం జరిగిందన్నదానిపై నిజానిజాలు తేల్చబోతున్నా! వైరల్ వీడియోల గుట్టు విప్పబోతున్నా! ఏవి వాస్తవమో, ఇంకా ఏవి నిర్థారణ కావాల్సినవో నేను క్లియర్‌గా చెప్పబోతున్నా! ఇక్కడ ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు. ఏం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం
ఒకే ఒక్క రాత్రి… మిడిల్ ఈస్ట్ రాజకీయ ముఖచిత్రాన్ని ఎంతలా మార్చేసిందో చెప్పడమే నా ఈ ప్రయత్నం! నెలల తరబడి… ఈ ప్రాంతం ఘర్షణల నీడలో మగ్గుతోంది. సైనిక స్థావరాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయి. అమెరికా తన బలగాలను గల్ఫ్ రీజియన్ వ్యాప్తంగా మరింత కఠినతరం చేసింది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఏకకాలంలో పలు యుద్ధాల్లో తలపడుతోంది. తన భూభాగంపై ఏ ప్రత్యక్ష దాడి జరిగినా సహించేది లేదని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తోంది. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే… అది ఒక దేశానికే పరిమితం కాదని ప్రపంచం భయపడుతోంది. ఒక దేశాన్ని దాటి యుద్ధం ఎలా విస్తరిస్తుందో… ఆ భయంకరమైన వాస్తవం ఇప్పుడు బయటపడబోతోంది! ప్రపంచాన్ని భయపెట్టిన ఆ యుద్ధ అంచనాలు ఎలా నిజమయ్యాయో… ఇప్పుడు చూద్దాం !
ఆ రోజు చీకటి పడగానే సోషల్ మీడియా ఒక్కసారిగా కుదిపేసింది… ఇరాన్ నుంచి నిప్పులు చిమ్ముతూ క్షిపణులు ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో, సౌదీ నగరం ‘యన్బు’లో హెచ్చరిక సైరన్లు మార్మోగాయి. అమెరికా బేస్ క్యాంప్‌ల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలు… ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేశాయి. ఆ దాడుల్లో అమెరికాకు జరిగిన నష్టమెంతో తెలియకపోయినా… ఇరాన్ తన ప్రతీకార పర్వాన్ని మొదలుపెట్టిందనే విషయం మాత్రం అందరికీ అర్థమైంది. మొదట్లో ఇది కేవలం క్షిపణుల దాడుల్లా అనిపించినా… ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. నిమిషాల వ్యవధిలోనే… యుద్ధం అన్ని దిశలకు విస్తరించి, ఆ ప్రాంతం మొత్తం అగ్నిగుండంగా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాను మరో వీడియో కుదిపేసింది. అమెరికన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినట్లుగా ఉన్న ఆ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో… ప్రజలు మరింత భయపడిపోయారు. కానీ, ఆ వీడియోలోని దృశ్యాలు ఎంతవరకు నిజం? అది అక్కడి దాడి వీడియోనేనా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. ఆధునిక యుద్ధం ప్రధాన లక్షణం ఇదే! ఇక్కడ నిజం కంటే అబద్ధమే క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ వైరల్ వీడియో పట్ల నిజానిజాలు తేలకముందే… అందరిలోనూ అప్పుడే ఒక ప్రశ్న మొదలైంది. కీలకమైన ఇంధన కేంద్రాలు కూడా యుద్ధభూమిగా మారిపోతే, ఇక పరిస్థితి ఎలా ఉంటుంది అని! కొద్దిసేపటికే… భయంకరమైన మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
యన్బు సమీపంలో ఆ రాత్రి ఆకాశమంతా మంటలతో నిండిపోయింది. ఆ అగ్నిప్రమాదానికి అసలు కారణం తెలియకపోయినా… అది జరిగిన ప్రదేశం మాత్రం అత్యంత ప్రాధాన్యమైనది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఇంధన కేంద్రాల్లో యన్బు ఒకటి. హోర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా, చమురును ప్రపంచానికి చేరవేసే కీలక మార్గం యన్బు! ఒకవేళ ఇంధన కేంద్రాలే యుద్ధ లక్ష్యాలైతే… దాని ప్రభావం కేవలం సౌదీకే కాదు, ప్రపంచం మొత్తానికి తగులుతుంది. చమురు ధరలు… ప్రపంచ రవాణా వ్యవస్థ… ఆర్థిక మార్కెట్లు… ఇలా ప్రతీదీ చిన్నాభిన్నం అవుతాయి. అయితే… అది ఇరాన్ దాడేనా? అన్న ప్రశ్నకు ఇప్పటికి ఆధారాలు లేవు. కానీ, ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు ఒక్కటి మాత్రం స్పష్టం చేస్తున్నాయి… యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాల జీవనాడి అయిన ఇంధన సరఫరాకే ముప్పుగా మారిందని! అయితే ఈ ఘర్షణ ఇంకాస్త పెద్దదైంది. ఇరాన్ ఒంటరిగా దాడులు చేయలేదని… తెరవెనుక మరెవరో ఉన్నారన్న ఆరోపణలు మొత్తం పరిస్థితిని మరింత ప్రమాదకరమైన జోన్లోకి నెట్టేసాయి. ఆ రాత్రి నిశ్శబ్దం క్షిపణుల హోరుతో ముక్కలైంది. కేవలం ఒక దాడితో మొదలైన ఈ ఉద్రిక్తత, క్షణాల్లోనే అదుపు తప్పింది. సరిహద్దులు, కూటములు అనే తేడా లేకుండా… అన్ని వైపుల నుంచి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు వెల్లువలా వస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ గురించి మరో సంచలన వార్త వైరల్ అయ్యింది.
ఇరాన్ ఒంటరిగా కాకుండా… యెమెన్‌లోని హౌతీలు, లెబనాన్‌లోని హెజ్బొల్లాలతో కలిసి అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులు చేస్తోందని ప్రచారం మొదలైంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ, ఇరాన్‌కు ఉన్న బలమైన నెట్‌వర్క్‌పై నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకేసారి అన్ని వైపులు నుంచి దాడులు మొదలైతే.. పరిస్థితిని అదుపు చేయడం ఎవరితరం కాదు. వైరల్ వీడియోలు నిజమో, కాదో తెలియదు కానీ… వ్యాపించిన ఆ వార్త మాత్రం… గల్ఫ్ రీజియన్‌ను భయపడేలా చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ వంతు వచ్చింది. ఆ రాత్రి వచ్చిన వీడియోలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. టెల్ అవీవ్‌లో భారీ మంటలు చెలరేగుతున్నాయి… ఈ వీడియోలు సోషల్ మీడియాను హోరెత్తించాయి. ఇరాన్ క్షిపణులు టెల్ అవీవ్‌లోని ఇంధన కేంద్రాలను పేల్చేశాయని నెటిజన్లు చెప్పుకొచ్చారు. మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, కానీ వాటికి కారణం ఏంటో తెలియదు. ఇరాన్ దాడి వల్లే ఆ మంటలు చెలరేగాయని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ ఒకవేళ అదే నిజమైతే, విషయం చాలా తీవ్రమైనది. నేటి యుద్ధాలు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కావు. విద్యుత్ నిలిచిపోవడం… ఇంధన సరఫరా ఆగిపోవడం… రవాణా వ్యవస్థ స్తంభించడం… ఇలాంటివి సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. నిజానిజాలు తేలేలోపే, ఆ వీడియోలన్నీ సోషల్ మిడియాలో ’సమచార యుద్ధం’గా మారిపోయాయి. కానీ, తర్వాత వచ్చిన వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
మిడిల్ ఈస్ట్‌లో ఇదొక అత్యంత సున్నితమైన అంశం! ఇజ్రాయెల్‌కు చెందిన అణు కేంద్రాలను… ఇరాన్ ధ్వంసం చేసిందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ భారీ ఓటమిని మూటగట్టుకుందని ఇంటర్నెట్లో పోస్టులు వెలిశాయి. ఆ వీడియోలో ఉన్నది నిజంగా అణు కేంద్రమేనా? నిజంగా ఇరాన్ దాడి వల్లే పేలుడు జరిగిందా? అనే దానికి ఇప్పటికీ ఏ ఆధారాలు దొరకలేదు. అయినా, ఆ వార్త ఎంత వేగంగా వ్యాపించిందంటే… ప్రభుత్వం స్పందించే లోపే, జనం ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈరోజుల్లో నిజం కంటే వదంతులే వేగంగా ఊళ్లు చుట్టొచ్చేస్తున్నాయ్! గంటలు గడుస్తున్న కొద్దీ… యుద్ధం గల్ఫ్ అంతటా విస్తరించింది. కువైట్, యూఏఈ, జోర్డాన్లలో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడికి తెగబడిందని ప్రచారం మొదలైంది. ఆకాశంలో మెరుపులు… దూరంగా పేలుళ్ల శబ్దాలు… సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. నిజంగా అక్కడ దాడులు జరిగాయా? అన్నదానికి ఎటువంటి ఆధారాల్లేవు. కానీ, అక్కడ ఉన్న అమెరికా స్థావరాల ప్రాముఖ్యత దృష్ట్యా ఈ వైరల్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే, దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల్లో అమెరికాకు ఉన్న బలమైన స్థావరాలే ఇవి. ఒకవేళ వీటిపై నిజంగా దాడులు జరిగిఉంటే… ఈ యుద్ధం ఇక ఊహించని మలుపు తిరిగినట్లే! చివరిగా… ప్రపంచ వాణిజ్యానికి ప్రాణవాయువు వంటి జలమార్గం ఇప్పుడు యుద్ధ సెగలో చిక్కుకుంది. అక్కడ జరిగే చిన్న ఘర్షణ కూడా, ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. హోర్మూజ్ జలసంధి దగ్గర సరుకు రవాణా ఓడలు కాలిపోతున్న వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. రెండు చమురు ట్యాంకర్లు సముద్ర మైన్స్ తాకి పేలిపోయాయని ఇరాన్ చెబుతోంది. అయితే దీనిని అమెరికా ఖండించింది. ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న పునరావృతమైంది. ఇరాన్ నిజంగా చమురు ట్యాంకర్లను పేల్చేసిందా అని! కానీ ఒకటి మాత్రం నిజం.
ప్రపంచంలోని ఐదవ వంతు చమురు హోర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇక్కడ ఏ చిన్న ఆటంకం కలిగినా, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఈ రాత్రి… ఆ జలసంధే ఇప్పుడు ప్రపంచ సంక్షోభానికి వేదికైంది. ఇప్పుడు ఇది ఏ ఒక్క ప్రాంతానికో… ఏ ఒక్క దేశానికో పరిమితమైన యుద్ధం కాదు. నగరాలు… ఎడారులు… చివరకు సముద్రాలు కూడా యుద్ధక్షేత్రాలే! అయితే, అసలైన ప్రమాదం ముందుంది. ఇరాక్, కువైట్, ఒమాన్ దాటి… ఈ యుద్ధ సెగలు ఇప్పుడు సామాన్యుల కనీస అవసరాలను, మౌలిక వసతులను సైతం దెబ్బతీసే దిశగా దూసుకుపోతున్నాయి! ఈ యుద్ధం ఇప్పుడు ఏ ఒక్క సరిహద్దుకూ పరిమితం కాలేదు. ఇరాక్ నుంచి హిందూ మహాసముద్రం వరకు… సామాన్యుల నిత్యజీవితానికి అవసరమైన మౌలిక వసతుల వరకు, యుద్ధం అన్ని వైపులా విస్తరించింది. ఈ రాత్రి, ఎవరూ ఊహించని స్థాయికి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాక్ నుంచి వచ్చిన మరో భయానక వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆకాశాన్ని తాకుతున్న మంటలు, భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అమెరికా సైనిక స్థావరంపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ దాడులు జరిగింది అక్కడేనా? అసలు చేసింది ఇరానేనా? అన్నదానికి ఇప్పటికీ ఎటువంటి ఆధారాల్లేవు. కానీ వాషింగ్టన్ – టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలకు ఇరాక్ ఎప్పుడూ ప్రధాన కేంద్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ పరోక్ష యుద్ధం… ప్రత్యక్ష దాడులకు దారితీస్తే… పరిణామాలు మాత్రం ఊహించని స్థాయిలో ఉంటాయి! యుద్ధం ఇప్పుడు నేలపై కాదు… నేరుగా అంతర్జాతీయ జలాల్లోకి విస్తరించింది. హార్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ విమానంపై ఇరాన్ దళాలు దాడి చేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఆ వీడియో నిజమా? నిజంగానే దాడి జరిగిందా? అన్నదానికి ఎలాంటి స్పష్టత లేదు. కానీ, హోర్మూజ్‌లో జలసంధి సాధారణ ప్రాంతం కాదు… ఇది ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన సముద్ర మార్గం. అమెరికా, ఇరాన్ నౌకాదళాలు, వాణిజ్య నౌకలు నిత్యం రాకపోకలు సాగించే ఈ ఇరుకైన మార్గంలో… ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పుడు కువైట్ వంతు వచ్చింది… అయితే ఇది సైనిక దాడి కాదు.. అంతకంటే ప్రమాదకరమైనది. సామాన్యుల ప్రాణనాడి అయిన విద్యుత్, మంచినీటి సరఫరా వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరిగాయి.
కువైట్‌లోని పవర్ ప్లాంట్, ఉప్పునీటిని మంచినీరుగా మార్చే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారు? దీనికి కారణం ఏంటి? అన్నదానిపై స్పష్టత లేకపోయినా, దీని తీవ్రతను మాత్రం విస్మరించలేం. కువైట్ తన మంచినీటి అవసరాల కోసం దాదాపు 90 శాతం ఈ ప్లాంట్లపైనే ఆధారపడుతుంది. అంటే… ఇలాంటి కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంటే, యుద్ధం ఇప్పుడు యుద్ధరంగాల నుంచి సామాన్యుల ఇళ్లలోకి ప్రవేశించినట్లే! నీళ్లు, కరెంట్… ప్రజల జీవనాధార వ్యవస్థలన్నీ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఇక టెహ్రాన్ నుంచి వస్తున్న వార్తలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. యుద్ధం తారాస్థాయికి చేరిందనడానికి ఈ వీడియోనే బలమైన నిదర్శనం. ఇరాన్ అత్యున్నత నాయకుడి సలహాదారు చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ’చర్చల కాలం ముగిసింది… యుద్ధం మొదలైంది’ అంటూ ఆయన అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సైనిక చర్యలను ఆపకపోతే ‘పూర్తి స్థాయి దాడి’ తప్పదని, ఇక ఏ హద్దులూ ఉండవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందన్నది పక్కన పెడితే… ఇరు దేశాల మధ్య దౌత్యం మాయమై, బెదిరింపులు మొదలయ్యాయి. క్షిపణులు ఒకవైపు, మాటలు మరోవైపు ఆయుధాలుగా మారాయి. ఈ హెచ్చరికలు కేవలం వాషింగ్టన్‌ను మాత్రమే కాదు… ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కలవరపెడుతున్నాయి! సూర్యోదయం అయింది… దాడులు తగ్గాయి… కానీ రాత్రి జరిగిన గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఏది నిజం? ఏది అబద్ధం? అన్న సందిగ్ధంలో ప్రపంచం ఉంది. ఇప్పుడు పొగ మంచు వీడింది… కానీ, అసలు నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు మరో కొత్త యుద్ధం మొదలైంది!
మిడిల్ ఈస్ట్‌లో సూర్యోదయం అయింది… పేలుళ్ల శబ్దాలు తగ్గాయి. క్షిపణుల దాడులు ఆగిపోయాయి… మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సైనిక కమాండర్లు వ్యూహాలను సమీక్షిస్తుంటే, ప్రభుత్వాల నుంచి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అయితే, ప్రపంచమంతా ఇప్పుడు ఒక్కటే అడుగుతోంది… అసలు రాత్రి ఏం జరిగింది అని! రాత్రంతా సోషల్ మీడియాలో వీడియోల వరద! ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాని గందరగోళం. ప్రభుత్వాల ప్రకటనలు ఒకదానికొకటి పొంతన లేవు… సైనిక వర్గాల ఖండనలు ఒకవైపు… విచారణలు మరోవైపు! జర్నలిస్టులకు, విశ్లేషకులకు ఇది గడియారంతో జరుగుతున్న యుద్ధం. వార్తలను రిపోర్ట్ చేయడం కంటే, ఏది అసలైన వాస్తవమో తేల్చడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్. ఎందుకంటే, ఆధునిక యుద్ధం కేవలం యుద్ధభూమిలోనే కాదు… ఆన్ లైన్లో కూడా జరుగుతోంది. ప్రతి క్షిపణి వెనుక ఒక ప్రచారం… ప్రతి పేలుడు వెనుక ఒక వాదన… ఇప్పుడు ప్రతి వీడియో ఒక ఆయుధంగా మారింది! అయితే, గందరగోళం పక్కన పెడితే… ఒక చేదు నిజం మాత్రం కళ్ళముందు కదులుతోంది. యుద్ధం విస్తరించిన ప్రాంతం! కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ నుంచి… ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ, ఒమాన్… చివరకు హిందూ మహాసముద్రం వరకు వార్తలు వచ్చాయి. ఏది నిజమో, ఏది కాదో పక్కన పెడితే… ఈ ప్రాంతం మరో పెద్ద యుద్ధంలోకి జారుకుంటోందన్న భయం మాత్రం ఇప్పుడు నిజమైంది. చమురు మార్గాలు… విద్యుత్ కేంద్రాలు… మంచినీటి ప్రాజెక్టులు… సైనిక స్థావరాలు… అంతర్జాతీయ సముద్ర మార్గాలు… ఇవన్నీ చర్చల్లోకి వచ్చాయంటే, పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం మొదలైంది. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మార్కెట్లు కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి.
యుద్ధాన్ని కేవలం పేలిన క్షిపణుల సంఖ్యతో కొలవలేం. అది సృష్టించే భయం, అస్థిరత, సామాన్యుల జీవితాల విధ్వంసమే అసలైన కొలమానం. రేపు కరెంటు ఉంటుందా? స్కూళ్లు తెరుస్తారా? మన వ్యాపారాలు సురక్షితమేనా? అన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గుర్తుంచుకోండి… సరిహద్దులు మారకముందే, యుద్ధం మనుషుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది! చరిత్రను ఒక్కసారి గమనిస్తే… ప్రపంచాన్ని కుదిపేసిన ఎన్నో యుద్ధాలు, ఒక్క ప్రకటనతో మొదలవ్వలేదు. చిన్న చిన్న ఉద్రిక్తతలతో మొదలై… ఎప్పుడు అదుపు తప్పాయో తెలియని పరిస్థితుల్లోకి చేరాయి. ఇప్పుడు రాత్రి జరిగిన ఘటనలు… మరో భారీ యుద్ధానికి నాంది పలుకుతాయా? లేక దౌత్యం మళ్ళీ తెరపైకి వచ్చి, ఈ ప్రాంతాన్ని ప్రమాదం నుంచి గట్టెక్కిస్తుందా? అన్నది ఇప్పుడు చరిత్రే నిర్ణయించాల్సిన విషయం!” ఒక్క రాత్రి… డజన్ల కొద్దీ దాడులు… అంతులేని ప్రశ్నలు… కొన్ని నిజమని తేలాయి, ఇంకొన్ని ఇంకా వివాదాస్పదంగానే ఉన్నాయి. నేటి ప్రపంచంలో… వార్తా విశేషాలు వచ్చిన చాలా సేపటికి నిజం బయటపడుతుంది. మొదటి వైరల్ వీడియో, మొదటి క్షిపణి కంటే… అసలు ఏం జరిగిందో తెలుసుకోవడమే ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. ఎందుకంటే క్షిపణులు నగరాలను నాశనం చేస్తాయి… కానీ తప్పుడు సమాచారం చరిత్రనే మార్చేస్తుంది. యుద్ధం ఆగొచ్చు, పొగ తగ్గొచ్చు, దౌత్య చర్చలు జరగొచ్చు. కానీ, నిజం కోసం జరిగే పోరాటం మాత్రం… యుద్ధం కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది! చివరిగా ఒక్క విషయం… అందుబాటులో ఉన్న ఆధారాల మేరకు ఈ కథ మీ ముందుకు తెచ్చాను. కొన్నింటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చేకొద్దీ ఈ కథనంలో మార్పులు కూడా ఉండొచ్చు!









